ఆంక్షలతో రూ.1.5 లక్షల కోట్లు ఆవిరి! - SBI Estimates above rs 1 lakh cr lossess to the economy
close

Published : 23/04/2021 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆంక్షలతో రూ.1.5 లక్షల కోట్లు ఆవిరి!

 ఎస్‌బీఐ నివేదిక అంచనా

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రజారవాణాపై కఠిన ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ వేగం తగ్గి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లనుందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. దీంట్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వాటానే 80 శాతం వరకు ఉండొచ్చని తెలిపింది. ఒక్క మహారాష్ట్ర వల్లే 54 శాతం నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ 2021-22కిగానూ భారత జీడీపీ అంచనాల్ని తగ్గించింది. గతంలో అంచనా వేసిన రియల్‌ జీడీపీని 11 శాతం నుంచి 10.4 శాతానికి.. నామినల్‌ జీడీపీని 15 శాతం నుంచి 14.3 శాతానికి తగ్గించింది.

మహారాష్ట్రలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల నుంచి కార్మికులు సొంత ప్రాంతాలకు తరలి వెళ్తుండటంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా తయారీ రంగం తీవ్రంగా దెబ్బతిననున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో దాదాపు రూ.82 వేల కోట్ల నష్టం వాటిల్లనుందని తెలిపింది. ఒకవేళ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసినా.. దీర్ఘకాలం పొడిగించినా.. నష్టాలు మరింత ఎగబాకే అవకాశం ఉందని పేర్కొంది.

పశ్చిమ రైల్వే విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1-12 మధ్య మహారాష్ట్ర నుంచి దాదాపు 4.32 లక్షల మంది ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, అసోం, ఒడిశా రాష్ట్రాలకు తరలివెళ్లారు. వీరిలో బిహార్‌, యూపీకే 3.23 లక్షల మంది తిరిగొచ్చారు. ఇక సెంట్రల్‌ రైల్వే విభాగం గణాంకాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి ఉత్తర, తూర్పు ప్రాంతాలకు 4.7 లక్షల మంది తరలివెళ్లిపోయారు.

అయితే, కొన్ని ఆర్థిక సంస్థలు మాత్రం కొవిడ్‌ రెండో దశ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తాత్కాలికమేనని అభిప్రాయపడుతున్నాయి. ప్రయాణాలపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించకపోతే.. వచ్చే మూడు నెలల వరకే ఈ ప్రభావం ఉంటుందని నోమురా సంస్థ తెలిపింది. మహమ్మారి పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ సర్దుబాటయిందని వివరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని