close

తెలంగాణ

ఉమ్మడి నిజామాబాద్‌లో నీటి కష్టాలు ఉండొద్దు

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
వచ్చే నెల రెండురోజులు జిల్లాలో పర్యటన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాంతాలకు నీరు చేరేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఆ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఛాంబర్‌లో సమావేశమయ్యారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సాగు, తాగునీటి సమస్య, పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో రెండురోజులు ఉమ్మడి నిజామాబాద్‌లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున, వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్‌లలో సమస్య ఉంటుందని, వచ్చే ఏడాదిలోగా మల్లన్నసాగర్‌తో ఈ రెండు ప్రాజెక్టులకు నీరందిస్తామని చెప్పారు.

లిఫ్ట్‌లతో 3 నియోజకవర్గాలకు..
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీని అనుసంధానం చేసినందున భవిష్యత్తులో ఆయకట్టుకు ఎలాంటి ఢోకా ఉండదని సీఎం వివరించారు. బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు లిఫ్టులు పెట్టి సాగునీరు ఇవ్వాలని సూచించారు. ఎక్కడెక్కడ లిఫ్టులు పెట్టి ఎన్ని ఎకరాలకు నీరందించే వీలుంటుందో తేల్చాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఏటా 90 టీఎంసీలకు తగ్గకుండా ఎస్సారెస్పీని నింపి వీలైనంత ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎ.జీవన్‌రెడ్డి, హన్మంతు షిండే, గణేష్‌ గుప్తా, సురేందర్‌, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎస్‌ఈలు శంకర్‌, సుధాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ కృపాకర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు