ఉత్తమ క్యాన్సర్ బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి?  - World-cancer-day-know-how-to-select-the-best-cancer-insurance-policy
close

Updated : 05/02/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్తమ క్యాన్సర్ బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి? 

నేడు (ఫిబ్ర‌వ‌రి 4వ తేది) ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినం. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సాధారణంగా భారతీయులు మరణం గురించి మాట్లాడడం లేదా దాని గురించి ఆలోచించడానికి ఇష్టపడరు. కానీ భార‌త‌దేశంలో ఎక్కువ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న రెండ‌వ అతిపెద్ద అనారోగ్య కార‌ణం. అందువ‌ల్ల‌ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి పూర్తి అవగాహానను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఏమి జరుగుతుంది? మీ కుటుంబం, పిల్లలకు ఏమి జరుగుతుంది? ఈ ప్రశ్నలకు మన దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉండాలి.

ఇలాంటి వ్యాధుల నుంచి లేదా వాటి వలన కలిగే నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా కష్టం. ఈ వ్యాధులు వారి కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారుతాయి. దీనికి సరైన పరిష్కారం క్యాన్సర్ బీమా పాలసీ.

భారతదేశంలో ఉత్తమ క్యాన్సర్ బీమా పాలసీ ఏది?

సాధారణ, జీవిత బీమా సంస్థలు రెండూ క్యాన్సర్ బీమా పాలసీలను అందిస్తున్నాయి. అయితే ఇక్కడ జీవిత బీమా సంస్థలు అందించే క్యాన్సర్ బీమా పాలసీల గురించి మనం మాట్లాడుకుంటున్నాము.

క్యాన్సర్ బీమా పాలసీ అంటే ఏమిటి?

క్యాన్సర్ బీమా పాలసీ అనేది ఇతర బీమా పాలసీల మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ బీమా తీసుకున్న వ్యక్తి వ్యాధి బాధితుడు, సంఘటన వ్యాధి. అలాగే బీమా సంస్థ సాధారణంగా జీవిత బీమా సంస్థ లేదా సాధారణ బీమా సంస్థ కావచ్చు.

క్యాన్సర్ బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి, క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు మాత్రమే హామీ మొత్తాన్ని మంజూరు చేస్తారు. సదరు వ్యక్తి చికిత్సకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయడానికి ఈ హామీ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. బీమా పాలసీ కోసం చెల్లించే ప్రీమియం ఆధారంగా హామీ మొత్తం మారుతూ ఉంటుంది. అధిక ప్రీమియం చెల్లించినట్లైతే, అధిక హామీ మొత్తం లభిస్తుంది, అదే తక్కువ ప్రీమియం చెల్లించినట్లైతే, తక్కువ హామీ మొత్తం లభిస్తుంది.

అలాగే, చెల్లించవలసిన మొత్తం క్యాన్సర్ ప్రారంభ దశ, వ్యాధి ముదిరిన దశ వంటి వివిధ దశలపై ఆధారపడి ఉంటుంది.

క్యాన్సర్ బీమా పాలసీ ఎలా పనిచేస్తుంది?

క్యాన్సర్ బీమా పాలసీ చెల్లింపు రెండు విధాలుగా పనిచేస్తుంది.

మొదటి / ప్రారంభ దశ క్యాన్సర్ :

చెల్లించవలసిన మొత్తం

ఒక వ్యక్తి మొదటి దశ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయితే, హామీ మొత్తంలో కొంత శాతాన్ని ఒకేసారి చెల్లిస్తాయి. అయితే కొన్ని సంస్థలు హామీ ఇచ్చిన మొత్తంలో 20 శాతం చెల్లించగా, కొన్ని సంస్థలు మాత్రం 25 శాతం చెల్లిస్తాయి. అలాగే కొన్ని సంస్థలు 30 శాతం వరకు హామీ మొత్తాన్ని చెల్లిస్తాయి.

ప్రీమియం మాఫీ

ఒక వ్యక్తికి క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నట్లు నిర్ధారణ అయితే, భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తారు. ఇది కూడా ఒక్కో సంస్థకు ఒక్కోలా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, మ్యాక్ లైఫ్ సంస్థలు భవిష్యత్తు ప్రీమియంలను మాఫీ చేస్తాయి. కాగా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్‌ఐసీ సంస్థలు మాత్రం మూడు సంవత్సరాలు ప్రీమియంను మాఫీ చేస్తాయి.

ఉదాహరణకు సుమిత్ అనే 40 సంవత్సరాల వ్యక్తి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ. 20 లక్షల హామీ మొత్తంతో ఒక క్యాన్సర్ బీమా పాలసీని తీసుకున్నాడు. 42 ఏళ్ళ వయసులో సుమిత్‌కు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అతనికి హామీ మొత్తంలో 25 శాతం అనగా రూ. 5 లక్షలను చెల్లిస్తారు. మొదటి ప్రీమియంను చెల్లించిన తర్వాత భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలన్నీ మాఫీ చేస్తారు. కానీ పాలసీ మాత్రం కొనసాగుతుంది.

ముదిరిన దశ క్యాన్సర్ :

ఒక వ్యక్తి ముదిరిన దశ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లైతే, భవిష్యత్తులో అతను చెల్లించాల్సిన ప్రీమియంలన్నీ మాఫీ అవడంతో పాటు, హామీ ఇచ్చిన మొత్తాన్ని అతనికి చెల్లిస్తారు.

పైన తెలిపిన ఉదాహరణలో, సుమిత్ 42 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్ ముదిరిన దశలో ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, అతనికి 100 శాతం హామీ మొత్తం లభిస్తుంది, అనగా అతని వైద్య ఖర్చుల కోసం రూ. 20 లక్షల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. హామీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత భవిష్యత్తులో అతను చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు మాఫీ అవడంతో పాటు పాలసీని నిలిపివేస్తారు.

ఒకవేళ సుమిత్ మొదట ప్రారంభ దశ క్యాన్సర్‌తో బాధపడుతూ, తరువాత ముదిరిన దశ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లైతే ఇలాంటి సందర్భంలో రూ. 5 లక్షల హామీ మొత్తాన్ని అందిస్తారు. ప్రారంభ దశ క్యాన్సర్ నిర్ధారణ తర్వాత మాత్రమే దీనిని చెల్లిస్తారు. ముదిరిన దశ క్యాన్సర్ నిర్ధారణ తర్వాత మిగిలిన రూ. 15 లక్షలను చెల్లిస్తారు.

భారతదేశంలో క్యాన్సర్ బీమా పాలసీ వలన కలిగే లాభాలు, నష్టాలు :

బీమా పాలసీని తీసుకోవడం ద్వారా కలిగే స్పష్టమైన ప్రయోజనం ఏమిటంటే, వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందడం. భారతదేశంలో సరైన క్యాన్సర్ పాలసీ లేకుండా పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్సను పొందడం దాదాపు అసాధ్యం. ఎక్కువ శాతం క్యాన్సర్ బీమా పాలసీలు తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా, ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ బీమాతో సంబంధం ఉన్న అనేక సమస్యలు కూడా ఉన్నాయి.

వెయిటింగ్ పీరియడ్ :

భారతదేశంలోని అన్ని క్యాన్సర్ బీమా పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ 180 రోజులు ఉంటుంది. ఒకవేళ పాలసీని కొనుగోలు చేసిన 180 రోజుల్లోపు మీకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, అలాంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి బీమా ప్రయోజనాన్ని పొందలేరు.

సెర్వైవల్ పీరియడ్ :

చాలా వరకు క్యాన్సర్ బీమా పాలసీలలో ఉన్న రెండవ నిబంధన ఏమిటంటే, పాలసీదారుడు కనీసం ఏడు రోజుల పాటు జీవించి ఉండాలి. అప్పుడే బీమా సంస్థలు హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. పీఎన్బీ మెట్‌లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌కు మాత్రం ఎలాంటి సెర్వైవల్ పీరియడ్ ఉండదు. దాని అర్ధం ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయిన ఏడు రోజుల్లోగా వ్యక్తి మరణించినట్లైతే, హామీ మొత్తాన్ని చెల్లించరు.

వివిధ రకాల ఫీచర్స్ తో క్యాన్సర్ బీమా పాలసీ కంపారిజన్ :

క్యాన్సర్ బీమా మార్కెట్లో చాలా బీమా సంస్థలు 18 నుంచి 65 మధ్య వయస్సు గల వారికి మాత్రమే బీమా పాలసీని అందిస్తారు. వీటిలో ఎస్బీఐ సంపూర్న్ క్యాన్సర్ సురక్ష పాలసీ ఒకటి. దీనికి గల కారణం ఆరు సంవత్సరాల వయస్సు నుంచే తమ ఖాతాదారులను పాలసీ కవర్ చేయడం ప్రారంభిస్తుంది. దీనికి విరుద్ధంగా, మ్యాక్ క్యాన్సర్ ఇన్సూరెన్స్ పాలసీ 25 సంవత్సరాల వయస్సు నుంచి కవర్ చేయడం ప్రారంభిస్తుంది

సాధారణంగా క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, పూర్తి హామీ మొత్తంలో 25 శాతాన్ని చెల్లిస్తారు. సాధారణంగా ప్రారంభ దశ చెల్లింపులపై ఎలాంటి పరిమితులు ఉండవు. కానీ పీఎన్బీ, ఏగాన్ వంటి కొన్ని బీమా సంస్థలు రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల గరిష్ట హామీ మొత్తాన్ని కలిగి ఉంటాయి. సర్వైవల్ పీరియడ్ పరంగా ఐపీఆర్యూ క్యాన్సర్, పీఎన్బీ మేరా క్యాన్సర్ చాలా ప్రయోజనకరమైన పాలసీలు. ఎందుకంటే ఈ పాలసీలకు సర్వైవల్ పీరియడ్ ఉండదు.

పాలసీ కాలపరిమితిని తనిఖీ చేయండి (మెచ్యూరిటీ కాలపరిమితి, ప్రీమియం అన్ని పాలసీలకు సమానంగా ఉంటాయి). పాలసీ కాలపరిమితి విషయానికి వస్తే, క్యాన్సర్ కవర్ కోసం సరిగ్గా సరిపోయే మూడు పాలసీలను కింద తెలియచేశాము.

ఐసీఐసీఐ ప్రూడెన్సియల్ హార్ట్ అండ్ క్యాన్సర్
మ్యాక్స్ క్యాన్సర్ ఇన్సూరెన్సు
ఏగాన్ ఐకేర్
ఏగాన్ ఐకేర్‌లో మొదటి దశ క్యాన్సర్ చెల్లింపులపై పరిమితి ఉన్నందున మిగిలిన రెండు క్యాన్సర్ పాలసీలను పరిశీలించడం మంచిది.

రెండు పాలసీలలో మిగిలిన అన్ని ఫీచర్స్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కావున, రెండు క్యాన్సర్ పాలసీలలో మీకు నచ్చిన పాలసీని ఎంచుకోండి. మ్యాక్స్ క్యాన్సర్ ఇన్సూరెన్సు తో పోల్చితే ఐసీఐసీఐ ప్రూడెన్సియల్ హార్ట్ అండ్ క్యాన్సర్ పాలసీని తీసుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇందులో మీరు హార్ట్ ఇన్సూరెన్సు అదనపు కవర్‌ను చేర్చుకోవచ్చు.

క్యాన్సర్ బీమా పాలసీని తీసుకోవచ్చా?

మీరు ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా మాత్రమే దీన్ని ఎంచుకోవాలి. భారతదేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. పైగా ఈ పాలసీల ప్రీమియంలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ పరిగణనలోకి తీసుకోవలసిన మరో విషయం ఏమిటంటే, పాలసీ మొత్తం వ్యవధిలో ఈ ప్రీమియం స్థిరంగా ఉంటుంది.

 

ఇదీ చ‌ద‌వండి..
క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ  హామీ మొత్తం ఎంత ఉండాలి? 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని