close

Updated : 02/03/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ టీకా సమాచారమే లక్ష్యం!

 సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, పతంజలి, ఎయిమ్స్‌ ఐటీ వ్యవస్థలపై హ్యాకర్ల దాడి
 గతంలోనూ కొన్ని ఫార్మా కంపెనీలపై ఇదే తరహా దాడులు
 ఐటీ సిస్టమ్స్‌ భద్రతపై దృష్టి సారించాలంటున్న నిపుణులు

తి తక్కువ సమయంలో కొవిడ్‌-19 టీకాలు అభివృద్ధి చేసి, తయారు చేయడమే కాకుండా దేశ, విదేశాలకు సరఫరా చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌తో పాటు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అబాట్‌ ఇండియా, పతంజలి, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వంటి ప్రతిష్ఠాత్మక ఔషధ సంస్థలు, ఆసుపత్రుల ఐటీ వ్యవస్థలే లక్ష్యంగా హ్యాకర్‌ బృందాలు దాడులు చేస్తున్నాయి. టీకా సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా కొన్ని వారాలుగా ఆ బృందాలు పెద్దఎత్తున దాడులు చేసినట్లు తెలుస్తోంది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ సహకారం పొందుతూ సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే సైబర్‌ నిఘా సంస్థ సైఫర్మా తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయంగా 15 హ్యాకర్‌ బృందాలు భారత ఔషధ సంస్థలపై దాడులే లక్ష్యంగా ఉన్నాయి. వాటిల్లో 7 రష్యాకు చెందినవి కాగా, 4 చైనా, 3 ఉత్తర కొరియా, ఒకటి ఇరాన్‌కు చెందినవి.  భారత సంస్థల ఐటీ నెట్‌వర్క్‌లో భద్రతాపరమైన లోపాలు గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకుని ఇవి దాడులకు దిగినట్లు సైఫర్మా వెల్లడించింది.

అంతర్జాతీయంగా పైచేయి సాధించేందుకే

‘‘ఈ దాడుల లక్ష్యం ఒకటే. భారత కంపెనీల నుంచి టీకా తయారీ పరిజ్ఞానాన్ని తస్కరించటం, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌ కంటే పైచేయి సాధించటం’ అని సైఫర్మా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కుమార్‌ రితేష్‌ వివరించారు. దాదాపు 750 మంది సైబర్‌ నేరస్తులు, 2,000 హ్యాకింగ్‌ బృందాల చర్యలపై సైఫర్మా ఒక కన్నేసి ఉంచుతుంది. దీనికోసం ‘డిసిఫెర్‌’ అనే ఐటీ టూల్‌ను వినియోగిస్తుంది.
* ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆవిష్కరించిన కొవిడ్‌-19 టీకాను మనదేశంలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), ‘కొవిషీల్డ్‌’ బ్రాండుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా కంపెనీ అయిన నొవావ్యాక్స్‌ టీకాను కూడా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ త్వరలో తయారు చేయనుంది. అందువల్ల సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై చైనా హ్యాకర్లు కన్నేశారు. పైగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పబ్లిక్‌ సర్వర్లు బలహీనమైన వెబ్‌ సర్వర్ల మీద నడుస్తున్నాయని కుమార్‌ రితేష్‌ పేర్కొన్నారు.  సైఫర్మా, ఈ వ్యవహారాన్ని భారత ప్రభుత్వంలోని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.

గతేడాదిలోనూ

గత ఏడాదిలో ఇదేవిధంగా చైనా హ్యాకర్లు, మనదేశంలోని ఫార్మా కంపెనీల డేటా బేస్‌లోకి చొరబడి కీలక ఔషధ సమాచారాన్ని తస్కరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు చెందిన కంప్యూటర్‌ వ్యవస్థలపై హ్యాకర్లు దాడి చేయగా, అప్రమత్తమైన డాక్టర్‌ రెడ్డీస్‌ తన సర్వర్లను తాత్కాలికంగా ‘డౌన్‌’ చేయడం తెలిసిందే డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ సంస్థతో ‘స్పుత్నిక్‌ వి’ టీకా తయారీ ఒప్పందం కుదుర్చుకుని, దానిపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఆ టీకా తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు దాడులు చేసినట్లు అప్పట్లో భావించారు. ఆ తర్వాత దేశీయ ఔషధ కంపెనీలు తమ ఐటీ వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. అయినప్పటికీ చైనా హ్యాకర్లు, ఇక్కడి ఔషధ కంపెనీల సమాచారాన్ని తస్కరించే యత్నాలను కొనసాగిస్తున్నట్లు తాజాగా వెల్లడయిన సమాచారం స్పష్టం చేస్తోంది. క్లినికల్‌ పరీక్షల వివరాలనూ తస్కరించేందుకు అపహరిస్తున్నారు.

ఫ్రాన్స్‌, రష్యా, యూకేల్లోనూ

మనదేశంలోనే కాకుండా రష్యా, కెనడా, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, యూకే దేశాల్లోని ఔషధ కంపెనీలు కూడా హ్యాకర్ల దాడులకు గురవుతున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు యూకే కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా కంప్యూటర్‌ సిస్టమ్స్‌లోకి జొరపడేందుకు విశ్వప్రయత్నం చేసిన సంగతి గమనార్హం. రెండు నెలల క్రితం ఫైజర్‌- బయాన్‌టెక్‌ సిస్టమ్స్‌లోకి హ్యాకర్లు చొరబడి కొవిడ్‌-19 టీకా సమాచారాన్ని తస్కరించే ప్రయత్నం చేసినట్లు ఈ రెండు కంపెనీలు వెల్లడించాయి.
ఈ పరిస్థితుల్లో మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలు, ముఖ్యంగా కొవిడ్‌-19 టీకా తయారీలో నిమగ్నమై ఉన్న ఫార్మా/ బయోటెక్‌ కంపెనీలు తమ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నట్లు స్థానిక ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఐటీ భద్రతపై పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నట్లు వివరిస్తున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని