close

గ్రేటర్‌ హైదరాబాద్‌

విద్యార్థులకు భరోసా

ప్రైవేటు వసతి గృహాలను కొనసాగించేందుకు నిర్ణయం
నిరభ్యంతర పత్రాల గందరగోళానికి చెక్‌ పెట్టిన తెలంగాణ డీజీపీ
ఏపీ సరిహద్దుల్లో మాత్రం రాత్రి వరకు గందరగోళం
ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలు
క్వారంటైన్‌కు అంగీకరించిన వారికి  మాత్రమే ఏపీలోకి అనుమతి
కొత్తగా ఎవరినీ అనుమతించవద్దని ముఖ్యమంత్రుల నిర్ణయం

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌, అమరావతి, జగ్గయ్యపేట- న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్టళ్ల మూసివేత వ్యవహారం బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇద్దరు సీఎంల చర్చలతో కొలిక్కివచ్చింది. హైదరాబాద్‌ పోలీసుల నుంచి నిరభ్యంతరపత్రాలను తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు చేరుకునేందుకు సరిహద్దుల వద్దకు వచ్చిన వారిలో క్వారంటైన్‌కు అంగీకరించిన వారిని ఏపీలోకి అనుమతించాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇకమీదట కొత్తగా ఎవరికీ అనుమతులివ్వకూడదని, ఎక్కడివారిని అక్కడే ఉంచాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు హైదరాబాద్‌లోని హాస్టళ్లనూ మూసివేయబోమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. చివరకు బుధవారం అర్ధరాత్రి క్వారంటైన్‌కు అంగీకరించిన వారిని రాష్ట్రంలోకి అనుమతించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుట్‌ ఐటీకి, తూర్పుగోదావరి వారిని రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరి వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఇక హైదరాబాద్‌ నుంచి ఎవరు వచ్చినా అనుమతించేది లేదని సరిహద్దులవద్ద ఏపీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రావడంవల్ల వచ్చిన వారినేగాక, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టినట్లవుతుందని పేర్కొన్నారు.  అంతకుముందు ఉదయం నుంచి రాత్రి వరకూ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రైవేటు వసతిగృహాల యజమానుల ఆంక్షలతో హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశం లేక పోలీసుల అనుమతి తీసుకుని బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి సరిహద్దుల వద్ద ఇబ్బందికరంగా మారింది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడువద్ద ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిలిచిపోయారు. వందల సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. కొందరు విద్యార్థులు వైద్య ధ్రువీకరణతో ఎన్‌వోసీలు తెచ్చుకోవడంతో రాష్ట్రంలోకి అనుమతించారు. మిగిలిన వారంతా భారీగా రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వసతి గృహ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయాలని చెప్పడంతో వారంతా పోలీసు ఠాణాల వద్ద బారులు తీరారు. అనుమతి ఇస్తే ఇళ్లకు వెళ్లిపోతామని చెప్పడంతో పోలీసులు దాదాపుగా 8వేల మందికి నిరభ్యంతర పత్రాలను జారీ చేశారు. దీంతో వారందరూ స్వస్థలాలకు బయలుదేరారు. కొందరు సొంత వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రయాణమయ్యారు. వీరిలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఉద్యోగులు, విద్యార్థులున్నారు. వారిని సరిహద్దులవద్ద ఏపీ పోలీసులు ఆపేశారు. నిరభ్యంతర పత్రాలను ఎందుకు స్వీకరించబోరంటూ వచ్చినవారు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. రహదారులపై వేల మంది ఉండిపోయారు. ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. ఈలోగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. విద్యార్థులందరూ ప్రయాణమవడంవల్ల రవాణా ఇబ్బందులొస్తాయని చెప్పారు. ఎక్కడి వారక్కడే ఉంటేనే బాగుంటుందని సూచించారు. ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని కూడా ఈ అంశంపై తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో మాట్లాడారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి వసతి గృహాల మూసివేత వద్దని నిర్వాహకులను ఆదేశించారు. దీంతో కొత్తగా నిరభ్యంతర పత్రాలను పోలీసులు ఆపేశారు. మరోవైపు అప్పటికే ప్రయాణమైనవారు, ప్రయాణానికి రోడ్లపై పడిగాపులు పడుతున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. చివరకు ముఖ్యమంత్రుల జోక్యంతో పరిస్థితి చక్కబడింది.

అదను చూసి.. అదనంగా దోచేసి..
సొంతూళ్లకు బుధవారం బయలుదేరిన విద్యార్థులు, ఉద్యోగులను ప్రైవేటు వాహనాలవారు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. వందల్లో వసూలు చేయాల్సిన రుసుములను ఒక్కసారిగా వేల రూపాయలకు పెంచారు.

అక్కడే ఉండాలి...
హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు విద్యా సంస్థలు, సంస్థల్లో పని చేస్తున్నవారు.. ఎక్కడి వారక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని కోరింది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఏవైనా సమస్యలుంటే 1902 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించింది.

తీవ్రంగా స్పందించిన తెలంగాణ డీజీపీ
ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు చెల్లబోవంటూ ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉన్నందున జంట నగరాల్లోని వసతి గృహాల్ని, పీజీ హాస్టళ్లను తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వసతిగృహాల నిర్వాహకులతో మాట్లాడి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు.


ఏ ఒక్కరినీ బయటకు పంపించవద్దు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లోని ప్రైవేటు వసతి గృహాలను, పీజీ మెస్‌లను ఖాళీ చేయించరాదని, ఏ ఒక్కరినీ బయటకు పంపించవద్దని, అనవసరంగా భయాందోళనలు సృష్టించవద్దని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు యాజమాన్యాలకు బుధవారం సూచించారు. వసతి గృహాలను యథాతథంగా కొనసాగించాలన్నారు. దీనిపై ఇప్పటికే హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, మేయరు బొంతు రామ్మోహన్‌, నగర పోలీసు కమిషనర్‌తో చర్చించామన్నారు. హైదరాబాద్‌ ప్రజాప్రతినిధులందరూ వెంటనే అధికారులతో కలిసి వసతి గృహాలను సందర్శించాలని, విద్యార్థులకు, యాజమాన్యాలకు భరోసా కల్పించాలన్నారు.


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు