close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కశ్మీరు అంటే... అమ్మ భయపడింది

కశ్మీరు లోయలో... ఉద్రిక్త పరిస్థితులు తరచూ వినిపించే వార్త! కర్ఫ్యూ విధింపు.. తరచూ కనిపించే దృశ్యం! ఉగ్రవాదుల దుశ్చర్యలు, తుపాకుల మోతలు పతాక శీర్షికల్లో వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగమంటే... అదీ ఆ పరిస్థితులను అదుపు చేసే పనంటే... లక్షలిచ్చినా... ధైర్యం చేయం. తెలుగింటి బిడ్డ ఐపీఎస్‌ నిత్య మాత్రం  మహిళా పోలీసు అధికారిగా... కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తోంది.  ఉద్రిక్తతల మధ్య ఉత్సుకతతో పనిచేస్తున్న నిత్య తన అనుభవాలు వసుంధరతో ప్రత్యేకంగా పంచుకుంది.

క్షం రోజులుగా కశ్మీర్‌లో కర్ఫ్యూ నడుస్తోంది. కమ్యూనికేషన్‌ లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. గస్తీకి వెళ్లిన చోట... ఎప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయో చెప్పలేం. స్థానికులు ఎవరో వస్తారు.. ‘అమ్మా! మావాళ్లకు ఫోన్‌ చేయాలి?’ అని అడుగుతారు. వారి పిల్లలతో మాట్లాడాలని అంటారు. నా ఫోన్‌లో మాట్లాడిస్తా. కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి సమయాల్లో గుండె బరువెక్కుతుంది. ఎక్కడ విజయవాడ... ఎక్కడ కశ్మీర్‌ లోయ!

ప్రశాంతత నుంచి ఉద్రిక్తం వైపు
అమ్మ శాంతి, నాన్న వెంకటరత్నం. నేను పుట్టింది గుడివాడ పామర్రు మధ్య జమీ గొల్లేపల్లి గ్రామంలో. నా చిన్నప్పుడే నాన్న వ్యాపారరీత్యా మేం చండీగఢ్‌లో స్థిరపడ్డాం. నేను అక్కడే పెరిగా. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేశా. అన్నయ్య నేవీలో పని చేస్తున్నాడు. చదువు పూర్తయ్యాక ఓ సిమెంటు సంస్థలో మేనేజరుగా చేరా.   ఏదైనా ఛాలెంజింగ్‌గా చేయాలనిపించింది. సివిల్స్‌ రాశా. రెండోసారి అర్హత సాధించా. 2016 బ్యాచ్‌లో ఐపీఎస్‌ శిక్షణకు హైదరాబాద్‌ వచ్చా. రెండేళ్ల శిక్షణ తరువాత గతేడాది కశ్మీర్‌లో పోస్టింగ్‌ వచ్చింది. శ్రీనగర్‌లోని నెహ్రూపార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో చేరా. చండీగఢ్‌లో మా ఊరు ప్రశాంతతకు మారుపేరు. అక్కడ పెరిగిన నేను... కశ్మీర్‌లో పని చేస్తున్నా.

నేనొక్కదాన్నే...
ఇక్కడ రోజూ ఏదో సందర్భంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అలజడులు, అల్లర్లు, కర్ఫ్యూలు, 144 సెక్షన్‌, దోపిడీలు, కిడ్నాప్‌లు ఇలా ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్‌. మొదట్లో నా బాధ్యతలు నిర్వర్తించడంలో చాలా కష్టపడినా... నెమ్మదిగా అలవాటుపడ్డా. నేరపరిశోధక విభాగంలో సబ్‌ డివిజనల్‌ అధికారిగా పనిచేస్తున్నా. నా పరిధిలో మూడు పోలీస్‌ స్టేషన్లుంటాయి. ఈ లోయలో నేన్కొదాన్నే మహిళా పోలీసు అధికారిని. 40 కిలోమీటర్ల పరిధిని పర్యవేక్షించాలి. పెట్రోలింగ్‌ నిర్వహించాలి. రామ్‌మున్షీ బాగ్‌, హర్వాన్‌ దగ్చి గ్రామాల మధ్య ప్రాంతమంతా నా అధీనంలో ఉంటుంది. దాల్‌ సరస్సు పరిసరాల్లో నివసించేవారంతా వీవీఐపీలే. రాజ్‌భవన్‌ ఉండేదీ ఇక్కడే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా పర్యవేక్షిస్తుండాలి. ఒక్కోసారి ప్రజలు రోడ్లపైకి వచ్చి, నిరసనల్లో పాల్గొంటారు. అలాంటి సమయాల్లో మాపై తిరగబడిన సందర్భాలూ ఉంటాయి. వారికి మెల్లగా నచ్చజెప్పి పరిస్థితులను అదుపు చేయాల్సి వస్తుంది.

నిద్రలేని రాత్రులెన్నో...
కర్తవ్య నిర్వహణలో పట్టుదలతో పాటు ధైర్యం ఉండాలి. ఏ క్షణంలో ఫోన్‌ వస్తుందో చెప్పలేం. అర్ధరాత్రైనా వెళ్లాల్సి వస్తుంది. ఓసారి ఓ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం వచ్చింది. సీనియర్లతో కలిసి వెళ్లా. సీఆర్‌పీఎఫ్‌ దళాలూ మాతో ఉన్నాయి. వేకువజామున రహస్య మార్గాల్లో తీవ్రవాదుల అడ్డాకు చేరుకున్నాం. ఆ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులను మన బలగాలు హతమార్చాయి. ఇలాంటి సమయాల్లో ప్రతి సెకనూ విలువైనదే. ఇటీవల 370 రద్దు పరిణామాలు, ప్రజాప్రతినిధుల గృహ నిర్బంధం నేపథ్యంలో చాలా ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

ఆ కళ్లల్లో కృతజ్ఞత
నేర పరిశోధనలోనూ సవాళ్లు మామూలే.  దోపిడీలు, హత్యలు, ఘర్షణలు, కిడ్నాప్‌ కేసులు వస్తూనే ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడే వారూ ఉంటారు. వారిని పట్టుకోవడం కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ నేను చేపట్టిన కేసుల్లో దాదాపు అన్నింటినీ పరిష్కరించా. కిడ్నాప్‌ కేసులో బాధితులను దుండగుల చెర నుంచి విడిపించి.. వారింటికి వెళ్లి దిగబెట్టిన సందర్భాలెన్నో. అప్పుడు ఆ కుటుంబీకుల కళ్లల్లో కనిపించే కృతజ్ఞతను ఎన్నటికీ మరచిపోలేను.

లాఠీతో రంగంలోకి..
ఓసారి స్థానిక ఆసుపత్రిలో ఓ తల్లీబిడ్డ చనిపోయారు. అక్కడి రోగులే కాదు స్థానికులూ ఆందోళనకు దిగారు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్నా. భారీగా ట్రాఫిక్‌ జామ్‌. ఎంత నచ్చజెప్పినా ఎవరూ వినకపోవడంతో లాఠీ చేత పట్టుకొని రంగంలోకి దిగా. అందరూ చెదిరి పోయారు. కొన్ని సమయాల్లో దండోపాయమే కరెక్ట్‌. లేదంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయి. ఇలాంటి సవాళ్లు ఎన్ని ఉన్నా... వాటిని ఎదుర్కో వడంలోనే అసలైన ఆనందం ఉంటుందని నమ్ముతా.

ప్రతి క్షణం థ్రిల్లింగే...
ఇక్కడ ఉద్యోగం అనగానే అమ్మ చాలా భయపడింది. నేను విధుల్లో చేరిన కొన్నాళ్లకే... రాష్ట్రంలో గవర్నర్‌ పాలన వచ్చింది. దాంతో పరిస్థితులు మారుతూ వచ్చాయి. సాధారణ ఎన్నికలు ఆ వెంటనే అమర్‌నాథ్‌ యాత్రతో ఊపిరి సలపని పని. దీనికి తోడు 370 అధికరణ రద్దు, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ఊహించని మలుపు. ఈ ప్రభావాలన్నీ మాపై ఉంటాయి. వీఐపీలకు భద్రత కల్పించడం మా బాధ్యత. ప్రజల ఆందోళనలు సరేసరి. ఒక్కోసారి మమ్మల్ని టార్గెట్‌ చేస్తారు. మిలటరీ వాహనాల్లో, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి ఆయుధాలతో విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. ఒక రోజును ప్రారంభించేటప్పుడు ఈ రోజు ఫలానా పనులు చేయాలని అనుకుంటాం కదా! గంటల్లోనే అన్నీ మారిపోతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అన్నిటినీ ఎదుర్కోవాలి. ధైర్యంగా ముందుకుసాగాలి. నేను కోరుకున్న థ్రిల్‌ ఇక్కడ టన్నులకొద్దీ దొరుకుతోంది.

మనమే నిరూపించుకోవాలి

విధుల్లో చేరిన కొత్తల్లో ఇక్కడి భాష, సంప్రదాయం పరిశీలించేదాన్ని. మొదట్లో అర్థంకాక ఇబ్బందిపడ్డా... తోటి ఉద్యోగులు సహకరించారు. లింగ వివక్ష ప్రతిచోట ఉంటుంది. దాన్ని దాటి మనల్ని మనం నిరూపించుకోవాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంపత్‌తో పెళ్లైంది. మాది ప్రేమ వివాహం. తను చెన్నైలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా ఉన్నారు.

మరిన్ని