Creta : అరుదైన మైలురాయి దాటిన క్రెటా..! - Hyundai Creta achieves new sales milestone in India
close

Published : 14/06/2021 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Creta : అరుదైన మైలురాయి దాటిన క్రెటా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: హ్యూందాయ్‌ ఎస్‌యూవీ క్రెటా అరుదైన మైలురాయిని దాటింది.  2015లో మార్కెట్లోకి విడుదలైన ఈ కారు ఆటోమొబైల్‌ ప్రియుల మనసు దోచుకొంది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని కారుగా నిలిచింది. ఈ ఆరేళ్లలో 6 లక్షల కార్లు అమ్ముడు పోయాయి. గతేడాది నుంచి కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌, ఆటోమొబైల్‌ మార్కెట్‌ మందకొడిగా ఉన్నా.. దీని అమ్మకాల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. వాస్తవానికి చివరి లక్ష కార్లను కేవలం 8 నెలల్లోనే విక్రయించడం విశేషం. ఇప్పటి వరకు అత్యధికంగా డీజిల్‌ వేరియంట్‌ 3,99,787 యూనిట్లు అమ్ముడు పోయింది. 

రెండోతరం క్రెటాను గతేడాది మార్చిలో విడుదల చేశారు. బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ కారు మూడు ఇంజిన్లలో అందుబాటులో ఉంది. 1.4లీటర్‌ టర్బో పెట్రోల్‌, 1.5లీటర్‌ పెట్రోల్‌,1.5లీటర్‌ డీజిల్‌ ఇంజిన్లతో ఇది లభిస్తుంది. ఇక ఐదు రకాల ట్రాన్స్‌మిషన్‌ ఆఫర్లను హ్యుందాయి కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. కారు ఇంజిన్‌ను బట్టి ఇవి ఉంటాయి. దీంతో 14 నెలల్లో 1,39,204 కార్లు అమ్ముడుపోయాయి. మొత్తం విక్రయాల్లో 20శాతం ఆటోమేటిక్‌ వేరియంట్‌ వాహనాలే కావడం విశేషం. భారత్‌లో గత ఆర్థిక సంవత్సరంలో 10,60,750 ఎస్‌యూవీలు అమ్ముడుపోగా.. వీటిల్లో 11శాతం విక్రయాలు క్రెటా ఎస్‌యూవీవే. ఈ మోడల్‌ ఎగుమతులు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,21,626 క్రెటాలను ఎగుమతి చేశారు. 

కరోనా సెకండ్‌ వేవ్‌ ఆటో మొబైల్‌ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది.  పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి, లాక్‌డౌన్‌ ఆంక్షల అమలు కారణంగా భారీగా అమ్మకాలు క్షీణించాయి. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, టయోటా ఇలా దాదాపు అన్ని సంస్థలూ అమ్మకాల్లో క్షీణత నమోదు చేశాయి.  హ్యుందాయ్‌ విక్రయాలు సైతం 49 శాతం పడిపోయాయి. ఏప్రిల్‌ నెలలో 49,002 యూనిట్లు విక్రయించిన ఈ సంస్థ మే నెలలో 25,001 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రెటా ఈ మైలురాయిని  సాధించడం విశేషం. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని