close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పసి వయసుకు తేజో మంత్రం!  

ఆరేళ్ల బాలికను చిదిమేసిన మృగాడికి సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు మరణశిక్ష విధించింది.అలాంటి సంఘటనలను రోజూ ఎక్కడోచోట వింటూనే ఉంటున్నాం. ఎన్నెన్నో చూస్తున్నాం... అలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు చేస్తోన్న ఓ ప్రయత్నమే తేజో భారత్‌. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు  శ్రీకాళహస్తికి చెందిన కోలా విశాలి.
‘ముక్కుపచ్చలారని పసిపిల్లలపై లైంగిక వేధింపుల వార్తలు వింటున్నప్పుడల్లా...మనసు విలవిల్లాడిపోయేది. ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాక స్పందించడం కంటే..ఇలాంటివి జరగకుండా నియంత్రించడమే మేలు’ అంటారు కోలా విశాలి.  ‘మంచేదో, చెడేదో తెలుసుకుని...ముప్పుని పసిగట్టి తప్పించుకునే జ్ఞానం పసిపిల్లలకు ఉండదు కదా! అందుకే ఆడ, మగ తేడా లేకుండా పిల్లలందరూ ఈ తరహా దారుణాలకు బలవుతున్నారు. నా కొడుక్కి రెండున్నరేళ్లు ఉన్నప్పుడు ఎవరో అతడితో తప్పుగా ప్రవర్తించారు. అది తెలిసి తల్లిగా నేనెంత తల్లడిల్లిపోయానో చెప్పలేను. ఈ పరిస్థితి కేవలం ఏ ఒక్కరికో మాత్రమే ఎదురవుతుందనుకునే రోజులు కావివి. కాస్త దృష్టి పెట్టి చూస్తే పసిపిల్లలను సైతం కామంతో తడిమే రాబందులు మన చుట్టూనే ఉన్నారని అర్థమవుతుంది. అందుకే పిల్లల్లో అవగాహన తీసుకురావాలనుకున్నా’ అని చెబుతారు విశాలి.
గ్రామీణ విద్యార్థులకోసం... కోలా విశాలిది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. దూరవిద్యద్వారా ఏంఏ చేసిన ఆమె...చిన్నప్పటి నుంచీ చేసే పని ఏదైనా నలుగురికీ ఉపయోగపడేది అయి ఉండాలనుకునేవారు. ‘భద్రమైన బాల్యం...పిల్లల బంగారు భవిష్యత్తుకి మూలం’... అలాంటి అందమైన బాల్యాన్ని నిరుపేద చిన్నారులకు అందివ్వాలని కోరుకున్నారామె. ‘ఈ మధ్య కాలంలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు కొంతవరకూ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ నిరుపేద చిన్నారులు, అందునా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు ఎక్కువగా లైంగిక దోపిడీకి గురవుతున్నా...నోరువిప్పి చెప్పలేని దైన్యం వారిది. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలను ఎంచుకుని వారికి ఈ తరహా పాఠాలు చెప్పాలనుకున్నా.  మొదటి అడుగుగా తేజోభారత్‌ పేరుతో 2018లో ఓ ఎన్‌జీవోను ఏర్పాటు చేశా. ప్రస్తుతం శ్రీకాళహస్తి పక్కన ఉన్న పదుల సంఖ్యలోని గ్రామాల్లో మా సేవలు అందిస్తున్నా’ అంటారామె.
టూల్‌ ద్వారా... ‘పిల్లలకు ఏదో చెప్పేశాం...వచ్చేశాం అనుకుంటే చెవికెక్కించుకోరు. ఆట, పాటలతో అర్థమయ్యేలా చెప్పగలగాలి. అందుకోసమే ఓ టూల్‌ని రూపొందించాం. దాని సాయంతో ప్రయోగాత్మకంగా సూచనలు చేస్తాం. ఆపద నుంచి తమని తామెలా కాపాడుకోవాలో చెబుతాం’ అంటారు విశాలి. బాధిత చిన్నారులు ఉంటే వారిని గుర్తించి వైద్యుల సాయంతో కౌన్సెలింగ్‌ చేస్తారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకూ అవగాహన కల్పిస్తారు. ఇలా ఇప్పటివరకూ సుమారు 27 వేల మంది చిన్నారులకు చేరువయ్యారామె. ఇదే కాదు పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ‘వి ఫరెవర్‌’ పేరుతో ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను తయారు చేసి ఐదువేల మందికి అందించారు.  

-రాజేశ్‌ కుమార్‌ బ్రహ్మాండం, శ్రీకాళహస్తి


మరిన్ని