close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నేర్చుకుంటూనే పెంచొచ్చు...!

పిల్లలు ప్రతి నిమిషం బాల్యాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటారు. స్పందించే హృదయం మీకుంటే.. వాళ్లను ఎంతో ఆనందంగా పెంచొచ్చు. వారి పెంపకాన్ని బరువైన బాధ్యతలా భావించకుండా ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించి చూడండి.
* మీరెంత పనుల్లో తలమునకలై ఉన్నా వారి ఆటపాటలను కాస్త ఆసక్తిగా గమనించండి. మధ్యలో మాట కలపండి. వాళ్లు అడిగే అమాయకమైన ప్రశ్నలు నేరుగా మీ హృదయాన్ని తాకుతాయి. మీ జ్ఞాపకాలను తట్టి లేపుతాయి.
* ఎంతసేపూ.. కొత్తగా వాళ్లకేం నేర్పించాలా... అని కసరత్తులు చేయకండి. వాళ్ల నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయాలూ చాలానే ఉంటాయి. ఇదేంటి మరీ వింతగా చెబుతున్నారని ఆశ్చర్యపోవద్దు. తరచి చూస్తే.. ఎన్నో విషయాల్లో పిల్లలే మీకు గురువులవుతారు.
* మీ చిన్నారులు చుట్టుపక్కల పిల్లలతో ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకుంటూనే ఉంటారు. పనులతో తీరిక లేకుండా ఉండే మీరు... పక్కవాళ్లను పలకరించి ఎన్ని రోజులైందో ఒక్కసారి గుర్తుచేసుకోండి.
* ఆటల్లో భాగంగా ఎంత పోట్లాడుకున్నా.. వాళ్లు మళ్లీ కలిసిపోయి చక్కగా ఆడుకుంటారు. చిన్నమాట పట్టింపుతో మీరు ఎదుటివాళ్లను దూరంగా పెట్టి ఎంతకాలమైందో ఒక్కసారి ఆలోచించండి.
* చిన్నారులు తమ దగ్గర ఉన్న ఆటవస్తువులు, తినుబండరాలు.. ఇలా ప్రతిదీ తోటివారితో పంచుకుంటారు. వారి నుంచి ఇతరులకు సాయం చేయాలనే ఆలోచనను మనం నేర్చుకోవచ్చు.
* చిన్నారులు తమకు ఇష్టమైన వస్తువులు పాడైనప్పుడు వాటిని బాగు చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. అది కాస్త మెరుగుపడగానే సంతోషిస్తారు. ఈ విధానాన్ని మనకూ అన్వయించుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అలా వదిలేకుండా సాధ్యమైనంత వరకు పరిష్కరించుకునేలా ప్రయత్నించాలి.


మరిన్ని