మొద‌టిసారి ఇల్లు కొంటున్నారా.. ఈ త‌ప్పులు చేయ‌కండి - first-house-buyer-avoid-these-mistakes-while-buying-a-home
close

Updated : 07/08/2021 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొద‌టిసారి ఇల్లు కొంటున్నారా.. ఈ త‌ప్పులు చేయ‌కండి

ఇల్లు కొనుగోలు అనేది పెద్ద నిర్ణ‌యం. సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకునే క్ర‌మంలో అప్ప‌టి వ‌ర‌కు చేసిన పొదుపును మొత్తం వినియోగించ‌డంతో పాటు రుణం కూడా తీసుకుంటారు. ప్ర‌స్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే గృహ రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తూ స‌హాయ ప‌డుతున్న‌ప్ప‌టికీ, ఈ అప్పు తీర్చేందుకు దీర్ఘ‌కాలం ఈఎమ్ఐలు చెల్లించాలి. ఇంతా క‌ష్ట‌ప‌డి సొంతిటి కల‌ను సాకారం చేసుకున్న త‌రువాత సంతోషంగా జీవించాలి కానీ క‌ష్ట‌ప‌డ‌కూడ‌దు. ఇందుకోసం ఇల్లు కొనుగోలు స‌మయంలో ఈ త‌ప్పులు చేయ‌కండి. 

1. బ‌డ్జెటే ఆలోచ‌న‌గా.. 
మొద‌టిసారిగా ఇల్లు కొనుగోలు చేస్తున్నవారు, తాము చూసిన ఇల్లు బ‌డ్జెట్‌లో ఉంటే చాలు కొనుగోలు చేసేందుకు ముందడుగు వేసేస్తారు. మిగిలిన విష‌యాల‌ను ప్ర‌క్క‌న పెట్టేస్తారు. బ‌డ్జెట్ ఒక్క‌టే ప్ర‌మాణికంగా తీసుకోకూడ‌దు. మిగిలిన విష‌యాల‌ను కూడా ప‌రిశీలించాలి. ఎందుకంటే అద్దెకు ఉన్న ఇల్లు న‌చ్చ‌క‌పోతే మ‌రో ఇల్లు అద్దెకు తీసుకుంటాం. కానీ ఒక‌సారి ఇంటిని కొనుగోలు చేసిన త‌రువాత న‌చ్చ‌క‌పోతే మారలేం క‌దా. అందుకే ఇల్లు ఉన్న ప్రాంతం, చుట్టుప్ర‌క్క‌ల వాతావ‌ర‌ణం, నీటి స‌దుపాయం, త‌దిత‌ర విషయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.  ప్ర‌స్తుతం మెట్రో, ఇత‌ర న‌గ‌రాల‌లో చాలా ప్రొప‌ర్టీల‌ను లాంచ్ చేస్తున్నారు. అలాగే రీసేల్ మార్కెట్‌లో కూడా చాలా ఆప్ష‌న్లు అందుబాటులో ఉంటున్నాయి.  

2. నిర్మాణం పూర్తైన‌ ఇంటినే కొనుగోలు చేయాల‌నుకోవ‌డం.. 
మొద‌టిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారు నిర్మాణం పూర్త‌య్యి నివ‌సించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. కార‌ణం అద్దె ఇంటికి చెల్లించే మొత్తాన్ని పొదుపు చేయాల‌నుకోవ‌డం. అయితే నిర్మాణంలో ఉన్న చాలా ఇళ్లు సిద్ధంగా ఉన్న ఇంటితో పోలిస్తే త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్నాయి. 

ప్ర‌స్తుతం అద్దె ఇంటిలో నివ‌సిస్తున్న వారు నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే,  పెట్టుబ‌డి కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాకుండా మీ జీవనశైలి, సౌక‌ర్యాలు, అభిరుచికి త‌గిన‌ట్లు ఇంటిని మార్చుకునే అవ‌కాశం ఉంటుంది.

3. ఇంటి వైశాల్యం ప‌రంగా రాజీ ప‌డ‌డం..
మొద‌టిసారి ఇల్లు కొనుగోలు చేసేవారిలో చాలామంది స్టూడియో అపార్ట్‌మెంట్‌లు లేదా ఒక బెడ్‌రూమ్‌ ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసేందుకు చూస్తారు. బ‌డ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వైశాల్యం విష‌యంలో రాజీ ప‌డ‌తారు. అయితే ఇవి బ్యాచ్‌ల‌ర్‌గా ఉన్న‌ప్పుడు స‌రిపోతాయి. కానీ.. పెళ్లి త‌రువాత కుటుంబం పెరుగుతుంది. అప్పుడు కుటుంబ అవ‌స‌రాల‌కు స‌రిపోక పోవ‌చ్చు. త్వ‌ర‌లోనే వివాహానికి ప్లాన్ చేసుకునే వారు  వైశాల్యం ప‌రంగా రాజీ ప‌డ‌కుండా త‌మ కుటుంబ‌ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు స‌రిపోయే విధంగా ఇంటిని కొనుగోలు చేయాలి. 

4. త‌క్కువ‌ డౌన్‌పేమెంట్ ..
రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసేవారు సాధ్య‌మైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ను చెల్లించ‌డం మంచిది. చాలా వ‌ర‌కు బ్యాంకులు, అప్పు ఇచ్చే సంస్థ‌లు ఇంటి విలువ‌లో క‌నీసం 20శాతం డౌన్‌పేమెంట్ చేయ‌మ‌ని చెప్తాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలోనే ఇంటి రుణం తిరిగి చెల్లించ‌వ‌చ్చు. దీర్ఘ‌కాలంలో వ‌డ్డీ రూపంలో చెల్లించే మొత్తాన్ని కూడా త‌గ్గించుకోవ‌చ్చు. 

5. రీసెర్చ్ చేయ‌కపోవ‌డం..
గృహ రుణానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందు సిబిల్ స్కోరును త‌ప్ప‌కుండా త‌నిఖీ చేయాలి. మంచి సిబిల్ స్కోరు నిర్వ‌హించేవారికి రుణం త్వ‌ర‌గా జారీ చేస్తాయి రుణ సంస్థ‌లు. మంచి సిబిల్ స్కోరు ఉంటే ఏ బ్యాంకు అయినా రుణం ఇచ్చేందుకు ముందుకు వ‌స్తుంది దాంతో త‌క్కువ వ‌డ్డీ రేటుకు రుణ ఇచ్చే సంస్థ‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు. అయితే గృహ రుణ ప‌త్రాల‌పై సంత‌కం చేసే ముందు  క్షుణ్ణంగా చ‌ద‌వాలి. ప్ర‌తీ చిన్న క్లాజ్‌ను అర్థం చేసుకోవాలి. దీంతో అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా, బ్యాంకులు స్టాంప్ డ్యూటి, రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు వంటివి చెప్ప‌క‌పోవ‌చ్చు. వాటిని గురించి పూర్తి వివ‌రాలు సేక‌రించాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల‌ ఇంటి కొనుగోలుకు అయ్యే ఖ‌ర్చుతో రిజిస్ట్రేష‌న్ పూర్త‌యి గృహ ప్ర‌వేశం చేసే వర‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేసి స‌రిప‌డ మొత్తాన్ని స‌మ‌కూర్చుకునేందుకు వీలుంటుంది. 

6. ప‌త్రాల విష‌యంలో అజాగ్ర‌త్త‌..
ఆస్తిని కొనుగోలు చేసే ముందు అమ్మ‌క‌పు ప‌త్రాల‌తో పాటు, త‌న‌ఖా, ఎన్‌క‌మ్‌బ‌రెన్స్ స‌ర్టిఫికేట్, ఇత‌ర ప‌త్రాల‌ను చెక్ చేయాలి. కొనుగోలు చేసే ఇంటికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉందా లేదా.. లీగ‌ల్‌ స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నాయా అనేది లాయ‌ర్‌ను సంప్ర‌దించి త‌గిన స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకోవాలి. 

ఇంటి నిర్మాణ విలువ‌లు(అపార్ట్‌మెంట్‌ పైపింగ్‌, ప్లాస్టర్ వ‌ర్క్‌, రూఫింగ్‌) త‌దిత‌ర అంశాల‌ను తెలుసుకునేందుకు నిపుణుడైన వ్య‌క్తికి ఇంటిని కొనుగోలు చేసే ముందే చూపించాలి. 

చివ‌రిగా..
మొద‌టిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారు పైన తెలిపిన అంశాల‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్‌పై ఆధార‌ప‌డ‌కూడదు. ఇంటిపై మీకు కొన్ని అభిరుచులు ఉంటాయి కాబట్టి త‌గిన ఇంటిని ఎంపిక చేసుకోవ‌డం కోసం ఎక్కువ మంది బ్రోక‌ర్ల సేవ‌ల‌ను వినియోగించుకోవ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. గృహ రుణం దీర్ఘ‌కాలం కొన‌సాగే రుణం అయిన‌ప్ప‌టికీ ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ప‌న్నును త‌గ్గించుకునేందుకు భార్య‌/భ‌ర్త‌ను జాయింట్ చేయచ్చు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని