సంక్షిప్త వార్తలు
close

Published : 21/10/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

హైదరాబాద్‌లో పారివేర్‌ స్టుడియో

ఈనాడు, హైదరాబాద్‌: శానిటరీ ఉత్పత్తుల సంస్థ రోకా పారివేర్‌ హైదరాబాద్‌లో తన తొలి ప్రదర్శనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి, వాటిని ఎంచుకునేందుకు వినియోగదారులకు ఇది తోడ్పడుతుందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేఈ రంగనాథన్‌ తెలిపారు. దాదాపు 100కు పైగా ఉత్పత్తులను 6వేల చదరపు అడుగుల స్టుడియోలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలే శుభ్రతా విభాగంలోనూ పలు ఉత్పత్తులు తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రూ.500 కోట్ల చొప్పున మార్కెట్‌ ఉందని, ఇందులో కనీసం 25 శాతం వాటా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు  తెలిపారు.


జనప్రియ లేక్‌ఫ్రంట్‌ ప్రాజెక్టుకు ‘స్వామిహ్‌ ఫండ్‌’ నుంచి రూ.136 కోట్ల పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి సంస్థ జనప్రియ ఇంజనీర్స్‌ సిండికేట్‌ హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో నిర్మిస్తున్న జనప్రియ లేక్‌ఫ్రంట్‌ ప్రాజెక్టులో స్వామిహ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌-1 పెట్టుబడి పెట్టింది. దాదాపు 8.2 ఎకరాల్లో 12.56 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉండే ఈ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టుకు స్వామిహ్‌ ఫండ్‌ రూ.136 కోట్లు పెట్టుబడి సమకూర్చినట్లు జనప్రియ ఇంజనీర్స్‌ సిండికేట్‌ వెల్లడించింది. కొవిడ్‌-19 కారణంగా ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత ఏర్పడినట్లు, స్వామిహ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌-1 నిధులతో దీన్ని పూర్తిచేయనున్నట్లు పేర్కొంది. స్వామిహ్‌ (స్పెషల్‌ విండో ఫర్‌ కంప్లీషన్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ అఫర్డబుల్‌ అండ్‌ మిడ్‌ ఇన్‌కమ్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌) అనేది  కేటగిరీ- 2 ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంస్థ. దీన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులో ఆవిష్కరించింది. సగంలో నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు చేయూత నిచ్చేందుకు      రూ.12,500 కోట్లతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 93 ప్రాజెక్టులకు ఈ నిధి నుంచి పెట్టుబడులు లభించాయి.


అంకురాలకు మైక్రోసాఫ్ట్‌ తోడ్పాటు

దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) వినియోగించే అంకురాలకు తోడ్పాటు అందించే లక్ష్యంతో ‘మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఇన్నోవేట్‌’ కార్యక్రమాన్ని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రారంభించింది. ఈ 10 వారాల కార్యక్రమంలో భాగంగా భారత్‌లో అంకురాలకు ఏఐ టెక్నాలజీల వినియోగం, కార్యకలాపాల విస్తరణ, వినూత్నత, పరిశ్రమ నైపుణ్యం వంటి అంశాల్లో మైక్రోసాఫ్ట్‌ సహకారం అందించనుంది. ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, అంతరిక్షం, తయారీ, లాజిస్టిక్స్‌, రిటైల్‌, ఇ-కామర్స్‌ సహా పలు రంగాలకు చెందిన బీ2బీ, బీ2సీ అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. టై ముంబయి తోడ్పాటు అందించనున్న ఈ కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మొదటి అంచెలో తయారీ, లాజిస్టిక్స్‌, రెండో అంచెలో ఫిన్‌టెక్‌లపై దృష్టి సారించనున్నారు.


ఈ నెలాఖరు నుంచి ఎక్స్‌యూవీ700 డెలివరీ

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తన ఎక్స్‌యూవీ 700 వాహనాల డెలివరీని ఈ నెలాఖరులో ప్రారంభించనుంది. పెట్రోలు వేరియంట్‌లను అక్టోబరు 30 నుంచి, డీజిల్‌ వేరియంట్‌లను నవంబరు చివరి వారం నుంచి డెలివరీ ప్రారంభించనున్నట్లు ఎంఅండ్‌ఎం వెల్లడించింది. రెండు వారాల్లోనే ఈ వాహనానికి 65000 బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది. డెలివరీలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని అక్టోబరు 27 నుంచి ఆయా డీలర్‌షిప్‌లు కొనుగోలుదార్లకు తెలియజేస్తాయని కంపెనీ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని