22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు

ముఖ్యఅతిథిగా హాజరు కానున్న సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఎంపీ కేశవరావు అధ్యక్షతన గల నిర్వహణ కమిటీ నిర్ణయించింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలను సమీకరిస్తామని, సినీ తారలు కూడా పాల్గొంటారని కేశవరావు వెల్లడించారు. ముగింపు వేడుకలపై గురువారం బీఆర్‌కే భవన్‌లో కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, నగర మేయర్‌ విజయలక్ష్మి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు గౌరీశంకర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడారు. ‘‘ఈ నెల 22న వజ్రోత్సవాల ముగింపు సభలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ అధ్యక్షురాలు దీపికారెడ్డి బృందం ఆధ్వర్యంలో దీపాంజలి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకులు శంకర్‌ మహదేవన్‌ బృందం దేశభక్తి గీతాల సంగీత విభావరి, లేజర్‌ షో, బాణసంచా ప్రదర్శన ఉంటాయి. ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరుగుతుంది. ఆ సమయంలో అన్ని రహదారుల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసి ఆలపించాలి. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి. వాహనాల్లో ఉన్నవారు సైతం కిందికి దిగి జాతీయ గీతాన్ని గౌరవించాలి’’ అని కేశవరావు కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడం రన్‌

వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం పెద్దఎత్తున ఫ్రీడం రన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 5కే రన్‌ను హోంమంత్రి మహమూద్‌ అలీ జెండా ఊపి ప్రారంభించారు. కేబీఆర్‌ పార్కు నుంచి ప్రారంభమైన పరుగులో మంత్రి తలసాని, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పోలీసులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

* రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు కేంద్ర రక్షణరంగ సంస్థ డీఆర్‌డీవో ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు కంచన్‌బాగ్‌లో ఫ్రీడం వాక్‌ నిర్వహించారు.

* బాన్సువాడలో ఫ్రీడం రన్‌కు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం స్థానిక థియేటర్‌లో ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి ఆయన వీక్షించారు. మంత్రుల్లో సబితారెడ్డి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం నుంచి ఎల్బీనగర్‌ కూడలి వరకు నిర్వహించిన పరుగులో పాల్గొన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌లో, నిరంజన్‌రెడ్డి వనపర్తిలో, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో, గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో, ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూరులో, సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌లో, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ హనుమకొండలో, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో ఫ్రీడం రన్‌లో పాల్గొన్నారు. కరీంనగర్‌, తొర్రూర్‌లలో భారీ జాతీయ పతాకాలతో నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

* యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నగర సంకీర్తన చేపట్టారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీతారాముల చిత్రపటంతో, జాతీయ జెండాలతో ఆలయ, గిరి ప్రదక్షిణ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని