Industries: పరిశ్రమయేవ జయతే!

ప్రగతి బాటలో దేశ పారిశ్రామిక రంగం
ముందున్నది ఉజ్వల భవిత

భారత్‌లోని కుటీర పరిశ్రమల్లో తయారై వస్తున్న సన్నటి, మెత్తటి దుస్తులు, కళాఖండాలపై మనదేశ మహిళలు, ధనవంతులు మనసు పారేసుకుంటున్నారు. వాటిని సొంతం చేసుకునేందుకు బంగారాన్ని వదులుకుంటున్నారు. ఇదిలాగే కొనసాగితే ఇండియా నుంచి వచ్చే దుస్తులు, కళాఖండాలతో బ్రిటన్‌ నిండిపోతుంది.  ఈ ఆందోళనకర పరిణామంపై చట్టసభలు దృష్టి సారించాలి.

17వ శతాబ్దంలో బ్రిటన్‌ పార్లమెంటులో తరచూ జరిగిన చర్చ ఇది మన వ్యాపారులంతా భారత్‌లో తయారైన నౌకలనే కొంటున్నారు. మరమ్మతులకూ అక్కడికే వెళుతున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? మా ఓడలన్నా కొనేలా చేయండి... మాకు వేరే ఉద్యోగాలైనా చూపించండి.

బ్రిటన్‌లో నౌకాపరిశ్రమ కార్మికులు 18వ శతాబ్దంలో  పలుమార్లు ధర్నాలు చేస్తూ వినిపించిన డిమాండ్‌ ఈ రెండు ఉదాహరణలు నాటి భారతీయ ఉత్పత్తుల సత్తా ఏమిటో చెబుతున్నాయి.

సుసంపన్న భారతదేశంలో దొరుకుతున్న అత్యద్భుతమైన వస్తువులను సేకరించి, తమ దేశంలో అమ్ముకుని, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా ఆంగ్లేయులు తొలుత ఇక్కడికి వచ్చారు. ఇండియాలో అడుగు పెట్టాక కుట్రలు, కుతంత్రాలతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మన దేశంలోని అపార సహజ వనరులను ఆలంబనగా చేసుకుని, బ్రిటన్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మలిచారు. ఇక్కడ దొరికే ముడి పదార్థాలను శుద్ధి చేయించి, బ్రిటన్‌కు తరలించేవారు. ఈ క్రమంలో భారతీయ చేనేత, హస్తకళలు, కలప, నౌకా నిర్మాణ పరిశ్రమలను సర్వనాశనం చేశారు. సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్య్రం తెచ్చుకున్నాక... పారిశ్రామిక రంగాన్ని నెమ్మదిగా గాడిన పెట్టే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం ప్రపంచ పారిశ్రామిక రంగంలో భారత్‌ 9వ స్థానానికి చేరింది. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు అవుతున్న నేపథ్యంలో... నాటి నుంచి ఇప్పటి వరకు పారిశ్రామిక రంగంలో జరిగిన అభివృద్ధి, ఇందుకోసం జరిగిన కృషి, 25 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లపై ‘ప్రత్యేక కథనం’....

భారత్‌లో పారిశ్రామికీకరణ 1854లో బొంబాయిలో మొదటి పత్తి-జౌళి మిల్లుతో ప్రారంభమైంది. బ్రిటిష్‌ వలస పాలనకు ముందు దేశం స్వయం-పోషక ఆర్థిక వ్యవస్థ, ప్రాథమిక రంగంపై ఆధారపడింది. పత్తి, సిల్క్‌ ఉత్పత్తులు, కళాత్మక వస్తువులు, ఖనిజ ఉత్పత్తులు, పట్టు, ఉన్ని వస్త్రాలు సహా అనేక వస్తువులకు ఇది ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశ పారిశ్రామికరంగం చాలా దయనీయ స్థితిలో ఉంది. సాంకేతికంగానూ వెనుకబాటే. ఆనాడు కేవలం పత్తి, జనపనార పరిశ్రమలే ఉండేవి. దీంతో స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చేలా పారిశ్రామిక విధానాలకు తెరతీసింది. 1949లో భారతీయ కర్మాగారాల చట్టం రూపొందించింది. 1951 నాటి మొదటి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసింది. అన్ని పరిశ్రమలపై నియంత్రణాధికారాలు కలిగి ఉండేలా బొగ్గు, పెట్రోలియం, విమానయానం, ఉక్కు మొదలైనవన్నీ ప్రభుత్వ పరిధిలో చేర్చింది. 1953లో గణాంక నిపుణుడు ప్రశాంతచంద్ర నిర్దేశించిన ఆర్థిక అభివృద్ధి నమూనాను ఈ ప్రణాళికలో చేర్చగా... దానికి అనుగుణంగా దేశంలో అనేక జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాల నిర్మాణం చేపట్టారు.

వృద్ధి ఇలా..

1965-66 నుంచి 1975-76 మధ్య కాలంలో మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో సంవత్సరానికి 4.2% మాత్రమే పెరుగుదల ఉండగా, 1979-80 నుంచి 1984-85 వరకు పెరుగుదల సంవత్సరానికి 9.7%గా ఉంది. మౌలిక సదుపాయాల పెట్టుబడి 1985-86లో 16%, 1986-87లో 18.3% పెరిగింది.

స్థిరంగా ప్రగతి..

1951 నుంచి 1979 వరకు ప్రణాళికాబద్ధమైన, నియంత్రిత విధానాలు సాగగా.. 1980లలో పారిశ్రామికరంగం స్థిరమైన వృద్ధిరేటును సాధించింది. అప్పుడే డీలైసెన్సింగ్‌ విధానానికి అనుమతినిచ్చారు. 1991లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన నూతన ఆర్థిక విధానంతో పారిశ్రామికరంగంలో పెను మార్పులొచ్చాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల ప్రభావంతో ఈ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. సంస్కరణలు వేగం అందుకున్నాయి. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. బహుళజాతి కంపెనీలు పెరిగాయి. పోటీతత్వంతో పారిశ్రామిక మార్కెట్లు పురోగమించాయి.

మేటిగా ఐటీ

1968లో ముంబైలో టాటా కంప్యూటర్‌ సిస్టమ్స్‌ (తర్వాత కాలంలో ఇదే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌- టీసీఎస్‌గా మారింది) ఏర్పాటుతో దేశంలో ఐటీ పరిశ్రమ ప్రారంభమైంది. 1977లో దేశం నుంచి ఐటీ ఎగుమతులు మొదలయ్యాయి. 1991లో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) అనే సంస్థ ప్రారంభమైంది. సరళీకృత నిబంధనల మేరకు 1993లో ప్రభుత్వం కంపెనీలకు అనుమతులు మంజూరు చేయగా... పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటయ్యాయి. నాటి నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణె తదితర నగరాల్లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకుంది.

ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ ఎగుమతిదారుల్లో భారత్‌ ఒకటి. దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా 10%. ఐటీ ఆదాయంలో 79% ఎగుమతుల రూపంలోనే వస్తోంది.

నీతి ఆయోగ్‌ సిఫారసులు

పెద్దఎత్తున మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులను అభివృద్ధి చేయాలి. బంగారు గనుల  నుంచి నిల్వల వెలికితీతపై దృష్టి సారించాలి. స్వేచ్ఛా విపణి (ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌)లపై దృష్టి సారించాలి. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లను అభివృద్ధి చేయాలి.

చిన్నవైనా.. మిన్నగా..

దేశ పారిశ్రామిక రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలకపాత్ర వహిస్తున్నాయి. జీడీపీలో తయారీ రంగంలో 6.1%, సేవా రంగంలో 24.63%, ఎగుమతుల్లో 45% వాటా ఈ పరిశ్రమలదే. వీటితో 12 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది.

ఆహారశుద్ధి రంగ మార్కెట్లో దేశం ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. ఉత్పత్తిలో అయిదో స్థానం, ఎగుమతుల్లో ఆరో స్థానంలో నిలుస్తోంది.

సెజ్‌లతో లక్షల మందికి ఉపాధి

విదేశాలకు ఎగుమతుల లక్ష్యంతో అనేక మినహాయింపులు కల్పిస్తూ 2004లో ప్రత్యేక ఆర్థిక మండళ్ల విధానాన్ని కేంద్రం తెచ్చింది. దేశంలో 425 సెజ్‌లకు అనుమతులివ్వగా అందులో 68% అంటే 265 మాత్రమే ఏర్పాటయ్యాయి. 22.84 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటి నుంచి ఏటా రూ.లక్ష కోట్ల మేరకు ఎగుమతులు జరుగుతున్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు భేష్‌

జీడీపీలో ఎలక్ట్రానిక్స్‌ రంగం వాటా 3.4%. దేశంలో ఏటా రూ.5.32 లక్షల కోట్ల విలువైన వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. రూ.1.19 లక్షల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల (2047) నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా.

2050 నాటికి ప్రపంచంలో చైనా, అమెరికాల తర్వాత మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దే అవుతుందన్న అంచనాలు ఆశలు రేపుతున్నాయి. దీన్ని సాకారం చేసేలా ఇదే సమయానికి జీడీపీలో తయారీ రంగ వాటా 35 శాతానికి, సేవారంగ పరిశ్రమ వాటా 55 శాతానికి చేరవచ్చని నిపుణుల అంచనా.

ఆరోగ్యసంరక్షణ, బీమా, ఔషధ, సంప్రదాయేతర ఇంధన, ఐటీ, స్థిరాస్తి, వాహన తయారీ రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది.

దేశంలో సుమారు మూడు వేల ఔషధ సంస్థలు, 10,500 పరిశ్రమలున్నాయి. ఔషధరంగం మార్కెట్‌ విలువ రూ.4.76 లక్షల కోట్లకు చేరింది. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో స్థిరమైన వృద్ధి కారణంగా భారత్‌ ‘ప్రపంచ ఫార్మసీ’గా పేరొందుతుండడం మన ఔషధ పరిశ్రమల సత్తాకు తార్కాణం.

కొవిడ్‌ సంక్షోభం అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద అనేక వస్తుసామగ్రి దిగుమతులకు బదులు సొంత తయారీ దిశగా అడుగులు పడుతున్నాయి. ః విదేశీ బహుళజాతి సంస్థలను దేశంలోకి ఆహ్వానించి పెద్దఎత్తున ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాల పెంపుదలకు 2014 ఆగస్టు 15న మోదీ ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థూల జాతీయోత్పత్తిలో తయారీరంగం ప్రస్తుత వాటా 16% నుంచి... 22 శాతానికి పెంపు, పది కోట్ల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నిర్దేశించుకున్న ఈ కార్యక్రమం కింద 25 రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించింది. దీనిపైనా మన పారిశ్రామికరంగ భవిత ఆధారపడి ఉంది.

- ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని