close

ఆంధ్రప్రదేశ్

అవినాష్‌రెడ్డి పీఏ ఫోన్‌ నుంచే తొలి కాల్‌ 

గుండెపోటని అప్పుడే చెప్పారు 
ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లినప్పుడు రక్తపు వాంతులతో మృతి చెందారని అక్కడ ఉన్నవారు కొందరు చెప్పారు 
లేఖలోని చేతిరాత తన తండ్రిదేనని అయన కుమార్తె అంగీకరించారు 
వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించిన కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ 
ఈనాడు - అమరావతి, కడప

వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని తొలుత పోలీసులకు ఫోన్‌ చేసినవారు ఎందుకు చెప్పారు? పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే పడక గదిలోని రక్తపు మరకలను ఎందుకు శుభ్రం చేశారు? రక్తపు వాంతులు చేసుకుని మరుగుదొడ్డి కమోడ్‌పై పడి వివేకా చనిపోయారని అక్కడున్న వ్యక్తులు పోలీసులకు ఎందుకు చెప్పారు? హత్యగా అనుమానం ఉన్నప్పుడు గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందిని ఇంటికి తీసుకొచ్చి వివేకా తలపై అయిన గాయాలకు ఎందుకు కట్లు (బ్యాండేజ్‌) కట్టించారు? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఈ అంశాలే కీలకంగా మారాయి. వీటిపై తగిన ఆధారాలు లభిస్తే ఈ కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశముంది. ఈ ఘటనపై గత మూడు రోజులుగా భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్‌, స్థానిక పోలీసు బృందాలు... హత్య జరిగిన రోజు రాత్రి 11.30 గంటల మొదలుకుని మరుసటి రోజు సాయంత్రం వరకూ చోటుచేసుకున్న పరిణామ క్రమాన్ని రూపొందించుకుని దాని ఆధారంగా ఘటనను విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు వివరాలను కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ఆదివారం రాత్రి విలేకరులకు వివరించారు. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. 
‘వైఎస్‌ వివేకానందారెడ్డి గుండెపోటుతో మృతి చెందారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి సెల్‌ నుంచి పోలీసులకు ఫోన్‌ వచ్చింది. కొంత సమయం తర్వాత అవినాష్‌ కార్యాలయంలో పనిచేసే భరత్‌రెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పులివెందుల ఇన్‌స్పెక్టర్‌ ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డి, వాచ్‌మన్‌ రంగన్న, ఇనయతుల్ల, దొండ్లవాగు శంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి ఆసుపత్రిలో కంపౌండరుగా పనిచేసే ప్రకాశ్‌రెడ్డి, డా.నాయక్‌, అవినాష్‌రెడ్డితో పాటు మరో 20 మంది అక్కడ ఉన్నారు. వీరిలో కొంతమంది వివేకా రక్తపు వాంతులు చేసుకుని మరుగుదొడ్డి కమోడ్‌పై పడి గాయాలై చనిపోయారని పోలీసులకు వివరించారు. అంతకు ముందే పడక గదిలోని రక్తపు మరకలు శుభ్రం చేసి ఉన్నాయి. పోలీసులు వెళ్లిన సమయంలో రక్తపు మరకలతో ఉన్న దుప్పటిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు. వివేకాకు తల, అరచేతిపై తీవ్ర గాయాలుండటంతో గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది ఆయన ఇంటికొచ్చి గాయాలకు కట్లు (బ్యాండేజ్‌) వేశారు. వివేకా మృతి చెందిన రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు కర్నూలు రేంజి డీఐజీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, భార్య సౌభాగ్యమ్మలను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఆయన పీఏ కృష్ణారెడ్డి వద్ద నుంచి తీసుకుని సునీత డీఐజీకి అందించారు. లేఖను ఉదయమే ఎందుకు పోలీసులకు ఇవ్వలేదని డీఐజీ ప్రశ్నించగా.. డ్రైవరు ప్రసాద్‌కు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని భావించి తాము వచ్చేంత వరకూ ఆ లేఖను కృష్ణారెడ్డివద్ద ఉంచాలని చెప్పామని ఆమె తెలిపారు. వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖలోని చేతి రాత ఆయనదేనని డీఐజీకి వివేకా కుమార్తె సునీత వెల్లడించారు’ అని ఎస్పీ వివరించారు.
20 మంది సాక్షులను విచారించాం 
‘వివేకా హత్య కేసులో ఇప్పటివరకూ 20 మంది సాక్షులను విచారించాం. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ ఆధ్వర్యంలో 5 బృందాలు, కడప జిల్లా పోలీసు ఆధ్వర్యంలో 7 బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా సమాచార సేకరణ, ఫోరెన్సిక్‌, సాంకేతిక ఆధారాల కోసం ఈ బృందాలు పని చేస్తున్నాయి. ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించడంలో కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు. 
పరమేశ్వరరెడ్డి పాత్రపై అనుమానాలు! 
వివేకా హత్య ఘటనలో పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి పాత్ర ఉండొచ్చేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. సింహాద్రిపురం ప్రాంతానికి చెందిన ఆయన వివేకా హత్య తర్వాత నుంచి కనిపించట్లేదని పోలీసువర్గాల కథనం.

ముమ్మరంగా విచారణ

పులివెందుల, న్యూస్‌టుడే: హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి నివాసాన్ని ఆదివారం మరోమారు సిట్ బృందం పరిశీలించింది. ఆయన పడక గది, స్నానపు గది, ఇంటి పరిసరాలను బృంద సభ్యుడు సీఐ సాధిక్‌ పరిశీలించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డిలను విచారించారు. మరోవైపు డీఎస్పీ కార్యాలయంలో వైఎస్‌ సమీప బంధువులు, అన్నదమ్ములు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహరరెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలను మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు విచారించారు. స్నానపు గదిలో పడి ఉన్న మృతదేహాన్ని పడక గదిలోకి ఎందుకు తీసుకొచ్చారు? రక్తపు మరకలను ఎందుకు శుభ్రం చేశారు? పోలీసులకు ఎందుకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారు? వంటి ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఈ విషయమై వైఎస్‌ ప్రతాప్‌రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. మైనింగ్‌ వివాదం తమ వ్యక్తిగత విషయమని చెప్పామని పేర్కొన్నారు. హత్య జరిగిన సమయంలో తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు శివప్రకాష్‌రెడ్డి తెలిపారు. కడపలోని ఓ రహస్య ప్రదేశంలో అనుమానితులను వేర్వేరు గదుల్లో ఉంచి వివరాలు రాబడుతున్నారు. దస్తగిరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి అధికారుల ఎదుట పెదవి విప్పలేదని సమాచారం.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు