Akhilesh Yadav: దేశానికి సేవ చేయాలనుకునేవారు ‘అగ్నివీర్‌’ కావాలనుకోరు!

లఖ్‌నవూ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ యోజన(Agnipath Yojana) పథకంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి సేవ చేయాలనుకునేవారు ఎప్పటికీ అగ్నివీర్‌ కావాలని కోరుకోరన్నారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో తన భార్య డింపుల్‌ యాదవ్‌ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని భాజపా ముక్కలు చేస్తోందని ఆరోపించారు. అగ్నివీర్‌ యోజనలాంటి పథకాలతో బడ్జెట్‌ని ఆదా చేస్తున్నామని కేంద్రం చెబుతోందని.. కానీ దేశం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నప్పుడు బడ్జెట్‌ ఆదాతో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. మాజీ సైనికులంతా బూత్‌ స్థాయిలో బలోపేతంగా పనిచేస్తే ఈ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. మాజీ సైనికుల మాటలను ప్రజలు విశ్వసిస్తారని.. వారి మద్దతు ఉంటే తమ పార్టీని గెలుపు నుంచి ఎవరూ అడ్డుకోలేరని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ను గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ములాయం కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సియాచిన్‌కు వెళ్లారని.. అక్కడ చాలా చల్లగా ఉంటుంది గనక దోతి, కుర్తా ధరించొద్దని చెప్పినా వినకుండా అలాగే వెళ్లారని గుర్తు చేశారు. రష్యాకు కూడా నేతాజీ దోతి కుర్తాలోనే వెళ్లారని.. అప్పుడు రష్యా అధ్యక్షుడే ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ఆయనకు స్వాగతం పలికారన్నారు. తన తండ్రి కృషి వల్లే ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే అంత త్వరగా పూర్తయిందన్న అఖిలేశ్‌.. 2016 నవంబర్‌ 26న ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైనప్పుడు అక్కడ ఫైటర్‌ జెట్‌లు ల్యాండ్‌ అయ్యాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం హయాంలో రైతుల సౌకర్యార్థం ఎక్స్‌ప్రెస్‌వేకు ఇరువైపులా  మార్కెట్లను ఏర్పాటు చేస్తే.. భాజపా ఆ పథకాన్ని నాశనం చేసిందని విమర్శించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు