close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమ్మసేవలో అంతరార్థం!

అమ్మసేవలో అంతరార్థం!

 

శక్తి స్వరూపిణి అయిన అమ్మను ఈ తొమ్మిదిరోజులు ఎంతో భక్తి  శ్రద్ధలతో కొలుస్తారు మహిళలు.   అమ్మవారిని పూజించడమే కాదు... దేవి తత్వం అర్థం చేసుకోవడమూ ముఖ్యమే. జగన్మాతను స్ఫూర్తిగా తీసుకుని మన రోజువారీ జీవితానికి అన్వయించుకోవాలి. అదే    అసలైన అమ్మ ఆరాధన. అసలు అమ్మవారి నుంచి ఏం నేర్చుకోవచ్చనేది వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి. 
శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో కొలుస్తాం. దుర్గ, లలిత, మహాలక్ష్మి, అన్నపూర్ణ, గాయత్రి... ఇలా సాగుతాయి ఆ  అలంకారాలు. వాటి నుంచే మనం నేర్చుకోవాలి. 
మృదుభాషణం- లలితాతత్వం: అమ్మవారి వివిధ అలంకారాల్లో ప్రధానమైంది లలితా త్రిపురసుందరీదేవి. మనకు మాతృమూర్తుల రూపంలో కనిపించే వారంతా లలితా దేవి అవతరాలేనని భావించాలి. లలిత అనే పేరులోనే లాలిత్యం ప్రస్ఫుటమవుతుంది. ఆ దేవి స్వభావం మృదు మధురంగా ఉంటుంది. ప్రతి గృహిణి ఇలాంటి తత్వాన్ని అలవర్చుకుంటే ఇంట్లో గొడవలనేవి జరగవు. శాంతంగా కనిపించడం ఈ అమ్మవారి స్వభావం. ఆ స్వభావాన్ని అలవర్చుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మధుర భాషణం, బాధ్యతాయుత గాంభీర్యం కలిగిన వారుంటే సమస్యలనేవి రావు. కుటుంబంలో ఇతరుల వల్ల సమస్యలు ఉన్నా... ఆమె చాతుర్య లాలిత్యం వల్ల ఆదిలోనే సమసిపోతాయి. లలితాదేవిని సదాశివ కుటుంబిణీ అని కీర్తిస్తాం. నిత్యం శివ పరంపరలతో పురోగమించే కుటుంబం ఆమెది. ఓర్పు, నేర్పుతో వివేచనతో ఇల్లు దిద్దుకోదగిన గుణం కనిపించే ప్రతి మహిళదీ లలితా తత్వమే. 
రాజరాజేశ్వరి- పాలన: లలితా దేవికే రాజరాజేశ్వరి అని మరో పేరు. రాజులకు రాజులుంటే వారిపై అధికారం చెలాయిస్తుంది    రాజరాజేశ్వరి. నేటి మహిళలు కేవలం ఇంటికే పరిమతం కావట్లేదు. పలు వృత్తుల్లో మగవారికి దీటుగా కొలువు దీరుతున్నారు. రాజరాజేశ్వరీ దేవి తన కనుసన్నలతోనే త్రిమూర్తుల్ని శాసిస్తుందని..  సృష్టి స్థితి లయాలను వారు సక్రమంగా నిర్వహించేందుకు శక్తియుక్తులను ఇస్తుందని వేద వ్యాసులు, ఆదిశంకరులు తమ రచనల్లో స్పష్టం చేశారు. ఉద్యోగినులు ఈ అమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఉద్యోగుల్లో కొందరు పని దొంగలు ఉంటారు. అసమర్థత, సోమరితనం, నిర్లక్ష్యం... ఇలా పలు కారణాల వల్ల కర్తవ్య నిర్వహణ సాగించలేరు. అలాగని వారిని వదిలేసి లాభం లేదు. ఘర్షణ, వాగ్వాదంతో పనీ జరగదు. వారు తమ కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించేలా చూపులతో శాసించగలగాలి. పని తీరును వివరిస్తూ... శక్తియుక్తులను సూచిస్తూ కర్తవ్య నిర్వహణలో సమస్యలను పరిష్కరించగలగాలి. ఈ స్ఫూర్తిని మనం రాజరాజేశ్వరి నుంచి తీసుకోవాలి. అప్పుడే మన్ననలు అంది... మనకంటూ గుర్తింపు వస్తుంది. 
అన్నపూర్ణ-ఆరోగ్యం: సదాశివునికి ఆహారం అందిస్తూ దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవి. ఏ గృహిణి అయినా శుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా వండాలి. అప్పుడే ఇంటిల్లిపాదీ కడుపునిండా తింటారు. బయట ఆహారానికి అలవాటు పడరు. నిబద్ధత, నిపుణత కలిగి సకాలంలో ఇంటిల్లిపాదికీ వండి వారించే ప్రతి ఇల్లాలు అన్నపూర్ణే. అతిథులకు, అభాగ్యులకు ఆహారం అందించే గృహిణికి... కుటుంబంతోపాటు, సమాజం కూడా రుణపడి ఉంటుంది. 
లక్ష్మీ స్వరూపిణిగా: సంపదలిచ్చే తల్లిగా మహాలక్ష్మిని ఆరాధిస్తాం. ఉద్యోగినులైన మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండటం తెలిసిందే. అయితే ఉద్యోగినులైనా, గృహిణులైనా దుబారా నివారించి... పొదుపు పాటిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చినట్టే. అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా పొదుపరిగా ఇంటిని నెట్టుకురావడం తెలిస్తే... నేటి మహిళ మహాలక్ష్మే అవుతుంది. 
గాయత్రి గుణం: మన బుద్ధి శక్తులను ప్రచోదనం చేసి... ఆలోచనల్ని విస్తృతం చేసే తల్లి గాయత్రి. ఆ అమ్మను స్ఫూర్తిగా తీసుకుంటే ప్రతి మహిళా గుణవంతురాలై, ధీమంతురాలైతే ప్రశాంత జీవనం సాగిస్తుంది. తన తోటివారికి కూడా ఆ ప్రశాంతతను అందిస్తుంది. 
విద్యావంతురాలిగా: శరన్నవరాత్రుల్లో సప్తమీ మూలా నక్షత్రం నాడు అమ్మవారిని సరస్వతిగా,  విద్యాధి దేవతగా ఆరాధిస్తాం. స్త్రీవిద్య కావాలని నినాదం అవసరం లేదు. నేటి స్త్రీలు విద్యావంతులే. విద్య వల్ల వివేకం, విజ్ఞత పెంపొంది సంతానానికి సంస్కారం అందించడంలో విద్యావంతురాలైన గృహిణి పాత్ర కీలకం. పలు రంగాల్లో నెలకొన్న అవాంఛనీయమైన పోటీల వల్ల ఈ రోజుల్లో పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇల్లాలు చదువు, తెలివి కలిగి ఉంటే సంతానానికి చదువుపట్ల అసలైన అవగాహన కలిగిస్తుంది. పిల్లలకు   ఉత్సాహ, ప్రోత్సాహం అందిస్తూ వారి అఖండ విజయసౌధానికి సోపానాలు నిర్మించగలదు. అలా చేసే ప్రతి తల్లీ సరస్వతీ దేవి స్వరూపిణే. 
జగన్మాత శక్తి: దుర్గా, దుర్గముడు, చండుడు, మహిషాసురుడు బండుడు... వంటి రాక్షసులు అమ్మవారి చేతిలో చనిపోయారు. సమాజంలో దుష్ట శక్తులు విజృంభించి... తమ శక్తి యుక్తులను స్వార్థ సంకుచిత ప్రయోజనాల కోసం వినియోగించి... నీచ కార్యాలకు పాల్పడేవారంతా రాక్షసులే. తమ శక్తిని సాంఘిక వ్యతిరేక కార్యకలాపాల్లో వినియోగించడమే రాక్షసత్వం. తెలివి, బలం, సంపద ఉండి వాటితో స్వార్థం, గర్వం పెరిగి దురాగతాలకు పాల్పడే రాక్షసులు మారు    రూపాల్లో కోకొల్లలుగా కనిపిస్తుంటారు. ఎన్నెన్నో దుర్మార్గాలు చేసి.. తమ తెలివితో చావు తప్పించుకోవాలని చూసిన మధుకైతములను అమ్మవారు కడతేర్చిందని దేవీ భాగవతం చెబుతోంది. అలానే స్త్రీ అంటే విలాస వస్తువుగా భావించి కేవలం కాముక దృష్టితో చూడటం మహిషాసుర లక్షణం. నేటి మహిళ అలాంటి మహిషాసురుల్ని తన శక్తియుక్తులతో ఎదుర్కోవాలి. తాను అబల కాదు సబల అని నిరూపించుకోవాలి. దుష్ట శక్తుల్ని నిగ్రహిస్తూ అభ్యుదయ పథంలో పురోగమించాలి. దున్నపోతు స్వభావం అనే అసురత్వాన్ని నశింపచేసి జయకేతనం ఎగురవేసే ప్రతి మహిళా మహిషాసుర మర్దిని. భండాసురుడితో యుద్ధం జరిగే సందర్భంలో తన శక్తియుక్తులన్నీ క్షీణించగా.. తన పరివారం నశించగా.. తన పట్ల అమ్మవారు ప్రయోగించిన అస్త్రం ఆహుతిగా చేసుకుని పతనం అంచున నిలబడ్డాడు. అయినా ఆ దశలోనూ మరణాన్ని తప్పించుకోవాలనే ఆలోచనతో అమ్మవారి అస్త్ర,   శస్త్రాలు తనపై ప్రసరించకుండా ఒక విఘ్న యంత్రాన్ని కల్పించుకున్నాడు. అప్పుడు లలితాదేవి భర్త వంక చూసింది. ఆ చూపుల్లోంచి ఆవిర్భవించిన గణపతి ఆ విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు. బ్రహ్మాండ పురాణంలోని ఈ వృత్తాంతం నేటి మహిళలకు రాచ బాట. పరమశివుని మూడో కంటి మంటకు ఆహూతి అయిన మన్మథుడి శరీరం భస్మరాశిగా పడి ఉంటే అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి చిత్రంగా తీర్చాడు. అది చూసి బ్రహ్మ దేవుడు బండా బండా అన్నాడు. ఆ బూడిదకి ప్రాణం వచ్చి బండాసురుడు అయ్యాడు. కామమే తన స్వభావంగా మారినవాడు బండాసురుడు. నేటి సమాజంలో ఆధునిక నాగరిక వేషంలో ఎందరో బండాసురులు కనిపిస్తున్నారు. ఇంట్లోవారి సహకారంతో అలాంటి దుష్టత్వాన్ని నేటి మహిళ ప్రతిఘటించాలి. ఆత్మవిశ్వాసంతో తనను తానే రక్షించుకోవాలి. అమ్మవారి అలంకరాల్లోంచి ఈ అంతరార్థాలే నేర్చుకోవాలి.

ఆరాధన తత్వం...   

అమ్మవారిని ఆరాధించడం అంటే కేవలం పూజా ద్రవ్యాలు సమర్పించడం... స్తోత్రాలు పఠించడం కాదు. దేవీ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అమ్మవారి కథల నుంచి స్ఫూర్తిని పొందాలి. ప్రతి మహిళా తనలో దాగిన మానవత్వ ఔనత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. యుక్తితో, శక్తితో... దృష్ట శక్తుల్ని ఎదుర్కోవాలి. ఆరాధించడం అంటే ఆనుసరించడమే. శరన్నవరాత్రుల్లో వివిధ రూపాల్లో శక్తి స్వరూణి అయిన అమ్మవారిని ఆరాధించడం...  ప్రతి మహిళా తమలో ఉన్న శక్తిని జాగృతం చేయడానికే అని గుర్తించాలి. అప్పుడే ఆరాధ్య దేవతలకు ప్రతిరూపంగా ఆదర్శ నారీమణులు రూపొందుతారు. సమాజంలో మహిళా చైతన్యం వికసిస్తుంది. జాతి పురోగమిస్తుంది.


మరిన్ని