66% తగ్గిన మారుతీ లాభం
close

Published : 28/10/2021 03:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

66% తగ్గిన మారుతీ లాభం

2 లక్షల వాహనాల ఆర్డర్లు పెండింగ్‌

దిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.487 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.1,420 కోట్లతో పోలిస్తే ఇది 66 శాతం తక్కువ. సెమీ కండక్టర్ల కొరత సహా కమొడిటీ ధరలు పెరగడం వల్లే లాభం బాగా తగ్గిందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.18,756 కోట్ల నుంచి రూ.20,551 కోట్లకు చేరింది. మొత్తం వాహన విక్రయాలు 3,93,130 నుంచి 3,79,541కు తగ్గాయి. దేశీయ విక్రయాలు కూడా 3,70,619 నుంచి 3,20,133కు తగ్గాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 59,408 వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఏడాది క్రితం ఇవి 22,511 మాత్రమే. ఎలక్ట్రానిక్‌ పరికరాల (సెమీ కండక్టర్‌ చిప్‌లు) కొరతతో సమీక్షా త్రైమాసికంలో 1.16 లక్షల వాహనాల ఉత్పత్తిని తగ్గించినట్లు మారుతీ తెలిపింది. సెప్టెంబరు 30 నాటికి 2 లక్షలకు పైగా వినియోగదార్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని, వీలైనంత త్వరగా వాటిని డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

2025 తర్వాతే విద్యుత్‌ వాహనాలు
* దేశంలో 2025 తర్వాతే విద్యుత్‌ వాహనాలను (ఈవీలు) విడుదల చేస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. నెలకు కనీసం 10,000 విద్యుత్‌ వాహనాలను అమ్మగలిగే పరిస్థితులు ఏర్పడ్డాకే ఈ విభాగంలోకి అడుగులు వేస్తామని ఆయన వెల్లడించారు.  
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ మోడళ్లకు గిరాకీ బాగా పెరిగినందున, వీటి ఉత్పత్తి పెంపుపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. నవంబరులో వాహన ఉత్పత్తి పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని