నిర్భర బాట.. నిధుల వేట
close

Updated : 02/02/2021 06:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్భర బాట.. నిధుల వేట

ఆకర్షణీయ పథకాలకు దూరం... ఆదాయానికే ప్రాధాన్యం
ఆరోగ్య రంగం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట
వేతన జీవులకు కనిపించని ఊరట
పరిమితుల మధ్య నిమ్మళంగా 2021-22 బడ్జెట్‌
డిజిటల్‌ రూపంలో పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఈనాడు, దిల్లీ

ఆకర్షణీయ పథకాలు లేవు. తాయిలాలు అసలే లేవు. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు మాత్రం కాస్త పెద్దపీట వేశారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఆత్మనిర్భర్‌ పేరుతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.34,83,236 కోట్లతో ఆత్మరక్షణాత్మక బడ్జెట్టును ఆమె సోమవారం లోక్‌సభలో తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో ప్రవేశపెట్టారు. కరోనాతో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కార్యక్రమాలకే విత్త మంత్రి ప్రాధాన్యం ఇచ్చారు.

ఒకపక్క రైతుల ఉద్యమం, మరోపక్క ఆర్ధిక పరిస్థితులు, ఇంకోపక్క కరోనా ప్రభావం... వీటన్నిటి నడుమ సమతౌల్యం సాధించడానికి నిర్మల కొంగు బిగించారు. ఆరు స్తంభాలపై ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిలబెడుతున్నట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి.. ప్రధానంగా కేటాయింపులను వాటికే పరిమితం చేశారు. గత బడ్జెట్‌ సవరించిన అంచనాలతో పోలిస్తే ఈసారి అంచనాలు కేవలం రూ.32,000 కోట్లే ఎక్కువ. వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఏమాత్రం మార్పులు చేయకపోవడం వేతన జీవులను ఉసూరుమనిపించింది.  ఎక్కువ మొత్తంలో పీఎఫ్‌ వడ్డీ పొందేవారిపై పన్ను విధించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం బంగారం, వెండి సహా మరికొన్నింటిపై సెస్సు వేశారు. ఈ ఒక్క సెస్సు రూపంలోనే రూ.30,000 కోట్లు రానున్నాయని అంచనా. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు రాబట్టాలన్న భారీ ప్రణాళికను ఆమె పార్లమెంటు ముందుంచారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల రంగాలు రెండు కళ్లుగా నూతన బడ్జెట్‌ను ఆమె ఆవిష్కరించారు. జాతీయ రహదారులు, రైల్వేలకు చెరో రూ.లక్ష కోట్లకు పైగా కేటాయింపులు చూపించారు. ఇవి రెండూ సహా మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5.54 లక్షల కోట్లు మేర నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్యాన్ని మినహాయిస్తే సంక్షేమ పథకాల జాడేమీ లేదు. కీలకమైన అంశాలకే ప్రాధాన్యమిస్తూ ఆదాయానికి తగినట్టే కేటాయింపులు చేశారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు పరిమితిని పెంచారు. దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా కొన్నింటిపై కస్టమ్స్‌ సుంకాలను పెంచాలని విత్తమంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆమె బడ్జెట్టును ప్రవేశపెట్టడం వరసగా ఇది మూడోసారి.

సంక్షేమానికి కోత
బడ్జెట్‌లో ఈసారి కొత్త పథకాల జాడ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నవాటికే ఆచితూచి కేటాయింపులు చేశారు. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకించి రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. ఎరువులు, ఆహారం, పెట్రోలియం మీద రాయితీని బాగా తగ్గించారు. కేంద్ర పథకాలకు కేటాయింపులు నిరుడు రూ.12,63,690 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.10,51,703కోట్లకి తగ్గిపోయింది.
వైద్య రంగానికి జీడీపీలో 1.8%
కొవిడ్‌-19 కారణంగా మునుపెన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. సవరించిన అంచనాల ప్రకారం గతేడాది వైద్య రంగానికి జీడీపీలో 1.5% కేటాయించగా ఈసారి దానిని 1.8 శాతానికి (రూ.2,23,846 కోట్లు) పెంచారు. కొవిడ్‌ టీకాల కోసం రూ.35,000 కోట్లు కేటాయింపు చూపించారు. పీఎం ఆత్మనిర్భర్‌ స్వాస్థ్‌ భారత్‌ యోజన కింద ఆరేళ్లకు రూ.64,180 కోట్లు కేటాయించనున్నారు. వెల్‌నెస్‌ కేంద్రాలు, సమ్మిళిత ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలు, అత్యవసర ఆస్పత్రి విభాగాలను నిర్మించనున్నారు. రోగాలు రాకుండా, వస్తే నయం చేసేలా వైద్య రంగ బలోపేతానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పౌష్టికాహార పథకం, పోషణ్‌ అభియాన్‌ను కలిపి మిషన్‌ పోషణ్‌ 2.0ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా మన తయారీ రంగం విజేతగా అవతరించేందుకు 2021-22 నుంచి ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 13 రంగాల్లో అభివృద్ధి జరగనుంది. 100% బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గాల్లో విద్యుదీకరణ 2023కు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎన్నికల బాటలో..
రైతు ఉద్యమ నేపథ్యంలో కేంద్రం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని పెంచుతుందనుకుంటే ఆర్థికమంత్రి కోతపెట్టారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయిపులు తగ్గించారు. రాబోయే ఎన్నికలకు బాటలు వేయడానికి ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను ఉపయోగించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్‌లకు మాత్రమే భారీస్థాయిలో రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించడమే దీనికి కారణం. వనరుల సమీకరణ కోసం ఆర్థికమంత్రి ప్రైవేటీకరణపైనే ఎక్కువ ఆధారపడ్డారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటవుతూ వచ్చిన సైనిక్‌ స్కూళ్లను ఇకమీదట ఎన్‌జీఓలు, ప్రైవేటు పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో కలిసి దేశంలో 100 చోట్ల ఏర్పాటుచేస్తామని చెప్పడం కొత్త విషయం. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత వైద్యసేవా వ్యవస్థల బలోపేతానికి రూ.64,810 కోట్లు కేటాయించారు.
బడ్జెట్‌ ప్రసంగంలో పలుమార్లు ప్రతిపక్ష సభ్యులు అడ్డు తగిలారు. అప్పుడు నిర్మలా సీతారామన్‌.. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మాటలను, తమిళ మహాకావ్యం తిరుక్కురల్‌లోని అంశాలను ఉటంకించారు. ప్రసంగం ముగియగానే మంత్రి వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లి అభినందించారు.

వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి

వ్యవసాయ రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతులకు కొంతవరకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించింది. పత్తి దిగుమతిపై 10% కస్టమ్స్‌ సుంకం విధించింది. ముడి పట్టు, పట్టు దారంపై ఉన్న సుంకాన్ని 10% నుంచి 15 శాతానికి పెంచింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఆచితూచి కేటాయింపులు చేసింది. గతేడాది సవరించిన అంచనాల ప్రకారం వీటికి కేటాయింపులు రూ.1,45,355 కోట్లు ఉంటే ఈసారి స్వల్పంగా రూ.1,48,301 కోట్లకు పెంచింది. ఉపాధి హామీ పథకానికి 20-21 సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో రూ.1,11,500 కోట్లు కేటాయించగా ఈసారి రూ.73,000 కోట్లు కేటాయించారు. ఇక రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.4,78,196 కోట్లు కేటాయించడం గమనార్హం.

పన్ను ఊరట ఈసారీ లేదు

ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. పింఛను, డిపాజిట్లపై వడ్డీ పొందుతున్న 75 ఏళ్లు పైబడిన వృద్ధులు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వారు కట్టాల్సిన పన్నును బ్యాంకులు జమ చేసుకొని మిగతా సొమ్ము చేతికిస్తాయి. పింఛన్లకు గతేడాది సవరించిన పద్దు రూ.2,04,393 కోట్లు అయితే ఈసారి రూ.1,89,323 కోట్లే కేటాయించారు.

ముఖ్యాంశాలు

పీఎఫ్‌లో ఏడాదికి రూ.2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను

ఆరోగ్య రంగానికి 137% కేటాయింపులు పెంపు
కరోనా వ్యాక్సిన్‌కు రూ.35,000 కోట్లు
2030 నాటికి రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ
పీఎస్‌యూల భూముల అమ్మకానికి ప్రత్యేక సంస్థ
75ఏళ్లు దాటితే ఐటీ రిటర్నులు తప్పనిసరి కాదు
బంగారం, వెండిపై ‘వ్యవసాయ సెస్సు’
బీమా రంగంలో ఎఫ్‌డీఐలు ఇక 74%
పబ్లిక్‌ ఇష్యూకు రానున్న ఎల్‌ఐసీ!
బీపీసీఎల్‌, ఐడీబీఐ బ్యాంకు, ఒక బీమా సంస్థ ప్రైవేటీకరణ

అభివృద్ధే ఈ బడ్జెట్‌ లక్ష్యం

అభివృద్ధికి నూతన మార్గాలను విస్తృతం చేయడం, యువతకు వినూత్న అవకాశాలు సృష్టించడం, మానవ వనరులను కొత్త దిశలో నడిపించడం, మౌలిక సదుపాయాల కల్పనకు నూతన రంగాలను అభివృద్ధి చేయడం లాంటి లక్ష్యాలతో బడ్జెట్‌ రూపొందించాం.

-ప్రధాని మోదీ

దేశ ఆస్తుల్ని తన స్నేహితులకు కట్టబెట్టేందుకే..

దేశ ఆస్తుల్ని ఆశ్రిత పెట్టుబడిదారులైన తన స్నేహితులకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రణాళికలు వేసినట్లు అర్థమవుతోంది. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించి మన సైనికులను చంపింది. బడ్జెట్‌లో రక్షణ రంగానికి నిధులు ఎందుకు పెంచలేదు?

- రాహుల్‌ గాంధీ


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని