టోకు రేట్లు భగభగ
close

Published : 18/05/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టోకు రేట్లు భగభగ

ఏప్రిల్‌లో 10.49 శాతానికి ద్రవ్యోల్బణం
ఆల్‌టైం గరిష్ఠ స్థాయి ఇది
పెరిగిన ఆహార, చమురు ధరలు

దిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరింది. రెండంకెలకు పెరిగింది. ఆహార వస్తువులు, ముడి చమురు, తయారీ వస్తువులు ప్రియం కావడంతో 10.49 శాతంగా నమోదైంది. వరుసగా నాలుగో నెలా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం పెరుగుతూ వచ్చింది. మార్చిలో ఇది 7.39 శాతంగా ఉంది. గతేడాది ఏప్రిల్‌లో -1.57 శాతంగా ఉండడంతో (తక్కువ ప్రాతిపదిక) ఈ ఏప్రిల్‌లో భారీగా పెరిగిందని వాణిజ్య శాఖ వెల్లడించింది.
* ఏప్రిల్‌లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 4.92 శాతంగా నమోదైంది. గుడ్లు, మాంసం, చేపల ధరలు 10.88 శాతం; పప్పు ధాన్యాలు 10.74%, పళ్లు 27.43 శాతం మేర ప్రియం కావడం ఇందుకు నేపథ్యం. కూరగాయల రేట్లు మాత్రం (-)9.03 శాతం తగ్గాయి. అంతక్రితం నెల ఇవి (-) 5.19 శాతం చౌకగా మారాయి.
* ఇంధన, విద్యుత్‌ 20.94%, తయారీ ఉత్పత్తులు 9.01 శాతం చొప్పున ఖరీదయ్యాయి.

మే నెలలో 13-13.5%?
ఆహార వస్తువుల ధరలు ఆరు నెలల గరిష్ఠానికి చేరడం చూస్తుంటే సరఫరా వైపు ఇబ్బందులు కలుగుతున్నాయని అర్థమవుతోందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తగ్గే ముందు ఈ నెలలో 13-13.5 శాతానికి చేరవచ్చని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం పెరిగినా.. వృద్ధికి ఊతమిచ్చేందు కోసం రేట్ల కోతకు అవకాశం ఉండకపోవచ్చని.. పరపతి ధోరణి ‘సర్దుబాటు’లోనే కొనసాగొచ్చని అన్నారు. ఈ ఏడాదిలో మిగతా భాగమంతా ద్రవ్యోల్బణం ఎలా ఉంటుందన్నది కరోనా కేసులు, లాక్‌డౌన్‌లు, సరఫరాలపై ప్రభావంపై ఆధారపడి ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రధాన ఆర్థికవేత్త సునీల్‌ కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. కాగా, గత వారం విడుదలైన రిటైల్‌ ద్రవ్యోల్బణం(సీపీఐ) ఏప్రిల్‌ నెలలో 4.29 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని