close

బిజినెస్‌

ఐఫోన్‌11 వచ్చేసింది

11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ ఆవిష్కరణ
5వ తరం యాపిల్‌ వాచ్‌ కూడా
13 నుంచి ముందస్తు బుకింగ్‌లు
20 నుంచి అమ్మకాలు
క్యూపర్టినో (కాలిఫోర్నియా), అమెరికా

ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేసింది. గతేడాది ఐఫోన్‌ టెన్‌ శ్రేణి ఫోన్లతో ఆకర్షించిన యాపిల్‌ సంస్థ, మంగళవారం ఇక్కడి తమ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌లో ఆహ్లాదకరంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించింది. అత్యంత శక్తిమంతమైన ఏ13 బయోనిక్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఈ ఫోన్‌ల ప్రత్యేకతగా సంస్థ ప్రకటించింది. ఇదేవిధంగా సిరీస్‌ 5 యాపిల్‌వాచ్‌ను, 7వ తరం ఐప్యాడ్‌ను కూడా కూడా సంస్థ విడుదల చేసింది. ఈనెల 13 నుంచి ఈ ఫోన్ల కోసం బుకింగ్‌ చేసుకోవచ్చని, ఈనెల 20 నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని ప్రకటించింది.

ఇవీ ఆవిష్కరణలు

యాపిల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిమ్‌ కుక్‌ తొలుత యాపిల్‌ టీవీ ప్లస్‌ సేవలను ఆవిష్కరించారు. నవంబరు 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. నెలకు కుటుంబ చందా 4.99 డాలర్లుగా ప్రకటించారు. గేమింగ్‌ ప్రియుల కోసం ఆర్కేడ్‌ను కూడా నెలకు 4.99 డాలర్లకు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు.
* 10.2 అంగుళాల 7వ తరం ఐప్యాడ్‌ను, ఐప్యాడ్‌ ఓఎస్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం కంటే రెండు రెట్ల అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 10 గంటల పాటు పనిచేస్తుంది. ఈనెల 30 నుంచి లభించే ఈ ఐప్యాడ్‌ ధర 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

5వ తరం యాపిల్‌ వాచ్‌

రోజువారీ ఎంతసేపు వ్యాయామం చేశారు, ఎంత శక్తిని వినియోగించారు, హృదయ స్పందన ఎలా ఉంది, శబ్ద - మహిళల ఆరోగ్య అధ్యయనం వంటివి తెలుసుకోవచ్చు. కాంపాస్‌గా ఉపయోగపడుతుంది. అత్యవసర అంతర్జాతీయ సేవలూ లభిస్తాయి. ఒకసారి ఛార్జిచేస్తే బ్యాటరీ రోజంతా వస్తుంది. 100 శాతం రీసైక్లింగ్‌ అల్యూమినియం, ఆర్సెనిక్‌ రహిత గ్లాస్‌ వంటివి వినియోగించి తయారు చేశారు.
వీటి ధర 399, 499 డాలర్లు. ఈనెల 20 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.
* సిరీస్‌ 3 వాచ్‌ల ధరలు 199 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

సరికొత్త ఐఫోన్లు

ఐఫోన్‌ టెన్‌ సిరీస్‌కు 99 శాతం వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేశారని టిమ్‌కుక్‌ తెలిపారు. టెన్‌ఆర్‌ మోడల్‌ను మరింత మెరుగుపరిచి ఆవిష్కరించిన ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల వద్ద ప్రారంభమవుతుంది. డాలర్‌ విలువ రూ.71గా అనుకుంటే, మన రూపాయల్లో 49,629 అవుతుంది. దేశీయంగా సుంకాలకు తోడు, ఎంత ధర నిర్ణయిస్తారో సంస్థ ఇంకా వెల్లడించలేదు. తక్కువ, మధ్యస్థాయి వెలుగులోనూ అత్యంత స్పష్టంగా చిత్రాలు తీయగలిగే మెషీన్‌లెర్నింగ్‌ సాంకేతికతను ఐఫోన్‌ 11 ప్రో, 11 ప్రోమ్యాక్స్‌లలో అమర్చినట్లు సంస్థ తెలిపింది.

ప్రత్యేకతలివీ

ఐఫోన్‌ 11: 6.1 అంగుళాల లిక్విడ్‌ రెటీనా తెర కలిగి బ్లాక్‌, గ్రీన్‌, ఎల్లో, పర్పుల్‌, వైట్‌, రెడ్‌ రంగుల్లో లభ్యం. వెనుకవైపు 2 కెమేరాలు (12 ఎంపీ వైడ్‌- అల్ట్రా వైడ్‌, 4కే స్పష్టత, సినిమాటిక్‌ వీడియో, ఇప్పటివరకు ఐఫోన్‌లో లేని అత్యధిక స్పష్టమైన వీడియోలు తీయొచ్చు, నైట్‌ మోడ్‌) డాల్బీ అట్మోస్‌ శబ్దం, స్లో మోషన్‌ సెల్ఫీస్‌ (స్లోఫీస్‌), మరే ఇతర స్మార్ట్‌ఫోన్‌లో లేని, అత్యధిక వేగంతో పనిచేసే ఏ 13 బయోనిక్‌ సీపీయూ, అత్యంత వేగంతో పనిచేసే జీపీయూ, ఐఫోన్‌ టెన్‌ఆర్‌ కంటే మరో గంట అదనంగా పనిచేసే బ్యాటరీ. శరవేగంతో ముఖాన్ని గుర్తించే కెమేరా.

ఐఫోన్‌ 11 ప్రో

5.8 అంగుళాల సూపర్‌ రెటీనా అత్యంత దృఢమైన తెర కలిగి, మిడ్‌నైట్‌ గ్రీన్‌, స్పేస్‌గ్రే, సిల్వర్‌/వైట్‌, గోల్డ్‌ రంగుల్లో లభ్యం. వెనుకవైపు సింగిల్‌పీస్‌ గ్లాస్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌. వెనుకవైపు 3 కెమేరాలు. డాల్బీ అట్మోస్‌ శబ్దం, సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ,  40 శాతం తక్కువ విద్యుత్తు వినియోగం, ఐఫోన్‌ టెన్‌ఎస్‌ కంటే 4 గంటల అదనంగా బ్యాటరీ

ఐఫోన్‌ 11ప్రో మ్యాక్స్‌

6.5 అంగుళాల తెర. ఐఫోన్‌ టెన్‌ఎస్‌ మ్యాక్స్‌ కంటే 5 గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ, వెనుక వైపు 3 కెమేరాలతో (12 వైడ్‌-అల్ట్రావైడ్‌, టెలిఫోటో) ఒకే సమయంలో 3 భిన్న రకాలుగా ఒకే ఫొటో తీయొచ్చు. కను రెప్పల మధ్య చోటును కూడా స్పష్టంగా చూపే సామర్థ్యం దీని సొంతం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు