close
ఆదాయం ఎంతైనా అప్రస్తుతం!

? నేను సరుకుల సరఫరా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. ప్రారంభంలో టర్నోవరు పెద్దగా ఉండదు కనుక నేను జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోదల్చుకోవడం లేదు. నా ఆలోచన కరక్టేనా. నేను ప్రారంభించాలని అనుకుంటున్న ఈ వ్యాపారంలో ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 50 శాతం పెట్టుబడిగా పెట్టాలని భావిస్తోంది. ఆ కంపెనీకి జీఎస్‌టీ లైసెన్సు ఉంది. ఇప్పుడు దీని వల్ల నా వ్యాపారానికి ఏమైనా సమస్యలు వస్తాయా

- గోరంట్ల సురేంద్ర బాబు

ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ భాగస్వామిగా చేరడం వల్ల మీ వ్యాపారానికి కానీ, ఆ కంపెనీకి కానీ ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు తెలంగాణలో వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తే వార్షిక టర్నోవరు రూ.20 లక్షలకు మించినప్పుడు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. అదే ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిస్తే అక్కడ రూ.40 లక్షలకు మించినప్పుడు జీఎస్‌టీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

? జీఎస్‌టీ లైసెన్సు ఉన్న విక్రయకేంద్రాలకు వార్షిక ఆదాయం ఎంత ఉండాలి. వార్షిక ఆదాయం ఆధారంగానే పన్ను చెల్లిస్తారా? జులై 31 తేదీలోగా ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది? కాటేజ్‌ వ్యాపారాలు చేసే వాళ్లు తప్పకుండా జీఎస్‌టీ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందా? ఆయా వ్యాపారాలకు సంబంధించి జీఎస్‌టీ సమాచారాన్ని తెలుసుకోవడం ఎలా

- హరిబాబు

వార్షిక ఆదాయంతో జీఎస్‌టీకి సంబంధం లేదు. వస్తువులు, సేవల అమ్మకాలపైనే జీఎస్‌టీ వర్తిస్తుంది. కాటేజీ వ్యాపారాలకు జీఎస్‌టీ విధానంలో ప్రత్యేక మినహాయింపు లేదు. నిర్దిష్ట టర్నోవరు మించితే తప్పకుండా జీఎస్‌టీ లైసెన్సు తీసుకొని ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి జీఎస్‌టీపై ప్రాథమిక అవగాహన కల్గించేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీబీఐసీ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్లో ప్రభుత్వం సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. వాటిని ఓ సారి అధ్యయనం చేయండి.

? వ్యాట్‌ నుంచి జీఎస్‌టీ విధానానికి మారినప్పుడు రాష్ట్రానికి బయట చేసిన కొనుగోళ్లపై చెల్లించిన సీఎస్‌టీకి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకోలేదు. జీఎస్‌టీ విధానంలోకి వచ్చాక అసలు కొనుగోళ్లే చేయలేదు. ప్రస్తుతం నా దగ్గరంతా రాష్ట్రానికి బయట కొనుగోలు చేసిన సరుకు నిల్వలే ఉన్నాయి. అప్పుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు క్లెయిమ్‌ చేసుకోలేదు కనుక.. ఇప్పుడు వాటిని నా సొంతానికి వాడుకుంటే మళ్లీ పన్ను చెల్లించాల్సి ఉంటుందా

- కె.ఫణి కుమార్‌

జీఎస్‌టీ విధానానికి మారే సమయంలో అంతకుముందున్న పన్ను విధానాల కింద చెల్లించిన పన్ను చెల్లింపులపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఇప్పటికే తీరిపోయింది. అందువల్ల ఇప్పుడు మీరు క్లెయిమ్‌ చేసుకునేందుకు వీల్లేదు. అలాగే వ్యాట్‌ విధానంలో రాష్ట్రానికి బయట చేసిన కొనుగోళ్లపై చెల్లించిన సీఎస్‌టీని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌గా క్లెయిమ్‌ చేసుకునే వీల్లేదు. ఇక మీ దగ్గర ఉన్న సరకు నిల్వలను సొంతానికి వాడుకుందామని అనుకుంటున్నారని చెప్పారు. అయితే ఇంతకుముందు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు క్లెయిమ్‌ చేసుకోలేనందున.. ఇప్పుడు క్రెడిట్‌ రివర్సల్‌ అవసరం ఉండదు. అలాగే మీరు పన్ను కూడా చెల్లించనక్కర్లేదు.

? మా అపార్ట్‌మెంట్‌లో 100 వరకు ఫ్లాట్లు ఉంటాయి. కరెంటు, మంచి నీటి సరఫరా లాంటి వాటికి¨ నిర్వహణ రుసుం కింద ఫ్లాటు యజమానుల నుంచి నెలకు ఇంత చొప్పున వసూలు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి లాభాపేక్ష ఉండదు. అయినా కూడా జీఎస్‌టీ వర్తిస్తుందా

- ప్రభాకర్‌ రావు పోతరాజు

జీఎస్‌టీ చట్టంలోని నిబంధనలు, జీఎస్‌టీ విభాగం ఇచ్చిన స్పష్టత ప్రకారం నిర్వహణ రుసుం నెలకు రూ.7,500 వరకు ఉంటే జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ రూ.7,500 మించితే 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. జీఎస్‌టీ విధానంలో ఎవరైతే సేవలు, వస్తువులను కొనుగోలు చేస్తారో.. ఆ వ్యక్తి వాటిని విక్రయించిన వ్యక్తికి జీఎస్‌టీ చెల్లించాలి. మీ విషయానికొస్తే.. ఉదాహరణకు టీఎస్‌ఎస్‌డీపీసీఎల్‌ నుంచి సేవలను అందుకుంటున్న వ్యక్తులు టీఎస్‌ఎస్‌డీపీసీఎల్‌కు జీఎస్‌టీ కట్టాలి.

? నేను ఇంతకుముందు ఒక కంపెనీలో వెల్డింగ్‌ వర్కర్‌గా పనిచేసేవాడ్ని. ఇప్పుడు అక్కడ మానేసి యంత్ర సామగ్రిని కొని మా ఇంట్లోనే సొంతంగా పనిచేస్తున్నా. నాకు ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయి. నేను ఏదేని సామగ్రి కొనుగోలు చేసినప్పుడు 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. నా షాప్‌నకు ఇంకా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ చేయలేదు. నా వార్షిక టర్నోవరు రూ.10 లక్షల్లోపే ఉంటుంది. అయినా కూడా నేను స్వచ్ఛందంగా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ చేయించుకొని.. నేను కొనుగోలు చేస్తున్న సామగ్రిపై చెల్లిస్తున్న జీఎస్‌టీని క్లెయిమ్‌ చేసుకోవచ్చా

- మహేందర్‌

నిర్దిష్ట టర్నోవరు కంటే తక్కువగా ఉన్నప్పటికీ మీరు స్వచ్ఛందంగా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ చేసుకొని మీరు చెల్లించే పన్నులను ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌గా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే మీరు జీఎస్‌టీ లైసెన్సు పొందాక జీఎస్‌టీ విధానంలో ఉండే అన్ని రకాల ప్రక్రియలు, నియమ నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. ఇన్‌వాయిస్‌ల జారీ, రిటర్న్‌ల దాఖలు, పద్దు పుస్తకాల నిర్వహణ లాంటివి మీరు చేయాల్సి ఉంటుంది.

? మేం సంస్థ పేరుపై జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్నాం. ఈ సంస్థలో ఎవరూ భాగస్వాములు లేరు. ఒక్కరే ప్రొప్రయిటర్‌. కాంపోజిషన్‌ కాకుండా సాధారణ జీఎస్‌టీ విధానాన్నే మేం ఎంపిక చేసుకున్నాం. ఎనిమిది నెలలుగా శూన్య రిటర్న్‌లు దాఖలు చేస్తున్నాం. జూన్‌ నుంచి వ్యాపారాన్ని ప్రారంభించాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వార్షిక టర్నోవరు దాదాపు రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం. టర్నోవరు రూ.20 లక్షల్లోపే ఉన్నందున. మేం జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అలాగే నెలవారీ రిటర్న్‌లు కూడా దాఖలు చేయనక్కర్లేదు కదా

- ఎస్‌.నాగభూషణం

మీరు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్నారని, ఎనిమిది నెలలుగా శూన్య రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారని చెప్పారు. అలాగే గత నెలలోనే వ్యాపారాన్ని ప్రారంభించారని అన్నారు. అయితే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్నాక.. నిర్దిష్ట వార్షిక టర్నోవరు పరిమితి ఎంత అన్నది అప్రస్తుతం అయిపోతుంది. రూ.20 లక్షలు మించినా.. మించకపోయినా.. ఒక్కసారి జీఎస్‌టీ లైసెన్సు వస్తే ప్రతి రూపాయి టర్నోవరు పన్ను పరిధిలోకి వచ్చేస్తుంది. 2019-20లో రూ.20 లక్షల్లోపే టర్నోవరు ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అలాంటప్పుడు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవడం మంచిది. లైసెన్సు రద్దయ్యాక మీరు వినియోగదార్ల నుంచి పన్నులు వసూలు చేయాల్సిన అవసరం ఉండదు. తిరిగి ఆ పన్ను మొత్తాన్ని ప్రభుత్వానికి కూడా చెల్లించనక్కర్లేదు. అదే జీఎస్‌టీ లైసెన్సు ఉన్నప్పుడు మాత్రం మీరు జీఎస్‌టీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పనిసరి.

? రిజిస్ట్రేషన్‌ సమయంలో ఫ్లాటు పూర్తి విలువ పైన జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందా? లేదంటే అప్పుడు ఎంత నిర్మాణం పూర్తయితే దాని విలువపై కట్టాలా? తెలియజేయగలరు

- హరిహరనాధ్‌

ఫ్లాటు కొనుగోలు సమయంలో నిర్మాణదారు, కొనుగోలుదారు ఏ ధరకు అంగీకారం కుదుర్చుకున్నారో ఆ పూర్తి ధరపై జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణదారు మాత్రం తాను ఇచ్చే రశీదుల ఆధారంగా ప్రతి నెలా రిటర్న్‌లు దాఖలు చేసి జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాటు రిజిస్ట్రేషన్‌ సమయంలో లేదా పూర్తి డబ్బులు చెల్లించేటప్పడు నిర్మాణదారు, కొనుగోలుదారు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తి విలువపై జీఎస్‌టీని నిర్మాణదారుకు కొనుగోలుదారు కట్టాలి.

? నేను జీడిపప్పు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి జీఎస్‌టీ వివరాలను తెలియజేయగలరు

- కిశోర్‌

మీరు ఏయే వివరాలను తెలియజేయాలని అడిగారో అనే దానిపై ప్రశ్నలో పూర్తి స్పష్టత లేదు. ఏ తరహా వ్యాపారాన్ని చేయనున్నారో అనే దానిపై కూడా పూర్తి వివరాలు ఇందులో చెప్పలేదు. జీడీపప్పుల తయారీ వ్యాపారం మాత్రమే చేయనున్నారా? లేదంటే ప్రాసెసింగ్‌ లేదా హోల్‌సేల్‌ లేదా రిటైల్‌ విక్రయం లేదా కమీషన్‌ ఏజెంట్‌ లేదా ఎగుమతిదారు లేదా దిగుమతిదారు కార్యకలాపాలు నిర్వహించనున్నారా? తదితరాలపై స్పష్టత లేదు. అంతేకాకుండా మీకు సరఫరాదారు ఎవరు.. కొనుగోలుదారులు ఎవరు అనే వివరాలు కూడా ఇందులో వెల్లడించలేదు. పూర్తి వివరాలు, ప్రశ్న అర్థవంతంగా ఉంటే సాధ్యమైనమేర మీ సందేహాలను తీర్చే ప్రయత్నం చేసేవాణ్ని. ఇప్పటికైతే ఈ విషయమై నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను.

? మేం మా కంపెనీ రిటర్న్‌లను క్రమం తప్పకుండా దాఖలు చేస్తుంటాం. జీఎస్‌టీ ఇండియా నుంచి మాకు ఒక సంక్షిప్త సందేశం (మెసేజ్‌) వచ్చింది. మీరు క్లెయిమ్‌ చేసుకోవాల్సిన దాని కంటే అధికంగా క్లెయిమ్‌ చేసుకుంటున్నారన్నది అందులోని సారాంశం. అయితే జీఎస్‌టీలో రిటర్న్‌లను సవరించి దాఖలు చేసుకునే వీల్లేకపోవడంతో 2017-18కు సంబంధించిన కొనుగోళ్ల వివరాలను 2018-19లో దాఖలు చేశాను. అందుకే ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను అధికంగా క్లెయిమ్‌ చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. దీనిపై ఎవరిని సంప్రదించాలి.

- శామ్యూల్‌, సచ్‌దేవ్‌ స్పోర్ట్స్‌ కంపెనీ

జీఎస్‌టీఆర్‌-1లో రిటర్న్‌లో జీఎస్‌టీ వివరాలను సరఫరాదారు తాను రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో పొందుపర్చాల్సి ఉంటుంది. అలాగే జీఎస్‌టీఆర్‌-2ఏ రిటర్న్‌లో కనిపించే వివరాలను ఆధారంగా చేసుకొని సరఫరాదారును సంప్రదించి కొనుగోలుదారు (గ్రహీత) తన రిటర్న్‌లు దాఖలు చేయాలి. అప్పుడు మీకు వచ్చినట్లుగా కొనుగోలుదారుకు లేదా గ్రహీతకు లేఖలు కానీ సందేశాలు కానీ రావు. ప్రస్తుత పరిస్థితిలో మీరు ఏ జీఎస్‌టీ అధికారి పరిధిలోకి వస్తారో వారిని సంప్రదించడం ఒక్కటే మీముందున్న పరిష్కారం. ఆ అధికారి కలిసి మీ సమస్యను, వివరణను తెలియజేయండి.

? మా సరఫరాదారు 2017-18లో జారీ చేసిన రశీదును 2018-19 జీఎస్‌టీఆర్‌-1 రిటర్న్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అయితే నేను జీఎస్‌టీఆర్‌-3బీ ద్వారా ఐటీసీని 2017-18లోనే క్లెయిమ్‌ చేసుకున్నాను. జీఎస్‌టీఆర్‌-9 వార్షిక రిటర్న్‌లో ఈ వివరాలను ఎలా చూపించాలి. నేను ఐటీసీని తిరిగి రివర్స్‌ చేయాల్సి ఉంటుందా? లేదంటే తిరిగి పన్ను కట్టాలా? రాబోయే సంవత్సరాల్లో ఈ ఐటీసీని ఎలా పొందాలి

- శ్రీధర్‌ కాసుకుర్తి

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించి జీఎస్‌టీలో ఉన్న నిబంధనల ప్రకారం.. మీరు కొనుగోలు చేసిన వస్తువులు లేదా పొందిన సేవలపై ఐటీసీని పొందే హక్కు ఉంది. ఆ ప్రకారమే మీరు జీఎస్‌టీని క్లెయిమ్‌ చేసుకున్నారు. మీకు జారీ చేసిన రశీదు వివరాలను సరఫరాదారు ఆలస్యంగా అప్‌లోడ్‌ చేసినంత మాత్రాన ఐటీసీ క్లెయిమ్‌ చేసుకునే విషయంలో మీ హక్కులేవీ మారవు. అందువల్ల ఆ వివరాలను మీ వార్షిక రిటర్న్‌లో చూపించండి. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందేందుకు ఒక షరతు ఏమిటంటే.. మీకు జారీ చేసిన రశీదుపై సరఫరాదారు పన్ను చెల్లించాలి ఉండాలి. రిటర్న్‌లు దాఖలు చేసి ఉండాలి. అందుకే దయచేసి ఈ విషయాలను ముందుగా ఆయనను అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఆయన రిటర్న్‌లు దాఖలు చేసి పన్ను చెల్లించానని చెబితే మీరు ఎటువంటి పన్ను కట్టనవసరం లేదు. ఒకవేళ ఆయన చెల్లించకుంటే మీరు వడ్డీతో కలిపి పన్ను కట్టాల్సి వస్తుంది.

? నా స్నేహితుడు తన స్థలాన్ని నాలుగు విభాగాలుగా విభజించాడు. ఇందులో ఒక భాగాన్ని తన కోసం అట్టేపెట్టుకొని, మిగిలిన మూడు తన ముగ్గురు కుమార్తెలకు పంచాడు. అయితే అందరూ ఆ స్థలంలో సంయుక్తంగానే నిర్మాణం చేయదల్చి దానిని నిర్మాణదారుకు అప్పగించారు. మొత్తం 10 ఫ్లాట్లను నిర్మాణం చేస్తే.. అందులో ఆరు వీళ్ల వాటా కిందకు వస్తాయి. అయితే ఈ ప్లాట్ల నిర్మాణంపై జీఎస్‌టీ చెల్లించమని వాళ్లను నిర్మాణదారు అడుగుతున్నారు. వాళ్లు జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుందా? ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకునే వీలుందా? తెలియజేయగలరు.

- పి.ఎస్‌.ఆర్‌.స్వామి

నిర్మాణదారు నిర్మాణ సేవలు అందించినందుకు గాను మీ స్నేహితుడు, ఆయన కుమార్తెలు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత అనేది.. నిర్మాణదారు బయటి వ్యక్తులకు ఫ్లాటును అమ్మిన విలువ ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంది. అలాగే మీ స్నేహితుడు, ఆయన కుమార్తెలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందే వీలుంది. ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. స్వాధీన ధ్రువీకరణ పత్రం వచ్చాక వాళ్లు నిర్మాణదారుకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. స్వాధీన ధ్రువీకరణ పత్రం వచ్చిన తర్వాత ఫ్లాటు బుకింగ్‌/ విక్రయం పూర్తయితే జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుంది. అప్పుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందే వీలుండదు. స్వాధీన ధ్రువీకరణ పత్రం రాకముందు నిర్మాణదారుకు జీఎస్‌టీ చెల్లిస్తే, దానిని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను స్వాధీన ధ్రువీకరణ పత్రం రాకముందు విక్రయించిన ఫ్లాట్లపై జీఎస్‌టీ చెల్లింపునకు ఉపయోగించొచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.