సూచీలకు సానుకూలతలు
close

Published : 10/05/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూచీలకు సానుకూలతలు

బలమైన కార్పొరేట్‌ ఫలితాల నేపథ్యం
అంతర్జాతీయ మార్కెట్లూ కీలకం
ఐటీ, లోహ షేర్లకు లాభాలు
గురువారం ‘రంజాన్‌’ సెలవు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

సూచీలు ఈ వారం లాభాల్లో కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాన కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు పటిష్ఠంగా ఉండటం, అంతర్జాతీయ ఈక్విటీల నుంచి సానుకూలతలు ఇందుకు దోహద పడతాయని భావిస్తున్నారు. ఎమ్‌ఎస్‌సీఐకి చెందిన పాక్షిక వార్షిక సూచీ సమీక్ష (మంగళ) నుంచీ మార్కెట్‌కు మద్దతు లభించొచ్చంటున్నారు.  అయితే కరోనా కేసుల ఉద్ధృతి వల్ల లాభాలు పరిమితం అవుతాయని బ్రోకరేజీలు అంటున్నాయి. నిఫ్టీ-50 ఈ వారం 14,600-15,200 శ్రేణిలో చలించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. గురువారం ‘రంజాన్‌’ సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. ఈ వారం ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌ అండ్‌ టీ, యూపీఎల్‌లు ఫలితాలు ప్రకటించనున్నాయి. మార్చి నెల పారిశామ్రికోత్పత్తి గణాంకాలు, ఏప్రిల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రభావం చూపుతాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* దేశంలో పెట్రో వినియోగం తగ్గడంతో చమురు కంపెనీల షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. చాలా వరకు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాటలో నడుస్తుండడం ఇందుకు నేపథ్యం.  
* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత వారం ప్రకటించిన చర్యల కారణంగా బ్యాంకు షేర్ల దీర్ఘకాల అంచనాలు మెరుగవ్వచ్చు. జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాల ఆధారంగా చలనాలు కనిపించొచ్చు.  
* కరోనా మలి దశ నేపథ్యంలో ఔషధ కంపెనీల షేర్లు సూచీల కంటే మిన్నగా రాణించవచ్చు. దేశీయంగా ఏప్రిల్‌లో ఔషధాల విక్రయాలు 51.5 శాతం పెరగడం కొవిడ్‌-19 సంబంధిత ఔషధాలకున్న గిరాకీని సూచిస్తోంది. సిప్లా ఫలితాలు, టీకా సంబంధిత పరిణామాలు ఈ రంగ షేర్లపై ప్రభావం చూపొచ్చు.
* కీలక సూచీల నుంచి ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. మంగళవారం ఫలితాలు ప్రకటించనున్న గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ షేర్లు వెలుగులోకి రావొచ్చు. సూచీలకు అనుగుణంగా ఈ రంగ షేర్లు  రాణించవచ్చు.
* ఏప్రిల్‌ రిటైల్‌ విక్రయాల నుంచి   వాహన కంపెనీల షేర్లు సంకేతాలు అందుకోవచ్చు. లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ఏప్రిల్‌ ద్వితీయార్ధంలో రిటైల్‌ విక్రయాలు భారీగా క్షీణించి ఉండొచ్చని భావిస్తున్నారు.  
* అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం అంచనాలను మించి 61.5% పెరిగినా, ఈ రంగ షేర్లలో అంతర్లీనంగా ఉన్న బలహీనతలు లాభాలను పరిమితం చేయొచ్చు.  
* ఎటువంటి వార్తలూ లేనందున ఐటీ కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. ఎంఫసిస్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌ ఫలితాల ప్రభావం కనిపించొచ్చు.
* లోహ, గనుల కంపెనీల షేర్లలో సానుకూలతలు కొనసాగొచ్చు. సూచీల నుంచీ అదనపు బలం అందొచ్చు. కొద్ది వారాలుగా నిఫ్టీ-50తో పోలిస్తే నిఫ్టీ లోహ సూచీ రాణిస్తోంది.  జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌(బుధ), వేదాంతా(శుక్ర)ల ఫలితాలను మదుపర్లు గమనించొచ్చు.
* ఎంపిక చేసిన టెలికాం కంపెనీల షేర్లలో చలనాలు కనిపించొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడొచ్చు. వొడాఫోన్‌ ఐడియా షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని