
ఆంధ్రప్రదేశ్
తేల్చిచెప్పిన బ్యాంకర్లు
అధికారుల తీరుపై టిడ్కో లబ్ధిదారుల ఆందోళన
జక్కంపూడిలో ఆందోళన చేస్తున్న లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఐ మోహన్‌రెడ్డి
గొల్లపూడి, న్యూస్‌టుడే: పునాదులు దాటని ఇళ్లకు రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు తేల్చిచెప్పటంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కృష్ణాజిల్లా విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద లబ్ధిదారులు మంగళవారం ఆందోళన తెలియజేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు జక్కంపూడిలో నిర్మించిన ఇళ్ల వద్దకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులను రప్పించారు. అక్కడ పునాదులు దాటని ఇళ్లను లబ్ధిదారులకు చూపించి వాటినే కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అలాంటి ఇళ్లకు తాము రుణాలివ్వలేమని బ్యాంకు ప్రతినిధులు చెప్పి వెళ్లిపోయారు. గతంలో తమకు పూర్తిగా నిర్మించిన ఇళ్లను చూపి.. ప్రస్తుతం పునాదుల వద్ద నిలిచిన నిర్మాణాలను అధికారులు కేటాయించారని లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. అక్కడ నిర్మించిన ఇళ్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. దీనిపై అధికారులు టూటౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ మోహన్‌రెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడి సర్దిచెప్పారు. తాము నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామంటూ లబ్ధిదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.