స్టాక్‌ మార్కెట్‌.. ఆద్యంతం ఊగిసలాట - benchmark indices ends with little profits
close

Published : 06/04/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్‌.. ఆద్యంతం ఊగిసలాట

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపట్లోనే లాభాల్లోకి చేరుకున్నాయి. ఒంటిగంట తర్వాత ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఊగిసలాట ధోరణిలో పయనించాయి. ఉదయం 49,441 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 49,582 వద్ద గరిష్ఠాన్ని, 48,936 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 42 పాయింట్ల లాభంతో 49,301 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికి వస్తే.. 14,737 వద్ద ప్రారంభమై 14,779-14,573 మధ్య కదలాడింది. ఆఖరుకు 45 పాయింట్లు లాభపడి 14,683 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.38 వద్ద ముగిసింది. 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల ఫలితాలు నేడు మార్కెట్లకు అండగా నిలవగా.. దేశీయంగా కరోనా కేసుల విజృంభణ, కఠిన ఆంక్షల అమలు సూచీలను కలవరపాటుకు గురిచేశాయి. ఉదయపు లాభాల స్వీకరణ నేపథ్యంలో సూచీలు ఓ దశలో నేలచూపులు చూడగా.. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి అందిన బలమైన సంకేతాలు నష్టాల్ని కట్టడి చేశాయి. ఈ నేపథ్యంలోనే నేడు మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో పయనించాయి.

పారిశ్రామిక, మౌలిక, ఎఫ్ఎంసీజీ, స్థిరాస్తి, లోహ, టెలికాం రంగాల షేర్లు లాభాల్లో పయనించగా.. బ్యాంకింగ్‌, పీఎస్‌యూ, ఇంధన రంగం షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్‌ షేర్లు ఏకంగా 12.57 శాతం ఎగిశాయి. టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల షేర్లు లాభపడగా.. పవర్‌గ్రిడ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని