రూ.లక్ష కోట్లకు చేరువలో ఎన్‌పీఎస్‌ - NPS close to Rs 1 lakh crore
close

Published : 18/08/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.లక్ష కోట్లకు చేరువలో ఎన్‌పీఎస్‌

దిల్లీ: కార్పొరేట్‌ ఉద్యోగులతో పాటు, సాధారణ ప్రజలు జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విభాగాల నుంచి ఎన్‌పీఎస్‌లో చేరిన ఖాతాదారుల సంఖ్య 30 లక్షలు దాటిందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్మన్‌ సుప్రతిమ్‌ బందోపాధ్యాయ్‌ మంగళవారం తెలిపారు. ఎన్‌పీఎస్‌లో అయిదు రకాల ఖాతాలుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది తప్పనిసరి. కార్పొరేట్‌ రంగం ఉద్యోగులు, సాధారణ ప్రజలు, ఎన్‌పీఎస్‌ లైట్‌ ఖాతాలు అందుబాటులో ఉంటాయి. ఇటీవల కాలంలో సాధారణ ప్రజలు ఈ ఖాతా ప్రారôభించేందుకు మొగ్గు చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆగస్టు 14 నాటికి ప్రభుత్వేతర విభాగాల నుంచి ఈ ఖాతాలో చేరిన వారు 30 లక్షలకు దాటడం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఇందులో కార్పొరేట్‌ నుంచి 11.97 లక్షల ఖాతాలుండగా, మిగతావారు సాధారణ మదుపరులని చెప్పారు. మొత్తం పెట్టుబడులు రూ.97,000 కోట్లకు చేరుకున్నాయని, త్వరలోనే రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. మార్చి 2018 నాటికి 13.5లక్షల మంది ఖాతాదారులుండగా, శరవేగంగా పెరిగారని వివరించారు. ఎన్‌పీఎస్‌ లైట్‌ను ఏప్రిల్‌ 1, 2015 నుంచి నిలిపివేయగా.. ఇందులో 42.92లక్షల మంది కొనసాగుతున్నారు. కార్పొరేట్‌, రిటైల్‌ ఖాతాదారుల సంఖ్య 30 లక్షలకు చేరేందుకు 12 ఏళ్ల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఇందులో 50 శాతం వరకు వృద్ధి గత ఆర్థిక సంవత్సరం నుంచే కనిపించిందని వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈనెల 14 వరకు చూస్తే.. రిటైల్‌ విభాగంలో 35శాతం వృద్ధి కనిపించింది. వీరి నుంచి జమైన మొత్తం రూ.25,639.16 కోట్లకు చేరుకుంది. కార్పొరేట్‌ విభాగం నుంచి వచ్చిన నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) రూ.6,37,089.79 కోట్లుగా ఉన్నాయి. అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) కింద నమోదైన 2.99 కోట్ల మంది పెట్టుబడులూ ఇందులో కలిసి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 9,100 సంస్థలు ఎన్‌పీఎస్‌ కింద నమోదయ్యాయి.


స్కాట్‌ కైషాలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 50% వాటా

దిల్లీ: ఫార్మా ప్యాకేజింగ్‌ సంస్థ స్కాట్‌ కైషాలో 50 శాతం వాటాను దేశీయ వ్యాక్సిన్‌ దిగ్గజం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోలు చేసింది. తద్వారా జర్మనీ స్పెషాలిటీ గ్లాస్‌ కంపెనీ స్కాట్‌ ఏజీ భాగస్వామిగా మారింది. మాజీ సహ యాజమానులు కైరస్‌ దాదాచన్‌జీ, షాపూర్‌ మిస్త్రీ, స్కాట్‌ల నుంచి ఈ వాటాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కొనుగోలు చేసింది. ఫార్మాస్యూటికల్‌ ప్యాకేజింగ్‌ కోసం ఈ కొనుగోలు జరిపినట్లు వెల్లడించింది. ఈ లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు సంస్థలు వెల్లడించలేదు. ఔషధాల ప్యాకేజింగ్‌లో వినియోగించే వయల్స్‌, సిరంజీలు, అంపౌల్స్‌, క్యాట్రిడ్జ్‌ల తయారీలో ఈ సంయుక్త సంస్థ అగ్రగామిగా ఉంది. సరైన ప్యాకేజింగ్‌ లేకుంటే ఎంత విలువైన ఔషధమైనా రోగిని చేరలేదని, ఔషధ రంగంలో సరఫరా వ్యవస్థ చాలా కీలకమైనదని, స్కాట్‌ ఇందుకు సరైన భాగస్వామి అని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని