close

ఇన్ఫీ మరో బొనాంజా 

రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు బోర్డు పచ్చజెండా 
రూ.4 ప్రత్యేక డివిడెండుకూ సిఫారసు 
అక్టోబరు- డిసెంబరు లాభంలో 30% క్షీణత 
20% పెరిగిన ఆదాయం 
2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలు పెంపు

ఇన్ఫోసిస్‌ మరోమారు వాటాదార్లకు బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది. మెగా బైబ్యాక్‌, ప్రత్యేక డివిడెండుతో ముందుకొచ్చింది. రూ.8,260 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు (బైబ్యాక్‌) శుక్రవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. రూ.4 ప్రత్యేక డివిడెండుకు కూడా బోర్డు సిఫారసు చేసింది. అయితే అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి కంపెనీ మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. లాభం అంచనాలకు దూరంగా నిలవగా.. ఆదాయం అంచనాలకు మించి నమోదయ్యింది. అయితే 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఇన్ఫీ పెంచడం మరో చెప్పుకోదగిన విషయం. స్థిర కరెన్సీ రూపేణా ఈ ఆర్థిక సంవ్సత్సర ఆదాయంలో 8.5- 9% వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. అంతకుముందు 6-8% వృద్ధిని ఇన్ఫీ అంచనా వేసింది. కొత్త సీఈఓ సలీల్‌ పరేఖ్‌ కంపెనీని తిరిగి గాడిలో పెట్టేందుకు చేపడుతున్న చర్యలు క్లయింట్లలో తిరిగి విశ్వాసాన్ని నింపుతుండటం, డిజిటల్‌ లాంటి కీలక విభాగాల ఆకర్షణీయ పనితీరును దృష్టిలో ఉంచుకొని ఆదాయ వృద్ధి అంచనాలను కంపెనీ పెంచినట్లుగా కనిపిస్తోంది.

‘ క్లయింట్లలో విశ్వాసాన్ని తిరిగి నింపేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. క్లయింట్ల సంఖ్య పెరగడంతో మూడో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 10.1 శాతం వృద్ధిని నమోదుచేశాం. డిజిటల్‌ వ్యాపార విభాగానికి ఇది మరో గొప్ప త్రైమాసికం. ఈ విభాగ ఆదాయం 33.1 శాతం పెరిగింది. 157 కోట్ల డాలర్ల విలువైన పెద్ద ఆర్డర్లు రావడంతో మరింత ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయబోతున్నాం ’
- సలీల్‌ పరేఖ్‌, సీఈఓ, ఇన్ఫోసిస్‌ 
ఆదాయం 
అక్టోబరు-డిసెంబరులో ఆదాయం 20.3% వృద్ధి చెంది రూ.17,794 కోట్ల నుంచి రూ.21,400 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 3.8% పెరిగింది. గతేడాది జులై- సెప్టెంబరులో కంపెనీకి రూ.20,609 కోట్ల ఆదాయం వచ్చింది. జులై- సెప్టెంబరుతో పోలిస్తే డాలరు రూపేణా కూడా కంపెనీ ఆదాయం 2.2% పెరిగింది. ఆ సమయంలో 292.1 కోట్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగా.. ఇప్పుడు 298.70కోట్ల డాలర్లకు పెరిగింది. డిజిటల్‌ విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 33.1% పెరిగి 94.2 కోట్ల డాలర్లుగా నమోదైంది.
బైబ్యాక్‌ 
రూ.13000 కోట్ల మూలధన కేటాయింపు విధానంలో భాగంగా షేర్ల బైబ్యాక్‌, ప్రత్యేక డివిడెండు ఇచ్చేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. తాజా బైబ్యాక్‌ ప్రతిపాదనలో భాగంగా 10,32,50,000 ఈక్విటీ షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.800 ధర మించకుండా వీటిని బైబ్యాక్‌ చేయనుంది. ఇందులో రూ.8,260 కోట్ల (118 కోట్ల డాలర్లు) వరకు వెచ్చించనుంది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.4 (80%) ప్రత్యేక డివిడెండును చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.
అనుబంధ సంస్థలపై 
పనయాతో పాటు మరో రెండు అనుబంధ సంస్థలు స్కావా, కల్లిడస్‌ల విక్రయ యోచనను ప్రస్తుతానికి ఇన్ఫీ విరమించుకుంది. ఆశించిన ధరకు కొనుగోలుదార్లు ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం. కొనుగోలుదార్ల నుంచి తమకు అందిన ప్రతిపాదనలు, చర్చల పురోగతి ఆధారంగా 2019 మార్చి 31 కల్లా వీటి అమ్మకం పూర్తవ్వకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చామని కంపెనీ తెలిపింది. విక్రయించాల్సిన ఆస్తుల జాబితాలో నుంచి వీటిని తొలగించినట్లు పేర్కొంది. స్కావా, పనయాల వ్యాపారాలపై తిరిగి దృష్టి పెట్టే యోచనలో ఇన్ఫోసిస్‌ ఉంది. అక్టోబరు- డిసెంబరులో కొత్తగా 7,762 మంది ఉద్యోగులను ఇన్ఫీ నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2.25 లక్షలకు చేరింది.
లాభం 
సమీక్ష త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ రూ.3,610 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2017లో ఇదే కాలంలో నమోదైన రూ.5,129 కోట్లతో పోలిస్తే లాభం 30 శాతం తగ్గింది. గతేడాది జులై- సెప్టెంబరులో ఆర్జించిన రూ.4,110 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి లాభంలో 12.2 శాతం క్షీణత ఉంది. 
క్లయింట్లు 
సమీక్ష త్రైమాసికంలో కొత్తగా 101 క్లయింట్లను కంపెనీ జతచేసుకుంది. ఇందులో ఒకదాని ఆర్డరు విలువ 5 కోట్ల డాలర్లకు పైగా ఉండగా.. తొమ్మిదింటి ఆర్డర్ల విలువ 2 కోట్లకు పైనే. కోటి డాలర్లకు మించి విలువున్న విభాగంలో 18 క్లయింట్లు జతయ్యాయి.
మరోవిడత 
కిరణ్‌ మజుందార్‌షాను లీడ్‌ స్వత్రంత్ర డైరెక్టర్టుగా మరో విడత నియమించేందుకు ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డు అంగీకారం తెలిపింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 22 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.