శాస్త్రోక్తంగా వరసిద్ధుడి ధ్వజస్తంభ ప్రతిష్ఠ

కాణిపాకం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠను గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో పాత ధ్వజస్తంభాన్ని తొలగించారు. కొత్త ధ్వజస్తంభానికి, యంత్రాలకు ప్రత్యేక అభిషేకం అనంతరం భారీ క్రేన్‌ సహాయంతో అన్వేటి మండపంలో ప్రతిష్ఠించారు. దీనికి బంగారు తాపడం చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం దుర్గా రామశర్మ(మణి) రూ.2.70 కోట్ల విలువైన సుమారు 7 కిలోల స్వర్ణాన్ని విరాళంగా అందించనున్నారు. గురువారం అర కిలో బంగారాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో సురేశ్‌బాబులకు అందించారు. త్వరలో మిగతా మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ఆలయంలో ఈ నెల 15 నుంచి 21వరకు మహాకుంభాభిషేకం కారణంగా ఆ రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 21న మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించమని, 24 నుంచి అన్ని ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts