విభజించే అంశాలు వద్దు.. ఐక్యతను చాటాలి

- మంత్రి కేటీఆర్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలిచేలా అందరూ ఐక్యంగా ఉండే దిశగా ఆలోచనలు చేయాలి తప్ప.. విభజించే అంశాలపై కాదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ ఆంధ్రా సబ్‌-ఏరియా(టాసా) ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన మెగా ఈవెంట్‌ వేడుకలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం అనే సూక్తికి భారతదేశం నిదర్శనమన్నారు.  మంత్రిగా వివిధ దేశాల పెట్టుబడిదారులతో సమావేశమైనప్పుడు చాలామంది చైనాతో మన దేశాన్ని పోలుస్తుంటారని తెలిపారు. జనాభాపరంగా చైనాతో సమానంగా ఉన్న భారత్‌లో అక్కడ అవలంబించే పద్ధతుల్లో కొన్నింటిని ఎందుకు పాటించకూడదని వారు ప్రశ్నిస్తుంటారని చెప్పారు. ఏ దేశంతోనూ భారత్‌ను పోల్చలేమని వారికి చెబుతుంటానన్నారు. దేశంలో అనేక భాషలు, సంప్రదాయాలు, వేషధారణలు, ఆహారపు అలవాట్లు ఉన్నా.. 75 ఏళ్లుగా పౌరులంతా ప్రజాస్వామ్యాన్ని ఎలా నడిపించాలో ప్రపంచ దేశాలకు చాటిచెబుతున్నారని వివరించారు. భిన్న మతాలు, కులాలు, సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ దేశభక్తి అందర్నీ ఒక్కటి చేస్తోందని తెలిపారు. 75 ఏళ్లలో అనుకున్నమేర ప్రగతి సాధించకపోయినా మనది గొప్ప దేశమేనని చెప్పారు. కార్యక్రమంలో దక్షిణ భారత ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసీ) లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.అరుణ్‌, టాసా జీవోసీ మేజర్‌ జనరల్‌ రంజిత్‌సింగ్‌ మన్రాల్‌, స్టేషన్‌ కమాండర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి అధ్యక్షుడు బ్రిగేడియర్‌ సోమశంకర్‌తోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, కాలి గాయంతో దాదాపు మూడు వారాలుగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్న మంత్రి కేటీఆర్‌ ఆదివారం తొలిసారిగా పరేడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.


మరిన్ని

ap-districts
ts-districts