ఎఫ్‌డీఐల దారి భారత్‌కే
close

Published : 21/09/2021 04:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎఫ్‌డీఐల దారి భారత్‌కే

డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌

వాషింగ్టన్‌: భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) కీలకమని డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌ అంటున్నారు. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, సింగపూర్‌లలో కంపెనీ సర్వే చేసిన 1200 మంది వ్యాపారుల్లో అయిదింట రెండొంతుల మంది భారత్‌లో తొలిసారిగా లేదా అదనపు పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే ప్రకారం.. ఎఫ్‌డీఐకి అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానాల్లో భారత్‌ కొనసాగుతోందన్నారు.  ఇంకా ఏమన్నారంటే..

వచ్చే రెండేళ్లలో భారీ పెట్టుబడులు

కరోనా సంక్షోభంలోనూ గతేడాది భారత్‌లో ఎఫ్‌డీఐలు రికార్డు గరిష్ఠ స్థాయిని తాకాయి. ఆర్థిక వృద్ధికి దేశీయంగా నైపుణ్యం ఉన్న సిబ్బంది అత్యంత కీలకం. ఇప్పటికీ వ్యాపారం చేయడానికి భారత్‌ ఒక సవాలు విసిరే దేశంగానే ఉంది. ఇందుకు కారణం ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలపై తక్కువ స్పృహ ఉండడమే. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సర్వేలో పాల్గొన్న 44 శాతం మంది ప్రపంచ వ్యాపారవేత్తలు అదనంగా, తొలిసారిగా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొలిసారిగా పెట్టుబడులు పెట్టాలనుకున్నవారిలో మూడింట రెండొంతుల మంది వచ్చే రెండేళ్లలోనే ఆ పని చేయనున్నారు.

వచ్చే మూడేళ్లలో 75,000 నియామకాలు

ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి దేశీయ మార్కెట్‌ చాలా ముఖ్యం. ఆర్థిక వృద్ధి, నైపుణ్య సిబ్బంది విషయంలో భారత్‌కు వ్యాపారవేత్తలు ఎక్కువ రేటింగ్‌ ఇస్తున్నారు. అయితే జపాన్‌లో 16% మంది; సింగపూర్‌లో 9% మందికి భారత్‌లోని సంస్కరణలపై అవగాహన లేదు. ప్రభుత్వం మంచి సంస్కరణలు తెస్తున్నా.. వాటి గురించి తెలియడం లేదు. డెలాయిట్‌ విషయానికొస్తే వచ్చే మూడేళ్లలో 75,000కు పైగా నియామకాలు చేపడతామని ప్రధాని మోదీకి చెప్పాం. మా కంపెనీకి భారత్‌ అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా మా ఉద్యోగులు 3.45 లక్షల మంది అయితే, అందులో 65,000 మంది భారత్‌లోనే ఉన్నారు.


అంతర్జాతీయ వినూత్నత సూచీలో భారత్‌కు 46వ స్థానం

దిల్లీ: ఈ ఏడాది ప్రకటించిన అంతర్జాతీయ వినూత్నత సూచీలో (జీఐఐ) భారత్‌ 46వ ర్యాంకు సాధించిందని వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రోపర్టీ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది. 2020తో పోలిస్తే 2 స్థానాలు మెరుగుపర్చుకుందని తెలిపింది. గత కొన్నేళ్లుగా భారత్‌ వృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, 2015లో 81వ ర్యాంకులో ఉండగా, తాజాగా 46వ ర్యాంకుకు చేరుకుందని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థలు చేస్తున్న అద్భుత పని, అంకురాల వ్యవస్థ, నాలెడ్జ్‌ క్యాపిటల్‌తో భారత్‌ జీఐఐ ర్యాంకింగ్‌లో స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోందని పేర్కొంది. అటామిక్‌ ఎనర్జీ, సైన్స్‌, టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అంతరిక్ష విభాగం వంటి శాస్త్ర విభాగాలు నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించింది.


డిసెంబరు చివరి కల్లా 600 నియామకాలు

ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌

దిల్లీ: ప్రస్తుత సంవత్సరం చివరికల్లా 600 మందిని పైగా నియమించుకోన్నుట్లు ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. అందుబాటు గృహ రుణాలకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ శాఖల్లో విక్రయాలు, క్రెడిట్‌ విభాగాల్లో ఈ నియామకాలను చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గృహ రుణం తీసుకునేందుకు ఐటీ రిటర్నులు ఆధారంగా సమర్పించేని వారి కోసం అప్నా ఘర్‌, అప్నా ఘర్‌ డ్రీమ్స్‌ పేరుతో అందుబాటు గృహ రుణ పథకాలను ఐసీఐసీఐ హోమ్‌ ఫైనాన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వేతన జీవులతో పాటు విక్రయదార్లు, పండ్లు, కూరగాయల విక్రేతలు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, కంప్యూటరు ఆపరేటర్లు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తదితరులు ఈ పథకాల కింద గృహ రుణాలు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని