ఏడాదిలోగా టోల్‌ప్లాజాలు తొలగిస్తాం - Toll booths to be removed GPS-based toll collection within 1 year Gadkari
close

Published : 18/03/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాదిలోగా టోల్‌ప్లాజాలు తొలగిస్తాం

లోక్‌సభలో గడ్కరీ వెల్లడి

దిల్లీ: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ‘‘ఏడాది కల్లా దేశంలోని అన్ని టోల్‌బూత్‌లను తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం’’ అని గడ్కరీ వివరించారు. 

ఇక దేశవ్యాప్తంగా 93శాతం వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. అయితే మిగతా 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్‌ కడుతున్నా ఫాస్టాగ్‌ ఉపయోగించడం లేదని చెప్పారు. ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు 2016లో ఫాస్టాగ్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి అన్ని జాతీయ రహదారులపై వీటి వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్‌ లేని వారి నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేస్తున్నారు. 

అయితే ఇప్పుడు అన్ని వాహనాల్లో వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ వస్తున్నందున.. టోల్‌ వసూలుకు కూడా జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది. జీపీఎస్‌ ఆధారంగా... వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ గతంలో వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలు పడతాయి.

ఇదీ చదవండి..

భారీ డిస్కౌంట్లు ప్రకటించిన టాటామోటార్స్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని