రోజంతా ఆలోచిస్తే.. సమస్య భారమే!

‘పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయేమో... క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో నేను సెలెక్ట్‌ అవుతానో లేదో... అందరూ సెలెక్ట్‌ అయ్యి నేను మాత్రమే మిగిలిపోతే నా పరిస్థితి ఏంటి?.’ లాంటి ఆలోచనలు సాధారణంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుంటాయి.  

లాంటి ఆలోచనలు పదేపదే వస్తుంటే మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది కూడా. వాటి నుంచి బయటపడాలంటే మరింత కష్టపడి పనిచేయాలి. మన దృష్టిని పని మీద కేంద్రీకరించినప్పుడే అది సాధ్యమవుతుంది. అంతేకాదు అనుకున్న లక్ష్యాన్నీ సాధించగలుగుతాం. అదెలాగో ఈ ప్రొఫెసర్‌ చెప్పిన ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం!

సైకాలజీ ప్రొఫెసర్‌ ఒకరోజు విద్యార్థులకు పాఠం చెబుతూ.. సగం నిండిన గ్లాసును టేబుల్‌ మీద పెట్టారు. ‘ఈ గ్లాసు బరువు ఎంత ఉంటుంది?’ అని అడిగారు. వంద గ్రాములని కొందరు, రెండువందల గ్రాముల వరకూ ఉంటుందని మరికొందరు సమాధానం చెప్పారు.

అప్పుడాయన... ‘ఒక్క నిమిషంపాటు దీన్ని పట్టుకుంటే అసలు బరువుగానే ఉండదు. పది నిమిషాలపాటు అలాగే పట్టుకుని ఉంటే బరువుగా అనిపిస్తుంది. కొన్ని గంటలపాటు లేదా రోజంతా దీన్ని పట్టుకుని ఉంటే చేతులు పట్టేసి నొప్పిగా ఉంటుంది కూడా. ఒత్తిడి విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరుగుతుంది. మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే విషయాల గురించి కాసేపు ఆలోచించి వదిలేస్తే పర్వాలేదు. కానీ గంటలకొద్దీ లేదా రోజంతా ఆలోచిస్తే అదే సమస్యగా మారుతుంది.’ అంటూ వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts