మార్కెట్లకు ద్రవ్యోల్బణ భయాలు! - Markets are in deep red
close

Updated : 15/03/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లకు ద్రవ్యోల్బణ భయాలు!

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్‌ కీలకమైన 50 వేల పాయింట్ల మార్క్‌ను.. నిఫ్టీ 15,000 మార్క్‌ను కోల్పోయాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతూ వచ్చాయి. మధ్యాహ్నం 2.02 గంటల సమయంలో సెన్సెక్స్ 753 పాయింట్లు కోల్పోయి 50,038 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 201 పాయింట్లు నష్టపోయి 14,829 వద్ద ట్రేడవుతోంది. బ్యాకింగ్‌, ఆర్థిక రంగాల్లోని షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లలో చాలా సూచీలు నష్టాల్లో పయనిస్తుండడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే నేడు వెలువడిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ డబ్ల్యూపీఐ వరుసగా రెండో నెలా ఎగబాకింది. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. మరోవైపు శుక్రవారం వెలువడిన రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠానికి చేరింది. డిసెంబరులో సానుకూలంగా నమోదైన పారిశ్రామికోత్పత్తి జనవరిలో మళ్లీ ప్రతికూలంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు సూచీలపై ప్రభావం చూపాయి. మరోవైపు చైనా ఆర్థిక పునరుత్తేజానికి సంబంధించి సోమవారం విడుదలైన గణాంకాలు ప్రతికూలంగా ఉండడం కూడా నేటి సూచీల పతనానికి ఓ కారణమయ్యాయి.

దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల సూచీలు దాదాపు మూడు శాతం మేర నష్టపోయాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, బ్రిటానియా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, దివీస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఫినాన్స్ లిమిటెడ్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో నమోదవుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని