close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూడో రోజూ నష్టాలే..

సమీక్ష

వరుసగా మూడో రోజూ సూచీలకు నష్టాలు కొనసాగాయి. అమెరికా జీడీపీ వృద్ధి గణనీయంగా క్షీణించడంతో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం ఇందుకు కారణమైంది. ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం సూచీల్లో కీలకమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాంటి దిగ్గజ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడమూ ప్రభావం చూపింది. కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతోనూ మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపారు.
ఆద్యంతం ఒడుదొడుకులు
ఉదయం సెన్సెక్స్‌ 37,847.88 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత సూచీ ప్రతికూల ధోరణిలో ఒడుదొడుకుల మధ్య కదలాడింది. ఒకానొకదశలో 37,431.68 పాయింట్లకు దిగివచ్చింది. చివరకు 129.18 పాయింట్లు నష్టపోయి 37,606.89 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 28.70 పాయింట్లు కోల్పోయి 11,073.45 వద్ద స్థిరపడింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 522.01 పాయింట్లు, నిఫ్టీ 120.70 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
ఎస్‌బీఐ, సన్‌ఫార్మా దూకుడు
సెన్సెక్స్‌ 30లో 10 షేర్లు నష్టాలతో ముగియగా.. 20 సానుకూలంగా చలించాయి. అత్యధికంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.98 శాతం నష్టపోయింది. అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (1.69%), హెచ్‌డీఎఫ్‌సీ (1.55%), ఏషియన్‌ పెయింట్స్‌ (1.55%), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (1.48%), బజాజ్‌ ఆటో (1.43%) షేర్లూ కూడా డీలాపడిన వాటిలో ఉన్నాయి. మరోవైపు నికర లాభంలో 81 శాతం వృద్ధిని నమోదుచేయడంతో ఎస్‌బీఐ షేరు 2.63 శాతం వరకు పెరిగింది. సన్‌ఫార్మా షేరు 4.27%, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1.49%, మహీంద్రా అండ్‌ మహీంద్రా 1.45%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.36%, టెక్‌ మహీంద్రా 1.05%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.03% చొప్పున లాభపడ్డాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు