Liz Truss: నాడు తనకు తాను ఓటు వేసుకోని బాలిక.. ఇప్పుడు ప్రధాని రేసులో..!

ఆసక్తికరంగా లిజ్‌ ట్రస్‌ ప్రస్థానం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బ్రిటన్‌లో దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ పాఠశాలలో నిర్వహించిన నాటకంలో ఓ బాలిక మార్గరేట్‌ థాచర్‌ పాత్ర పోషించింది. ఆ నాటికలో ఉత్తుత్తి ఎన్నికలు నిర్వహించారు. దానికి ముందు అభ్యర్థులు ప్రసంగించాలి. ఆ బాలిక కూడా అలానే చేసింది.. కానీ, ఒక్క ఓటు కూడా ఆ బాలికకు రాలేదు. చివరికి తన ఓటు కూడా తనకు వేసుకోలేదు. దాదాపు 39 ఏళ్ల తర్వాత ఆ బాలిక ఇప్పుడు బ్రిటన్‌ ప్రధాని రేసులో హాట్‌ ఫేవరెట్‌గా నిలిచింది. ఆమే లిజ్‌ ట్రస్‌..!

బ్రిటన్‌ ప్రధాని పదవి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతారని తేలగానే.. ఆయన వారసుడిగా తొలుత వినిపించిన పేరు రిషి సునాక్‌..! కానీ, ప్రధాని పదవి కోసం కన్జర్వేటీవ్‌ పార్టీలో పోటీ ముదిరే కొద్దీ సునాక్‌ మెల్లగా వెనకబడుతూ వస్తున్నారు. తాజాగా రేసులో అందరికంటే ముందు నిలిచిన లిజ్‌ ట్రస్‌ ఇప్పుడు ప్రధాని పదవికి దగ్గరవుతున్నారు. పోటీ ముగింపు దశకు చేరేకొద్దీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా మారుతున్నాయి.

ఎవరీ లిజ్‌ ట్రస్‌..!

1975లో ఆక్స్‌ఫర్డ్‌లో వామపక్ష భావజాలం ఉన్న కుటుంబంలో లిజ్‌ ట్రస్‌ జన్మించారు. ఆమె తండ్రి లెక్కల ప్రొఫెసర్‌ కాగా.. తల్లి నర్స్‌. వారి కుటుంబం తర్వాత గ్లాస్గోకు వలసవెళ్లింది. ఆమె చిన్నప్పుడు తల్లితో కలిసి అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంది. అప్పట్లో అమెరికా అణ్వాయుధాలను రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ఉంచాలని నిర్ణయించారు. ఆ తర్వాత రౌండేలో స్కూల్‌ విద్యాభ్యాసం పూర్తి చేసి.. ఆక్స్‌ఫర్డ్‌లో చేరారు. అక్కడ ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌ను ఎంపిక చేసుకొన్నారు.

విద్యార్థి రాజకీయాల్లో లిబరల్‌ డెమోక్రాట్ల తరపున చురుగ్గా పాల్గొన్నారు. 1994లో ఆమె పార్టీలో ప్రసంగిస్తూ రాజరికాన్ని అంతమొందించాలన్నారు. లిబరల్‌ డెమోక్రాట్లు అందరికీ అవకాశాలు ఇవ్వడాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు. పాలించడం కోసమే కొందరు పుడతారనే దానిని విశ్వసించబోమని చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆమె కన్జర్వేటీవ్‌ పార్టీకి మారారు. డిగ్రీ తర్వాత ఆమె అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె హ్యూ ఓ లియారీని పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు సంతానం. 

ఓటములతో రాజకీయ ప్రస్థానం ప్రారంభం..

2001లో ఎన్నికల్లో కన్జర్వేటీవ్‌ పార్టీ తరపున ట్రస్‌ హెమ్స్‌వర్త్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి 2005 ఎన్నికల్లో కాల్డర్‌ వ్యాలీలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తొలిసారి ఆగ్నేయ లండన్‌లోని గ్రీన్‌ విచ్‌ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. 2008లో రైట్‌ ఆఫ్‌ సెంటర్‌ రిఫార్మ్‌ థింక్‌ట్యాంక్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా చేరారు. కన్జర్వేటీవ్‌ పార్టీ నేత డేవిడ్‌ కేమరూన్‌ 2010లో జరిగిన ఎన్నికలకు ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె నార్‌ఫోక్‌ నుంచి పోటీ చేయడానికి ఎంపికయ్యారు. అక్కడ 13,000 వేల ఓట్లతో గెలిచారు. 

విద్యాశాఖ మంత్రిగా..

2012లో ఆమె వ్యక్తిగత జీవితంపై విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పించాలనే యత్నం జరిగినా .. అది ఫలించలేదు. అదే ఏడాది ఆమె విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఈ క్రమంలో పాఠశాల సంస్కరణలపై డిప్యూటీ ప్రైమినిస్టర్‌ నిక్‌తో ఆమె గొడవపడ్డారు. 2014 నాటికి ఆమెను ప్రధాని కేమరూన్‌ తన కేబినేట్‌లోకి తీసుకొని.. పర్యావరణ శాఖ సెక్రటరీగా నియమించారు. 2015లో కన్జర్వేటీవ్‌ సదస్సులో ఆమె ‘‘మనం మూడింట రెండువంతులు ఛీజ్‌ దిగుమతి చేసుకొంటున్నాం’’ అంటూ చేసిన ప్రసంగం బ్రిటన్‌ దృష్టిని ఆకర్షించింది. 

బ్రెగ్జిట్‌ వ్యతిరేకి..

బ్రిటన్‌ చరిత్రలో జరిగిన అత్యంత కీలకమైన బ్రెగ్జిట్‌ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఐరోపా సమాఖ్యలో కొనసాగడానికే ఆమె మొగ్గు చూపారు. ఈయూ నుంచి విడిపోవడాన్ని పెద్ద విషాదంగా పేర్కొంటూ సన్‌ పత్రికకు ఎడిటోరియల్‌ రాశారు. బ్రెగ్జిట్‌ వల్ల వ్యాపారాల్లో మరింత జాప్యం చోటు చేసుకొంటుందని అభిప్రాయపడ్డారు. కానీ, బ్రెగ్జిట్‌కు బ్రిటన్‌లో ఆమోద ముద్రపడటంతో మనసు మార్చుకొన్నారు. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌లో పనితీరును మార్చుకోవచ్చని వాదించారు. 2016లో ఆమె థెరిస్సా ప్రభుత్వంలో జస్టిస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 

బోరిస్‌ హయాంలో కీలక పదవులు..

2019లో బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని అయ్యాక ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెక్రటరీగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. మరో రెండేళ్లకే బ్రిటన్‌ విదేశాంగశాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్‌లోని అత్యంత సీనియర్‌ పదవుల్లో ఇది కూడా ఒకటి. అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేపట్టింది. లిజ్‌ ట్రస్‌ మాస్కోకు వ్యతిరేకంగా బ్రిటన్‌ తరపున గళం వినిపించారు. కానీ, ఇది ఐరోపాలో తీవ్ర సంక్షోభం కావడంతో ఆమె పాత్రను బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఎక్కువగా పోషించాల్సి వచ్చింది. ఫలితంగా ట్రస్‌కు అనుకొన్నంత పేరు రాలేదనే చెప్పాలి. కానీ, బోరిస్‌ ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో మరోసారి లిజ్‌ ట్రస్‌ పేరు తెరపైకి వచ్చింది. రిషి పై జాన్సన్‌ గుర్రుగా ఉండటంతో.. ట్రస్‌కు తెరవెనుక మద్దతునిస్తున్నారు. ఫలితంగా ఆమె రేసులో ముందుకొచ్చారు.

మార్గరేట్‌ థాచర్‌ను అనుకరిస్తూ..

దాదాపు 1,60,000 మంది సభ్యులున్న కన్జర్వేటీవ్‌ పార్టీలో మద్దతు కోసం ఆమె శతవిధాలా యత్నిస్తున్నారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ వలే కనిపించేలా వస్త్రధారణ ఉండేట్లు జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల ఫిబ్రవరిలో రష్యా పర్యటన సమయంలో.. రిషితో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ శైలిని బ్రిటన్‌ మీడియా గుర్తించింది. లిజ్‌ ట్రస్‌ తన ప్రచారంలో ప్రజలకు తాయిలాలను ఇవ్వడాన్నే నమ్ముకొన్నారు. మొత్తం 30 బిలియన్‌ పౌండ్ల పన్ను రాయితీలను ఇస్తామనే హామీని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను ప్రజలు తట్టుకొనేలా చేయడం కోసమే ఇదంతా అని  ఆమె పేర్కొన్నారు. ఆమె ఆర్థిక ప్రతిపాదనలకు ట్రస్సోనమిక్స్‌గా పేరుపెట్టారు. 1980ల్లో మార్గరేట్‌ థాచర్‌ కూడా వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గిస్తామని జనాకర్షక నిర్ణయం ప్రకటించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని