కోతి మూక చేష్టలకు నిండు ప్రాణం బలి

ఐనవోలు, న్యూస్‌టుడే: వానర గుంపు చేసిన విధ్వంసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో వరంగంటి కమలాకర్‌రెడ్డి  నివాసంపైకి శనివారం రాత్రి కోతుల గుంపు చేరింది. ఇంట్లో సామగ్రిని చెల్లాచెదురు చేసింది. ఈ క్రమంలో ఇంటికి సంబంధించిన విద్యుత్తు తీగలు చెదిరిపోయాయి. ఆదివారం కమలాకర్‌రెడ్డి భార్య రజిత(45) ఇంటి వెనక  తీగపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. అది గమనించిన భర్త వెంటనే వచ్చి తప్పించే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా షాక్‌ కొట్టింది. కుటుంబ సభ్యులు చూసి కమలాకర్‌రెడ్డిని కర్రతో తప్పించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. రజిత అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ జి.వెంకన్న తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts