close

తెలంగాణ

కేంద్రానికి తగిన సమయం ఇవ్వాలి 

కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తేయాలని చెప్పలేం 
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

దిల్లీ, శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో పరిస్థితి చాలా సున్నితంగా ఉందని, అక్కడ సాధారణ స్థితి నెలకొల్పేందుకు ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఆంక్షలు ఎత్తేయాల్సిందిగా కేంద్రానికి ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదావేసింది. జమ్మూ-కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను కాంగ్రెస్‌ కార్యకర్త తెహసీన్‌ పూనావాలా సుప్రీంకోర్టులో సవాలుచేశారు. ప్రభుత్వం రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తోందని, దానికి తగ్గట్టుగా ఆంక్షలు సడలిస్తోందని జస్టిస్‌ అరుణ్‌మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. అక్కడ ఏం జరుగుతోందో తెలియట్లేదని, సాధారణస్థితి నెలకొనడానికి కొంత సమయం ఇవ్వాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాత్రికి రాత్రే ఏమీ చేయలేమని, ప్రాణాలు పోకుండా చూసుకోవడమే ముఖ్యమని స్పష్టంచేసింది. జమ్మూ-కశ్మీర్‌లో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించాలని కశ్మీర్‌ టైమ్స్‌ పత్రిక సంపాదకురాలు అనూరాధా భాసిన్‌ కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలుచేశారు.

దండలేసి స్వాగతించరు: పాక్‌ 
పాక్‌ ప్రజలు పిచ్చోళ్ల స్వర్గంలో ఉండొద్దని, ఐరాస భద్రతామండలిలో మద్దతు సంపాదించడం అంత సులభం కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ వ్యాఖ్యానించారు. ‘‘మీరు పిచ్చోళ్ల స్వర్గంలో ఉండకూడదు. భద్రతా మండలిలో ఎవరూ చేతిలో దండలు పట్టుకుని మీకోసం వేచి ఉండరు’’ అన్నారు. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ముస్లిం వర్గ పరిరక్షకులు కూడా కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు పలకకపోవచ్చని చెప్పారు.

గవర్నర్‌ విమానం అక్కర్లేదు: రాహుల్‌ 
జమ్మూ: కశ్మీర్‌లో పర్యటించేందుకు జమ్మూ-కశ్మీర్‌ గవర్నర్‌ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మంగళవారం స్వాగతించారు. అయితే తనకు విమానం అక్కర్లేదనీ... తనతోపాటు ప్రతిపక్ష నేతల బృందం జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లలో పర్యటిస్తుంది కాబట్టి... ఆ సందర్భంగా సామాన్య ప్రజలను, నాయకులను, సైనికులను కలిసేందుకు స్వేచ్ఛ ఇస్తే చాలన్నారు. 
విపక్ష నేతలను కూడగట్టి కశ్మీర్‌ లోయలో అశాంతిని సృష్టించాలని రాహుల్‌గాంధీ యోచిస్తున్నారని, అందుకే తన పర్యటనకు షరతులు పెడుతున్నారని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు.

మధ్యవర్తిత్వ ఆలోచన లేదు: ట్రంప్‌ 
కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలన్న ఆలోచన ఇక లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేసినట్లు ఆ దేశంలో భారత రాయబారి హర్ష్‌వర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. భారత్‌, పాకిస్థాన్‌ రెండు సమ్మతిస్తేనే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్‌ చెప్పారని, అందుకు భారత్‌ అంగీకరించలేదు కాబట్టి ఇక ఆ ప్రస్తావన రాబోదన్నారని ష్రింగ్లా అన్నారు. మరోవైపు.. కశ్మీర్‌లో పరిస్థితులపై విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు లేఖ రాసేముందు భారతీయ అమెరికన్లను సంప్రదించనందుకు అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు టామ్‌ సౌజి వారికి క్షమాపణలు చెప్పారు.

సరదాగా కాసేపు 

జమ్మూ-కశ్మీర్‌లో నిరంతరం భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళనతో ప్రజలు దాదాపుగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇవేమీ ఎరుగని బాలలు మంగళవారం శ్రీనగర్‌లో ఇలా బొమ్మ తుపాకులు తీసుకుని వీధుల్లోకి వచ్చారు. విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది దగ్గరకు వచ్చి కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఎప్పుడూ ఆందోళనతో ఉండే సిబ్బంది కూడా ఆటవిడుపుగా పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు