Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!

నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత తేదీ ఇప్పటికే ఖరారైంది. చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి హాని కలగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఈ కూల్చివేత ప్రక్రియను చేపడుతోన్న ఎడిఫైస్ ఇంజినీరింగ్‌ సంస్థ వెల్లడించింది. ‘పై నుంచి నీరు అమాంతం కిందకు దుమికినట్లు.. ఈ భవనాలు కుప్పకూలుతాయి’ అని ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది ఒకరు వెల్లడించారు. 

‘ఈ కూల్చివేత నేపథ్యంలో పక్కన ఉన్న భవన యజమానులతో మేం చర్చిస్తున్నాం. మేం తీసుకుంటున్న చర్యల పట్ల వారు సంతృప్తిగా ఉన్నారు. కూల్చివేత సమయంలో వెలువడే దుమ్ము, శిథిలాల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నెట్స్‌, పెరిమీటర్ కర్టైన్స్‌ వంటివి ఏర్పాటు చేశాం. పేలుడుతో వచ్చే ప్రకంపనల వల్ల పక్కనున్న భవనాలకు ఎలాంటి హాని కలగకుండా కుషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పేలుడుకు ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో స్థానికులను ఖాళీ చేయిస్తాం. అలాగే దుమ్ము కూడా మరో ఏడెనిమిది నిమిషాల్లో ఆగిపోతుంది. పేలుడు ప్రారంభం కాగానే ఆ టవర్స్‌ వివిధ దశల్లో అంతస్తుల వారీగా లోపలికి పడిపోతాయి. శిథిలాల తొలగింపుపై చర్చిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ పరిధిలో నోయిడాలో సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్ టెక్‌ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణం విషయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. తాజాగా ఈ కూల్చివేత డెడ్‌లైన్‌ను సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ఈ నిర్దిష్ట తేదీ నుంచి సెప్టెంబర్‌ 4వరకు కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. సాంకేతికత, వాతావరణ పరిస్థితుల కారణంగానే కూల్చివేత తేదీని పొడిగించినట్లు స్పష్టం చేసింది. ఈ పేలుడు కోసం 3,500 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు వాడనున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts