సంక్షిప్త వార్తలు (12)

వేల్స్‌పై గోల్‌.. పీలే అభినందనలు

దోహా: అమెరికా ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాడు టిమతి వేయా ఆనందంలో మునిగిపోయాడు. ప్రపంచకప్‌లో వేల్స్‌తో ఆ జట్టు 1-1తో డ్రాగా ముగించిన మ్యాచ్‌లో అతను గోల్‌ కొట్టాడు. అయితే అతని సంతోషం కేవలం గోల్‌ కొట్టినందుకు మాత్రమే కాదు.. ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే నుంచి అభినందనలు అందుకున్నందుకు కూడా. ప్రపంచకప్‌ అరంగేట్రంలో గోల్‌ చేసిన అతణ్ని పీలే ప్రశంసించాడు. పీలే తర్వాత ప్రపంచకప్‌లో వేల్స్‌పై తొలి గోల్‌ చేసిన ఆటగాడిగా టిమతి నిలిచాడు. వేల్స్‌ చివరగా 1958లో ప్రపంచకప్‌లో ఆడినప్పుడు అప్పుడు 17 ఏళ్ల వయసులో పీలే గోల్‌ కొట్టాడు. మళ్లీ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో ఆడుతున్న వేల్స్‌పై ఇప్పుడు టిమతి గోల్‌ చేశాడు. గోల్‌ సంబరాలకు సంబంధించిన ఫొటోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. దీనికి ‘‘అభినందనలు. ఇదో అందమైన గోల్‌. కలలు కంటూనే ఉండు. అవి నిజమవుతాయి’’ అని పీలే కామెంట్‌ చేశాడు. 22 ఏళ్ల టిమతి.. లిబేరియా అధ్యక్షుడు జార్జ్‌ వేయా తనయుడు. అంతే కాదు జార్జ్‌ 1995లో ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడిగానూ నిలిచాడు. జాతీయ జట్టు తరపున 75 మ్యాచ్‌ల్లో 18 గోల్స్‌ చేశాడు.


క్రొయేషియాను నిలువరించిన మొరాకో

అల్‌ ఖోర్‌: ప్రపంచకప్‌లో మరో అరబ్‌ దేశం ఆశ్చర్యకరంగా బలమైన ప్రదర్శన చేసింది. పట్టుదలతో ఆడిన మొరాకో గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో 2018 రన్నరప్‌ క్రొయేషియాను 0-0తో నిలువరించింది. క్రొయేషియా కెప్టెన్‌ మోర్డిచ్‌ను ఆపగలిగింది. అప్పటికీ అతడు ఓ చక్కని అవకాశాన్ని సృష్టించుకున్నాడు. తొలి అర్ధభాగంలో అతడి షాట్‌ క్రాస్‌బార్‌ పై నుంచి వెళ్లింది.


మాంచెస్టర్‌ను వీడిన రొనాల్డో

దోహా: ఓ వైపు ఫిఫా ప్రపంచకప్‌ మ్యాచ్‌లు హోరెత్తిస్తుంటే.. మరోవైపు మాంచెస్టర్‌ యునైటెడ్‌, క్రిస్టియానో రొనాల్డో మధ్య బంధం తెగిపోవడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచకప్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో యునైటెడ్‌ మేనేజర్‌ ఎరిక్‌ టెన్‌, క్లబ్‌ యాజమాన్యంపై ఈ స్టార్‌ ఆటగాడు తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో పరస్పర అంగీకారంతో క్లబ్‌తో అతని ఒప్పందం సీజన్‌ మధ్యలోనే రద్దయింది. ఛాంపియన్స్‌ లీగ్‌లో చివరకు 16 జట్ల పోరాటం మిగిలింది. ఈ నేపథ్యంలో అతణ్ని సొంతం చేసుకునేందుకు ఏ క్లబ్బులు పోటీపడతాయానే ఆసక్తి నెలకొంది.


నాకౌట్‌కు దూరమైన హైదరాబాద్‌, ఆంధ్ర

దిల్లీ: అఖిల భారత విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌, ఆంధ్ర జట్లకు నిరాశ ఎదురైంది. టోర్నీలో స్ఫూర్తిమంతమైన ప్రదర్శన కనబరిచినా.. నాకౌట్‌ చేరుకోవడంలో విఫలమయ్యాయి. గ్రూపు-ఎలో సౌరాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, హైదరాబాద్‌, చండీగఢ్‌ తలా 20 పాయింట్లతో వరుసగా తొలి నాలుగు స్థానాలు సాధించాయి. అయితే మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కలిగిన సౌరాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లు నాకౌట్‌ చేరుకున్నాయి. గ్రూపు-సిలో తమిళనాడు (24), కేరళ (20) ముందంజ వేయగా.. ఆంధ్ర (18) మూడో స్థానంలో నిలిచింది. గ్రూపు-బి నుంచి కర్ణాటక (24), అస్సాం (24).. గ్రూపు-డి నుంచి పంజాబ్‌ (24), జమ్మూకాశ్మీర్‌ (20).. గ్రూపు-ఇ నుంచి మహారాష్ట్ర (24), ముంబయి (16) నాకౌట్‌ చేరుకున్నాయి. నిబంధనల ప్రకారం అయిదు గ్రూపుల్లో తొలి స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి. ద్వితీయ స్థానాల్లో నిలిచిన అయిదు జట్లు ప్రిక్వార్టర్స్‌లో తలపడనున్నాయి. ప్రిక్వార్టర్స్‌లో మరో బెర్తు కోసం ఇరవయ్యేసి పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ (0.513), ఝార్ఖండ్‌ (1.064) రేసులో నిలిచాయి. అయితే మరోసారి హైదరాబాద్‌ను దురదృష్టం వెంటాడింది. నెట్‌ రన్‌రేట్‌ కారణంగా హైదరాబాద్‌కు ప్రిక్వార్టర్స్‌ బెర్తు దూరమైంది. ప్రిక్వార్టర్స్‌లో విజేతగా నిలిచే మూడు జట్లు క్వార్టర్‌ఫైనల్లో పోటీపడతాయి.

నలుగురు అర్ధసెంచరీలు

గ్రూపు-ఎ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 110 పరుగుల ఆధిక్యంతో చండీగఢ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 306 పరుగులు చేసింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (52), రోహిత్‌ రాయుడు (68), భవేశ్‌ సేథ్‌ (71), రాహుల్‌ బుద్ధి (57 నాటౌట్‌) అర్ధ సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం చండీగఢ్‌ 46.3 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌రెడ్డి (3/21), శశాంక్‌ (3/34), తనయ్‌ త్యాగరాజన్‌ (2/42) మెరిశారు. గ్రూపు-సి ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్‌ 8 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర 42.3 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. నితీశ్‌కుమార్‌రెడ్డి (50) ఒక్కడే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బదులుగా చత్తీస్‌గఢ్‌ 26.3 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు సాధించింది.


డేవిస్‌ కప్‌ సెమీస్‌లో ఆసీస్‌

మాలాగా: డేవిస్‌ కప్‌లో ఆస్ట్రేలియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌ పోరులో ఆసీస్‌ 2-0తో నెదర్లాండ్‌ను చిత్తుచేసింది. 2017 తర్వాత ఆసీస్‌ సెమీస్‌ చేరుకోవడం ఇదే తొలిసారి. తొలి సింగిల్స్‌లో జోర్డాన్‌ థామ్సన్‌ 4-6, 7-5, 6-3తో టాలాన్‌ గ్రీక్‌స్పూర్‌పై గెలుపొందాడు. అలెక్స్‌ డి మినార్‌ 5-7, 6-3, 6-4తో వాన్‌డర్‌ జాండ్‌షుల్ఫ్‌పై నెగ్గి ఆసీస్‌కు విజయాన్ని అందించాడు. డేవిస్‌ కప్‌లో అత్యధిక టైటిళ్లు సాధించిన రెండో అత్యుత్తమ జట్టు ఆసీస్‌. ఇప్పటి వరకు 28 సార్లు విజేతగా నిలిచింది. 2003లో చివరి సారిగా టైటిల్‌ నెగ్గింది. 32 టైటిళ్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.


మరో 4 పతకాలు ఖాయం

దిల్లీ: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మరో నాలుగు పతకాలు ఖాయం చేసుకుంది. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీస్‌ చేరుకున్న ముస్కాన్‌ (75 కేజీ), తమన్నా (50 కేజీ), కీర్తి (ప్లస్‌ 81 కేజీ), దేవిక (52 కేజీ)లకు పతకాలు ఖాయమయ్యాయి. దీంతో ఈ టోర్నీలో భారత్‌ ఖాయం చేసుకున్న పతకాల సంఖ్య 11కు చేరుకుంది. క్వార్టర్‌ఫైనల్స్‌లో జుని తొనెగావా (జపాన్‌)పై ముస్కాన్‌, అస్యా ఎరి (జర్మనీ)పై దేవిక, అజింబయ్‌ (మంగోలియా)పై ముస్కాన్‌, లివియా బొటికా (రొమేనియా)పై కీర్తి విజయం సాధించారు.


జైపుర్‌కు పుణెరి కళ్లెం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొమ్మిదో సీజన్‌లో పుణెరి పల్టాన్‌ జోరు కొనసాగుతోంది. హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడు మీదున్న జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌కు ఆ జట్టు కళ్లెం వేసింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 39-32 తేడాతో జైపుర్‌పై గెలిచింది. అర్జున్‌ (19) రాణించడంతో ఆరంభంలో జైపుర్‌ 6-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పుంజుకున్న పుణెరి ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 16-14తో నిలిచింది. అదే ఊపులో 20-16తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత మరోసారి జైపుర్‌ను ఆలౌట్‌ చేసిన పుణెరి 27-18తో విజయం దిశగా సాగింది. చివరి వరకూ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. అస్లామ్‌ (9), మోహిత్‌ (7) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 41-38తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.


పారా షూటర్ల పతక మోత

దిల్లీ: ప్రపంచ పారా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. మూడు స్వర్ణాలు సహా అయిదు పతకాలతో ఈ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో దేశం తరపున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. యూఏఈలో జరిగిన పోటీల్లో పట్టికలో అయిదో స్థానంలో భారత్‌ నిలిచింది. 20 పతకాలతో దక్షిణ కొరియా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 2019లో మూడు కాంస్యాలు నెగ్గడమే గతంలో భారత అత్యుత్తమ ప్రదర్శనగా ఉండేది. ఇప్పుడు పారా షూటర్లు దీన్ని అధిగమించారు. టీమ్‌ విభాగాల్లోనే మూడు స్వర్ణాలు, ఓ రజతం రావడం విశేషం. రాహుల్‌ ఒక్కడే వ్యక్తిగత (పీ3 మిక్స్‌డ్‌ 25మీ. పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్స్‌లో కాంస్యం) పతకం సాధించాడు. పీ3 టీమ్‌, పీ5 మిక్స్‌డ్‌ 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ స్టాండర్స్‌ ఎస్‌హెచ్‌1, పీ1 పురుషుల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1లో బంగారు పతకాలు దక్కాయి.


ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌పై సుప్రీంలో విచారణ

దిల్లీ: భారీ అంచనాల మధ్య హైదరాబాద్‌లో శ్రీకారం చుట్టుకుని.. తొలి రౌండ్‌ను అర్ధంతరంగా వాయిదా వేసిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)పై సుప్రీంలో విచారణ జరగనుంది. ఈ రేసు నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు నిరాకరించిన దిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ పిటిషన్‌పై సత్వరమే వాదనలు వినాలని సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ కోరగా.. ఈ నెల 25న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమ కోహ్లి, జస్టిస్‌ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ లీగ్‌ నిర్వాహక సంస్థ రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌పీపీఎల్‌)లో డైరెక్టర్‌, వాటాదారు అయిన ఓ వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఐఆర్‌ఎల్‌ గురించి సమాచారాన్ని సంస్థ బోర్డు రహస్యంగా ఉంచిందని, రేసు తేదీల వివరాలను తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి తెలుసుకోవాల్సి వచ్చిందని అందులో అతను పేర్కొన్నాడు. భారత మోటార్‌స్పోర్ట్స్‌ క్లబ్‌ సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఈ లీగ్‌కు అనుమతి పొందారని, దీన్ని రద్దు చేయాలని అతను కోరాడు. ఇదే విషయంపై ఈ నెల 18న దిల్లీ హైకోర్టు అనుమతి రద్దు చేసేందుకు నిరాకరించింది. లీగ్‌ కోసం కార్లు దిగుమతి చేసుకుంటున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసని, చట్ట ప్రకారం ప్రాదేశిక అధికార పరిధి దాటి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. దేశంలో తొలిసారి ఈ ఐఆర్‌ఎల్‌ను నిర్వహిస్తున్నారు. తొలి, నాలుగో రౌండ్‌ రేసులు కొత్తగా నిర్మించిన హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో, మిగతా రెండు రేసులు చెన్నైలో జరుగుతాయి. ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ రేసులు జరిగాయి. 20న ప్రధాన రేసులు జరగాల్సి ఉండగా.. క్వాలిఫయింగ్‌ రేసులో భాగంగా కార్లు ఢీ కొని ఓ రేసర్‌కు గాయాలు కావడంతో వీటిని రద్దు చేశారు.


టెన్నిస్‌ లీగ్‌కు పుణె ఆతిథ్యం

పుణె: టెన్నిస్‌ ప్రిమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) నాలుగో సీజన్‌కు పుణె ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబరు 7 నుంచి 11 వరకు పుణెలోని బాలెవాడి స్టేడియంలో టీపీఎల్‌ జరుగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ‘‘డిసెంబరు 7న ప్రారంభమయ్యే టీపీఎల్‌ను చూసేందుకు బాలెవాడి స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోతుందన్న నమ్మకంతో ఉన్నా’’ అని ఐటా సంయుక్త కార్యదర్శి సుందర్‌ అయ్యర్‌ తెలిపాడు.


షెడ్యూల్‌ ప్రకారమే పాక్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు

కరాచి: రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నా పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ల మధ్య తొలి టెస్టు షెడ్యూల్‌ ప్రకారమే జరుగనుంది. డిసెంబరు 1 నుంచి 5 వరకు రావల్పిండిలో తొలి టెస్టు నిర్వహించనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌తో పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా, పాక్‌లో బ్రిటీష్‌ హై కమిషనర్‌ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 26, 27 తేదీల్లో రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో భారీ ర్యాలీకి ఇమ్రాన్‌ పిలుపునిచ్చాడు. మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం కలగదని, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు భద్రత సమస్యలు ఉండబోవని బ్రిటీష్‌ హై కమిషనర్‌కు రమీజ్‌, ఇమ్రాన్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబరు 9 నుంచి 13 వరకు ముల్తాన్‌లో రెండో టెస్టు, 17 నుంచి 21 వరకు కరాచిలో మూడో టెస్టు జరుగనుంది.


సారథిగా ఎదిగా: ధావన్‌

దిల్లీ: సారథిగా పరిణతి సాధించానని, కఠిన నిర్ణయాలు తీసుకోగలనని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న శిఖర్‌ ధావన్‌ అన్నాడు. ధావన్‌ ఇంతకుముందు శ్రీలంక (2-1), దక్షిణాఫ్రికా (2-1), వెస్టిండీస్‌ (3-0)తో భారత ద్వితీయశ్రేణి జట్టును నడిపించి మంచి ఫలితాలు సాధించాడు. ‘‘ఆడుతున్నకొద్దీ మరింత ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇంతకుముందు గౌరవం కొద్దీ బౌలర్‌కు అదనపు ఓవర్‌ ఇచ్చేవాణ్ని. కానీ ఇప్పుడు పరిణతి సాధించా. ఏ బౌలర్‌ ఏమనుకున్నా సరే.. జట్టుకు ఉపయోపడే నిర్ణయాలే తీసుకుంటా’’ అని ధావన్‌ చెప్పాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని