close
పెద్ద బ్యాంకులు కొన్ని చాలు

భారత ఆర్థిక పురోగమనంలో బ్యాంకులదే ప్రధాన పాత్ర. జాతీయీకరణ బ్యాంకింగ్‌ రంగంలో నవ శకానికి నాంది పలికి ఉండొచ్చుగాక..! కానీ, ఇప్పుడు అవే బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారాయనడం అతిశయోక్తి కాదేమో.. ఇందుకు కారణాలు అనేకం. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా ఉండడం కంటే కొన్ని పెద్ద బ్యాంకులు సరిపోతాయని ఈమధ్య వినవస్తున్న గట్టి వాదన.

నాణ్యతాపరంగా ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకులతో పోటీ పడాలంటే కొన్ని పెద్ద బ్యాంకులుంటే చాలునని ఆర్థిక నిపుణులే కాదు, ప్రభుత్వ వర్గాలూ ఎప్పటినుంచో చెబుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని బ్యాంకులను విలీనం చేయడం పెద్ద సానుకూలాంశం అవుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌లాంటి వాళ్లే అంటున్నారు. పరిమిత సంఖ్యలో బ్యాంకులు ఉండటం వల్ల వ్యయాలను గణనీయంగా అదా చేసుకోవచ్చునని వారు విశ్లేషిస్తున్నారు చైనా, ఐరోపాల్లో బ్యాంకులు పరిమాణంలో చాలా పెద్దవి. వాటి పరిమాణం ద్వారా కలిగే ప్రయోజనాలు ఆర్థిక వ్యవస్థకూ చేదోడుగా ఉంటున్నాయి. భారత్‌లోనూ కొన్ని మెగా బ్యాంకుల అవసరం ఉందని ఆర్థిక శాఖ కూడా అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అదే దిశగా అడుగులు వేస్తోంది కూడా. అందులో భాగంగానే దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఈమధ్యే విలీనం చేశారు. తద్వారా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తర్వాత భారత్‌లోనే అతిపెద్ద బ్యాంకుగా అది అవతరించింది. అంతక్రితం 2017లో కూడా ఎస్‌బీఐలో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకులను విలీనం చేశారు. అంతర్జాతీయంగా అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ అవతరించడానికి ఆ విలీనమే కారణం.

విలీనాలకు నేపథ్యం ఇదీ..
గత పాతికేళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు మూలధనం సర్దడమే ప్రభుత్వానికి సవాలుగా మారుతూ వస్తోంది. పీఎస్‌బీల్లో కనీస వాటాను 51 శాతం కంటే దిగువకు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించినా అది జరగలేదు. 1990ల్లో బ్యాంకుల్లోకి మూలధనం జొప్పించాల్సి వచ్చినపుడు అది ఒక్కసారే అని భావించారు. అయితే ఆ తర్వాత ఏ ఏడాదికాఏడాది డబ్బులు ఇవ్వాల్సి వస్తూనే ఉంది. ఎంత బలహీన బ్యాంకు అయితే అంత ఎక్కువ మూలధనం ఇవ్వాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో విలీనాల వల్ల బలమైన బ్యాంకులను సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది.

ఆ జాగ్రత్తలు తప్పనిసరి
1993లో జరిగిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)లో న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విలీనం ఆ కోవలోనిదే. ఆ తర్వాత నుంచి విలీనాల మాట వినిపిస్తూనే వచ్చింది. ఇటీవల కొన్ని జరిగినా.. మరిన్ని విలీనాల అవసరం అయితే ఉందని ప్రభుత్వ, ఆర్థిక శాఖ వర్గాలు కూడా నొక్కి చొబుతున్నాయి. ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ వంటి చిన్న బ్యాంకులను ఏదైనా పెద్ద బ్యాంకులో కలపాల్సి ఉంది. అయితే ఇక్కడ విలీనం చేసేటపుడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. బలహీన బ్యాంకును కష్టాల నుంచి బయటపడేసే ఉద్దేశంతో అప్పటికే బలంగా ఉన్న బ్యాంకును బలహీనపరచడం భావ్యం కాదు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా నాలుగింట మూడొంతుల వరకు ఉంది. పీఎస్‌బీల్లో వాటాను తగ్గించుకుంటే పునః మూలధన భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

విలీనం వల్ల లాభాలు
* కొన్ని మెగా బ్యాంకులే ఉంటే వాటిలో కార్పొరేట్‌ పాలన, నిర్వహణ సులువు కావడంతో పాటు.. వ్యయాలను తగ్గించుకొని ఆర్థికంగా బలపడవచ్చు.
* బ్యాంకుల పరిమాణం, వ్యాపారం, వినియోగదార్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు బ్యాంకుకు సాధికారత లభిస్తుంది. సాంకేతికతనూ అందిపుచ్చుకుని వేగంగా పరుగులు తీయవచ్చు.
* వ్యాపార, బ్యాంకింగ్‌ కార్యకలాపాల్లో సామర్థ్యం మెరుగవుతుఉంది. నష్ట భయాలు తగ్గుతాయి.
* అన్నిటి కంటే మించి లాభాలు పెరుగుతాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.