దక్షిణ కొరియా రాజధానిని ముంచెత్తిన వరద

1942 తర్వాత అత్యధిక వర్షపాతం

9 మంది మృతి

సియోల్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి ఇక్కడ కుంభవృష్టి కురియడంతో రహదారులు నదుల్లా మారిపోయాయి. సబ్‌వే స్టేషన్లు జలదిగ్బంధమయ్యాయి. వరదల కారణంగా కనీసం 9 మంది మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. సోమవారం రాత్రి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు నీటమునిగిపోయాయి. 800 భవనాలు దెబ్బతిన్నాయి. 1,380 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. కొన్ని చోట్ల గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజులపాటు వర్షపాతం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. వీధుల్లో భారీగా వరద నీరు చేరుతూ ఉండడం వల్ల సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఓ ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న ఇంట్లో ఉన్న ముగ్గురిని రక్షించడం సిబ్బందికి సాధ్యం కాలేదు. సియోల్‌ సమీపంలోని ఇంచియాన్‌, గ్యాంగీల్లో గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సియోల్‌లోని డాంగ్జాక్‌ జిల్లాలో గంటకు 141.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 1942 నుంచి ఇదే అత్యధికం. సియోల్‌లో భారీ వర్షపాతానికి రవాణా వ్యవస్థ స్తంభించింది. నగరంలో రైల్వే సేవలు పూర్తిగా ఆగిపోయాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని