close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాక్సిన్‌ వచ్చినా మాస్కులు తప్పనిసరి

వెల్లడించిన అమెరికా పరిశోధకురాలు

దిల్లీ: కరోనా నివారణ వాక్సిన్‌ వచ్చినా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాల్సిందేనని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బేలర్ మెడికల్‌ కాలేజ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్న మరియా ఎలెనా బొటాజ్జి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వ్యాక్సిన్‌ కరోనాను తగ్గిస్తుందేమో కానీ పూర్తిగా తొలగించలేదని పేర్కొన్నారు. ‘వాక్సిన్‌ వేసుకున్నాక గత సంవత్సరం ఎలా ఉన్నానో అలాగే ఉందాం అని ప్రజలు అనుకోవచ్చు. కానీ అది తప్పు. మొదట వ్యాక్సిన్‌ అద్భుతాలు సృష్టించకపోవచ్చు. ఒక్కసారిగా పరిస్థితిని నయం చేయలేదు. కొవిడ్‌ను పూర్తిగా తొలగించకపోవచ్చు. మాస్కులు దరిస్తూ, భౌతిక దూరం పాటించాల్సిందే’ అని బొటాజ్జి పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. అందులో 26 టీకాలకు మానవులపై ప్రయోగించేందుకు అనుమతి లభించింది. ఈ 26లో 5 మూడో (చివరి) దశ క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. కాగా చివరి దశలో వేలాది మంది వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో టీకా భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. కరోనా అత్యవసర సమయంలో వినియోగించేందుకు మోడెర్నా, ఫిజర్, ఆస్ట్రాజెనెకా లాంటి కంపెనీలు వైరస్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో మానవులపై రెండు రకాల వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు.

జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 17.5 మిలియన్ల ప్రజలు కొవిడ్‌ బారిన పడ్డారు. మహమ్మారితో 6,78,775 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. దేశంలో 17 లక్షల మందికి వైరస్‌ సోకగా 36,511 మంది మృతిచెందారు. 
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు