అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణికి రష్యాలో 9 ఏళ్ల జైలు

ఖిమ్కీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ప్రముఖ అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి బ్రిట్నీ గ్రైనర్‌ను ఓ రష్యా కోర్టు దోషిగా తేల్చింది. ఈమేరకు ఖిమ్కీలోని న్యాయస్థానం జడ్జి ఆమెకు గురువారం 9 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఆమె ఫిబ్రవరిలో అరెస్టయి కస్టడీలో ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి శిక్షాకాలాన్ని పరిగణించాలని పేర్కొంటూ జడ్జి తీర్పునిచ్చారు. 31 ఏళ్ల ఆమె మాదకద్రవ్యాలను అక్రమంగా రష్యాకు తీసుకొచ్చినట్లు న్యాయమూర్తి  పేర్కొన్నారు. తీర్పును వెలువరించే ముందు ఆమె కోర్టుకు తుది విజ్ఞాపన చేశారు. ఫిబ్రవరిలో బాస్కెట్‌బాల్‌ ఆడేందుకు గాను ఆమె మాస్కోకు వచ్చారు.  కొన్ని రకాల మాదకద్రవ్యాలను తీసుకువచ్చినట్లు కేసు నమోదైంది. తనకు శిక్ష పడటం పట్ల గ్రైనర్‌ కొంతమేర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెకు శిక్ష పడిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ అమెరికా, రష్యాల మధ్య ఓ ప్రతిపాదిత ఒప్పందంపై పడింది. ఖైదీల మార్పిడికి సంబంధించి ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య ప్రతిపాదన ఇది. దీని ప్రకారం గ్రైనర్‌తో పాటు, గూఢచర్యం కింద దోషిగా తేలి రష్యాలో జైలుశిక్ష పడిన అమెరికన్‌ పాల్‌ వెలాన్‌లను విడుదల చేసే విషయం చర్చనీయాంశమైంది.


మరిన్ని

ap-districts
ts-districts