Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం

(ఫొటో సోర్స్‌: ఛెతేశ్వర్‌ పుజారా ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: ఛెతేశ్వర్‌ పుజారా తన శైలికి భిన్నంగా అదరగొట్టేస్తున్నాడు. తాజాగా రాయల్ లండన్ వన్‌డే కప్‌ -2022 పోటీల్లో వరుసగా రెండో శతకం బాదేశాడు. సస్సెక్స్‌ జట్టు తరఫున ఆడుతున్న పుజారా ప్రత్యర్థి సర్రేపై 131 బంతుల్లో ఏకంగా 174 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. రెగ్యులర్ సారథి టామ్‌ హైన్స్‌ గైర్హాజరీలో కెప్టెన్‌ బాధ్యతలను చేపట్టిన పుజారా బీభత్సంగా ఆడాడు. 3.2 ఓవర్లలో 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన పుజారా మరొక బ్యాటర్ టామ్‌ క్లార్క్ (104)తో కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 205 పరుగులను జోడించాడు. జట్టు స్కోరు 350 పరుగుల వద్ద పుజారా పెవిలియన్‌కు చేరాడు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన సస్సెక్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 378 పరుగులు సాధించి సర్రేకు భారీ లక్ష్యం నిర్దేశించింది. ప్రస్తుతం సర్రే ఛేదనలో పోరాడుతోంది. 

రెండు రోజుల కిందట వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఛెతేశ్వర్‌ పుజారా (107) సెంచరీ బాదాడు. అయితే తన జట్టు సస్సెక్స్‌ను మాత్రం గెలిపించుకోలేకపోయాడు. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సస్సెక్స్‌ 306/7 స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్‌ ఆ జట్టు ఓపెనర్‌ రాబర్ట్‌ యేట్స్‌ (114), డబ్ల్యూ రోడ్స్‌ (76), బర్గెస్‌ (58) రాణించడంతో 50 ఓవర్లలో 310 పరుగులు చేసింది. అనంతరం పుజారా శతకంతో రాణించినా ఇన్నింగ్స్‌ 48.1వ ఓవర్‌ వద్ద పెవిలియన్‌కు చేరడంతో కేవలం నాలుగు పరుగుల తేడాతో సస్సెక్స్ ఓటమిపాలైంది.


మరిన్ని

ap-districts
ts-districts