టాప్ అప్ ఆరోగ్య బీమా పాలసీ ప్రయోజనాలు.. - Benefits-of-Top-up-policy
close

Published : 08/01/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్ అప్ ఆరోగ్య బీమా పాలసీ ప్రయోజనాలు..

ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమాను కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో పెరుగుతూపోతున్న వైద్య ఖర్చుల నుంచి బయట పడడానికి ఇది ఒక సమర్థవంతమైన సాధనంగా పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో సుమారు 25 కంటే ఎక్కువ నాన్-లైఫ్ కంపెనీలు ఆరోగ్య బీమా ఉత్పత్తులను అందిస్తున్నాయి. సాధారణంగా మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ కేవలం ఆసుపత్రి ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది, కానీ దానిని కొనుగోలు చేసే ముందు, మీ ఇతర ఖర్చులను తగ్గించే కొన్ని రకాల ఆప్షన్ లను మీరు పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఈ ప్రయోజనాలను అందించే ఫ్లోటర్ పాలసీ, టాప్ అప్ ప్లాన్లను ఎలా ఉపయోగించాలో మీ కోసం కింద తెలియచేశాము.

వ్యక్తిగతంగా:

పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ప్రాధమిక ఆరోగ్య కవర్ లో రూ. 5 లక్షల కనీస హామీ మొత్తం లేదా బీమా కవర్ తప్పనిసరి. ఒకవేళ మీరు పెద్ద నగరంలో నివసిస్తున్నట్లైతే, తప్పనిసరిగా మీ ఆరోగ్య బీమా కవర్ ను పెంచుకోవాల్సి ఉంటుంది. దాని కోసం టాప్ అప్ ప్లాన్ ను తీసుకోవడం మంచిది. అయితే, ప్రాథమిక ఆరోగ్య బీమా కవర్ తాలూకా పరిమితి పూర్తయిన తరువాత అయ్యే ఆసుపత్రి ఖర్చులను మాత్రమే టాప్ అప్ ప్లాన్ కవర్ చేస్తుంది. ఇది మీ ఆరోగ్య బీమా కవర్ ను పెంచుకోడానికి సరైన మార్గం.

కుటుంబం కోసం:

ఒకవేళ మీ కుటుంబం కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలనుకుంటే, ఒకే పాలసీలో మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే ఫ్లోటర్ పాలసీని కొనుగోలు చేస్తే మంచిదని, అలాగే ప్రతి సభ్యుని కోసం వ్యక్తిగత పాలసీని కొనుగోలు చేయడంతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుందని మీరు భావించవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక ఫ్లోటర్ పాలసీ మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తుంది. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్న అనంతరం క్లెయిమ్ చేసుకున్నట్లైతే, ఆ సంవత్సరానికి సంబంధించి కుటుంబ మొత్తం కవరేజ్ తగ్గుతుంది. కావున ఫ్లోటర్ ప్లాన్ ద్వారా లబ్ది పొందేందుకు, మీరు కొన్ని విషయాలను నిర్ధారించుకోవడం మంచిది. మొదటగా, మీరు తగినంత కవరేజ్ తీసుకోవాలని నిర్ధారించుకోండి. రెండోది, కుటుంబంలోని వారి వయస్సు తక్కువగా ఉన్నప్పుడు లేదా జీవిత భాగస్వాముల మధ్య వయస్సు తేడా మరీ ఎక్కువగా లేనప్పుడు మాత్రమే ఫ్లోటర్ పాలసీని తీసుకోవడం మంచిది. ఒకవేళ కుటుంబంలోని సభ్యుడి వయస్సు చాలా ఎక్కువగా ఉన్నా లేదా ఎవరైనా బాగా అనారోగ్యంతో ఉన్నట్లయితే, అలాంటి వారిని ఫ్లోటర్ పాలసీలోకి తీసుకోవడం అంత తెలివైన నిర్ణయం కాకపోవచ్చు.

ప్రాథమిక ఆరోగ్య బీమా పరిమితి దాటిన తర్వాత మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే టాప్ అప్ ఫ్లోటర్ ప్లాన్ ను కూడా మీరు తీసుకోవచ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని