close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రెండు లారీల మధ్య ఉండిపోయా!

రెండు లారీల మధ్య ఉండిపోయా!

 

ఆమె ఇద్దరు ఆడపిల్లల తల్లి... ఒకప్పుడు సమాజానికి భయపడి బండి నడపడం మానేసింది. ఇప్పుడు మళ్లీ బైకర్‌నీగా గుర్తింపు తెచ్చుకుంది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో  బైక్‌ యాత్రలు చేయడమే కాదు...  వెళ్లిన ప్రతిచోట మహిళా సాధికారత గురించి   చెబుతోంది. ఆమే కానిస్టేబుల్‌ శాంతి. 
మాది హైదరాబాద్‌. అన్నయ్యలు బైక్‌ నడపుతోంటే నేర్చుకోవాలనిపించేది. అలా పదోతరగతిలోనే వాళ్ల సాయంతో బండి నడపడం నేర్చుకున్నా. మొదటిసారి హీరో హంక్‌, బజాజ్‌ బాక్సర్‌లపై నా ప్రయాణం మొదలయ్యింది. కాలేజీకి బాక్సర్‌ మీద వెళ్లేదాన్ని. 2004లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాక కొందరు ‘హాయిగా యాక్టివా నడపక... ఎందుకు ఈ అబ్బాయిల బైక్‌’?’ ‘ఎంత పోలీస్‌ ఉద్యోగం చేస్తున్నా ఆడపిల్లవని మరిచిపోకు’ అనేవారు బాధేసి బండి నడపకూడదనుకుని వదిలేశా. అయితే బైకర్‌నీ గ్రూపు జయభారతి పరిచయంతో మళ్లీ నా అభిరుచిని కొనసాగించగలిగా. 
రైడ్‌కి పిలిచారు...  అప్పుడే బైక్‌లు నడిపేవారికోసం ప్రత్యేకంగా బృందాలు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయా. జయభారతికి ఫోన్‌ చేసి నా వివరాలు చెప్పా. ‘మే 5 ఇంటర్నేషనల్‌ ఫిమేల్‌ బైకర్స్‌ డే ఆ రోజు రైడ్‌కి’ వచ్చేయి...’ అని చెప్పింది. అలా మొదటిసారి వారితో కలిసి హైదరాబాద్‌లోని యాత్రీ నివాస్‌ నుంచి కేబీఆర్‌ పార్క్‌వరకూ ప్రయాణించా. బైకర్‌నీ గ్రూపు సరదాకి కాదు సామాజిక బాధ్యతనూ అందిపుచ్చుకోవడం నాకు ఉత్సాహాన్నిచ్చింది. అప్పటికే వాళ్లు చాలా రైడ్‌లు చేశారు. ఓసారి కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఓ రైడ్‌ ఏర్పాటు చేశారు. దానికి ఒక్కో బైకర్‌కీ యాభైవేల రూపాయలు ఖర్చవుతుంది. మధ్యతరగతి కుటుంబం. అంత డబ్బు నా దగ్గర లేదు. దాంతో ఆ ఆలోచనను విరమించుకున్నా. ఇకముందు జరిగే రైడ్‌లకోసం డబ్బులు పోగేసుకోవాలనుకున్నా.  ఓ రోజు అకస్మాత్తుగా జేబీ నుంచి ఫోన్‌. ‘శాంతీ ఓ  నలభైరోజుల ప్రయాణం రాగలవా అని’. నేను మళ్లీ తటపటాయిస్తుంటే... ‘డబ్బులకోసం భయపడకు. అవన్నీ మేం చూసుకుంటాం.’  అని భరోసా ఇచ్చింది. తెలంగాణ నుంచి ఏడు దేశాలకు బైక్‌పై ప్రయాణం అంటే నాకే నమ్మబుద్ధికాలేదు. దానికి పాస్‌పోర్ట్‌ అవసరం. అంతకు ముందు ఓ సారి మా స్టేషన్‌ పరిధిలో పోలీసు వారికోసం పాస్‌పోర్ట్‌ మేళా ఏర్పాటు చేశారు. సాధారణ కానిస్టేబుల్‌ని నేనెక్కడికి వెళ్తానులే అని అప్పుడు తీసుకోలేదు. కానీ నాకు అవకాశం వచ్చింది కాబట్టి పాస్‌పోర్ట్‌ తీసుకున్నా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా కలేమో అనిపిస్తుంది. 
మొదటిసారి భయపడ్డా... ఉత్సాహంగా మొదటిసారి ప్రయాణం మొదలుపెట్టేశా. ఉత్తరాదిలో అడుగుపెట్టాక భయమేసింది. అక్కడ హైవేలపై రెండువైపులా లారీలు  వస్తుంటాయి. వాటి మధ్యలోంచి వెళ్లిపోవాలి. అలా వెళ్లలేక ఓ సారి రెండు లారీల మధ్య ఉండిపోయా. ఆ భయంతోనే జ్వరం వచ్చేసింది. కానీ ఇప్పుడు అన్నింటికీ అలవాటుపడ్డా. తాజాగా బతుకమ్మ రైడ్‌ పేరుతో తొమ్మిది జిల్లాల్లో మా పర్యటన సాగింది. ఇవన్నీ నాకు గుండెనిబ్బరాన్ని ఇచ్చాయి. నలుగురిలోనూ మాట్లాడగలిగే ధైర్యాన్ని అందించాయి.


మరిన్ని