రాజకీయ కక్షలతో బతికుండగానే చంపేశారు..

పింఛను దక్కని 35 మంది ఆవేదన

పామూరు, న్యూస్‌టుడే: పింఛను పొందేందుకు తాము అర్హులమైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు తాము చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారని ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని 35 మంది బాధితులు వాపోతున్నారు. న్యాయం చేయాలంటూ శుక్రవారం సుమారు 35 మంది బాధితులు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని నర్రమారెళ్ల, సుబ్బక్కపల్లి, చింతలపాలెం, బొట్లగూడూరు, బోడవాడ, రేణిమడుగు, పడమటికట్టకిందపల్లి, నుచ్చుపొద గ్రామాల్లో సుమారు 35 మంది డప్పు, చర్మ కళాకారులు వృద్ధాప్య పింఛన్లకు ఏడాది కిందటి నుంచి విన్నపాలనిస్తున్నారు. పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు వారి బయోమెట్రిక్‌ వివరాలనూ సేకరించారు. ఆగస్టు నుంచి పింఛను సొమ్ము అందుతుందని ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. స్థానిక సచివాలయానికి వెళ్లి విచారించగా.. వారు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదై ఉందని సిబ్బంది పత్రాలు చూపించారు. సాంకేతికంగా అలా జరిగిందని ఎంపీడీవో మల్లికార్జునరావు వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారులకు నివేదించి సమస్య పరిష్కరిస్తామన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని