CM Jagan Tour: అంతటా ఆంక్షలు.. అందరికీ కష్టాలు

ఈనాడు డిజిటల్‌-శ్రీకాకుళం, న్యూస్‌టుడే-నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పలాస గ్రామీణం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్‌ పర్యటనతో ప్రజలు నానాకష్టాలు పడ్డారు. ఎక్కడికక్కడ ఆంక్షలతో విసుగెత్తిపోయారు. పోలీసులు నరసన్నపేట పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. శ్రీకాకుళంతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. బందోబస్తుకు దాదాపు 2వేల మంది పోలీసులు వచ్చారు. సభా ప్రాంగణం నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. నాలుగు గంటల పాటు ఆ మార్గంలో రహదారిపై ఎవరినీ వెళ్లనివ్వలేదు. ప్రజారవాణా స్తంభించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు మూడు కిలోమీటర్లు కాలినడకన జాతీయ రహదారికి వెళ్లి.. అక్కడ బస్సులు, ఇతర వాహనాలు ఎక్కాల్సి వచ్చింది. విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్‌ బంకులు లేకపోవడంతో వాహనాలను తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

ప్రారంభం నుంచే వెనుదిరిగిన ప్రజలు

సభ మొదలైన కొద్దిసేపటికే ప్రజలు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. సీఎం జగన్‌ మాట్లాడుతున్నప్పుడూ జనం బయటకు వెళ్తూనే ఉన్నారు. పోలీసులు, స్థానిక నేతలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆగలేదు. నల్లదుస్తులు ధరించిన అయ్యప్ప మాలధారులను లోపలికి అనుమతించలేదు. నల్లరంగు టోపీలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* లోపలికి వెళ్లేవారికి ‘థాంక్యూ సీఎం సార్‌’ అని ఆంగ్లంలో రాసి ఉన్న బోర్డుల్ని అందించారు. చాలామంది వాటిని అక్కడే పడేశారు. కొందరు ఆ బోర్డులను ఎండలో అడ్డుపెట్టుకునేందుకు ఉపయోగించుకున్నారు.

* ఇతర ప్రాంతాల ప్రజల్ని బస్సుల్లో సభకు తీసుకొచ్చారు. ఆ వాహనాల్ని ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలో నిలిపివేశారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలామంది మధ్యలోనే ఆగిపోయి, దుకాణాల దగ్గర సేదతీరారు.

* నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పార్కింగ్‌ స్థలంగా మార్చేశారు. సభకు వచ్చిన వీఐపీల వాహనాలను అక్కడికి మళ్లించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు