close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ పిల్లలకోసం... పార్కు కట్టారు!

పిల్లల కోసం పార్కులు... రకరకాల ఆట వస్తువులు ఉండటం మామూలే. మరి ప్రత్యేకమైన పిల్లల కోసం... ఆ అవసరాన్నే గుర్తించారు అదితీ అగర్వాల్‌, అంజలీ మీనన్‌. ఇద్దరూ కలిసి గుడ్‌గుడీ పేరుతో అలాంటి చిన్నారుల కోసం ఆటస్థలాలు, వస్తువులు  అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ వాళ్లెవరూ... ఏం చేశారో తెలుసుకుందామా...

గుడ్‌గుడీ పిల్లల సృజనాత్మకతను  పదును పెట్టే ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఆట మైదానాలను రూపొందిస్తుంది. దీన్ని ఈ స్నేహితులిద్దరూ కలిసి 2014లో ప్రారంభించారు. అదితీ అగర్వాల్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా. అంజలీ మీనన్‌ ముంబయిలో పుట్టి పెరిగింది. ఇద్దరూ అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫర్నీచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌లో డిగ్రీ తీసుకున్నారు. అక్కడే వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది. క్రమంగా ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు. అయితే.... భిన్నమైన రంగంలోకి రావాలనుకున్నారు. అహ్మదాబాద్‌లో చదువుకునేటప్పుడు వీళ్లకు డిజైన్‌ ఫర్‌ స్పెషల్‌ నీడ్స్‌ అనే ప్రత్యేక కోర్సు ఉండేది. దీనిలో భాగంగా అక్కడ ఉండే బ్లైండ్‌ స్కూల్‌ అసోషియేషన్‌కు వెళ్లేవారు. అక్కడ ఆ పిల్లలు చదువుకోవడానికి పాఠశాల, నేర్చుకోవడానికి ఇండోర్‌ గేమ్స్‌ ఎన్నో ఉన్నాయి. ఎన్ని వసతులు ఉన్నా... బయటకు వెళ్లి ఆడుకోవడానికి మాత్రం సౌకర్యాలు ఉండేవి కాదు. వాళ్లే కాదు.. చాలామంది దివ్యాంగుల పరిస్థితి ఇదే. పార్కులు, ఆటస్థలాల్లో కూడా వారికి సంబంధించిన ఆటవస్తువులుండవు. తల్లిదండ్రులు కూడా వారిని ఆడించడానికి బయటకు తీసుకెళ్లరు. ఇవన్నీ గమనించాకే ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఆటస్థలాలు రూపొందించాలన్న ఆలోచన వీళ్లకు వచ్చింది.
నిపుణులతో మాట్లాడి...
  ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఆటస్థలాలు రూపొందించాలన్న ఆలోచన మంచిదే కానీ ఇంతవరకు ఆ దిశగా ఎవరూ ప్రయత్నించలేదు. దాంతో చాలామంది ‘మీరేం చేయలేరు...’ అంటూ హేళన చేశారు కూడా. ఎవరు ఎన్ని అన్నా... ఆటస్థలాలు డిజైన్‌ చేయడానికి సిద్ధమయ్యారు వీళ్లిద్దరు. ఎంతో మంది మానసిక నిపుణులు, వైద్యులు, దివ్యాంగులకు బోధించే ఉపాధ్యాయులతో మాట్లాడి వాళ్లకు ఎటువంటి ఆట పరికరాలు అవసరమో తెలుసుకున్నారు. ఊయల, ఇతర వాటిపై దివ్యాంగులు ఆడుకోవడం చాలా కష్టం. ప్రమాదకరం కూడా. అందుకే ఇవి వారికి అనువుగా ఉండేలా బెల్ట్‌తో తయారు చేశారు. మరికొన్ని రక్షణ సూత్రాలు కూడా పాటించారు. ‘పిల్లలందరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి. మాట్లాడడానికి సిగ్గుపడే పిల్లల కోసం, అటెన్షన్‌ డిజార్డర్‌ ఉన్నవారికి, అంథులు... ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇంటరాక్టివ్‌ బాల్స్‌, టాకింగ్‌ టెలిఫోన్‌ పైపులు, పెరిస్కోప్‌, సృజనాత్మకంగా ఆలోచించగలిగేలా ప్రత్యేక ఆటవస్తువులు తయారు చేశాం. ఊయల మీదికి వెళ్తే లావెండర్‌ వాసన వస్తుంది. మరో దాన్ని ఎక్కితే పుదీనా వాసన వస్తుంది. ఒకవైపు ఎగిరితే ఫౌంటేన్‌ వస్తుంది... ఇప్పటి వరకు వివిధ పాఠశాలల్లో ఇటువంటి ఆట మైదనాలు ఏర్పాటుచేశాం. ఇవన్నీ చేయడానికి మా ఇన్‌స్టిట్యూట్‌ పూర్వవిద్యార్థులు మాకు ఆర్థికంగా సాయం చేశారు’ అని చెబుతుంది అంజలీ మీనన్‌.

ఆటవస్తువుల్ని తయారుచేయడమే కాదు... ఆన్‌లైన్లోనూ విక్రయిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ మైదానాలు ఏర్పాటు చేశారు. స్పర్శ, భౌతిక ఎదుగుదల, సృజనాత్మకంగా ఆలోచించడం, ప్రాథమిక విషయాలు అర్థం చేసుకోవడం, సామాజిక బాధ్యత... వంటి అంశాలు నేర్చుకునేలా మైదానాలు రూపొందించారు. స్పర్శకు సంబంధించిన ఆటల్లో పిల్లలు వాసన, శబ్దం వంటి విషయాల ద్వారా ఆడుకుంటారు. సోషల్‌ ప్లేలో ఇతరులతో ఎలా మెలగడం, జట్టును సమన్వయం చేసుకుంటూ ఎలా ఆడాలనే విషయాలు తెలుస్తాయి. ఈ ఆటస్థలాలను కూడా విభిన్న వయసుల వారికి... వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.

 


మరిన్ని