close

తెలంగాణ

నల్లమల... సొగసు భళా!

‘ఆకులో ఆకునై.. పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై.. నునులేత రెమ్మనై ఈ అడవీ దాగిపోనా’ .. అంటూ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం ముచ్చటపడింది నల్లమల అందాలను చూసే. కృష్ణశాస్త్రి ఓ మారు నల్లమల మీదుగా రైలు ప్రయాణం చేస్తూ అడవి అందాలకు ముగ్ధులై ఈ పాట రాశారంటారు. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 3,568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. వేలాది మహావృక్షాలతో అలరారే ప్రకృతి సంపదకు ఆలవాలంగా, పెద్దపులుల వంటి వన్యప్రాణులకు ఆలంబనగా ఉన్న నల్లమల ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ‘సేవ్‌ నల్లమల’ అంటూ రాజకీయ పార్టీలు, సినిమా నటులుసహా ప్రజలంతా  హోరెత్తించారు. కళాకారులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన బాటలో నడిచారు. పచ్చగా ఉన్న అడవిలో యురేనియం తవ్వకాల మాట చిచ్చు రేపింది. సంపద, జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన ఈ అడవిలో భారత అణుశక్తి సంస్థ ఆధ్వర్యంలో యురేనియం నిల్వల అన్వేషణకు నాలుగు వేల బోర్లు వేస్తారన్న ప్రకటనతో ప్రకృతి ప్రేమికులు విలవిల్లాడారు. వివిధ జాతుల వన్య ప్రాణులతో పాటు మొత్తం 110 గూడేల్లో నివాసముంటున్న పదివేల మందికి పైగా చెంచుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలపైనా యురేనియం తవ్వకాల ప్రభావం ఉంటుందని, తాగు, సాగునీరు కలుషితమవుతుందన్న భయాలు ప్రజలను మేల్కొలిపాయి. చివరకు యురేనియం తవ్వకాలను అనుమతించబోమంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేయాల్సి వచ్చింది. పర్యావరణ హితమే లక్ష్యంగా రాష్ట్రమంతటినీ ఏకతాటిపైకి తెచ్చిన నల్లమలను బోరు తవ్వకాలతో జల్లెడ చేస్తామంటే ఎందకంత స్పందన వచ్చిందో ఈ అడవుల అందాలను ఒక్కసారి చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇంత చక్కనైన నల్లమల అడవుల రమణీయతను ప్రజల ముందుంచేందుకు ’ఈనాడు’ చేస్తున్న ప్రయత్నమిది.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు