close
కాస్త చూసి మాట్లాడవోయ్‌!

మొబైల్‌ కాల్స్‌, డేటా ప్రియం
1 నుంచి ఛార్జీలు పెంచనున్న ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా

‘ప్రస్తుత పరిస్థితిలో వ్యాపారాన్ని నడపాలంటే ఛార్జీలు పెంచకతప్పదు. ఎందుకంటే టెలికాం రంగంలో చాలా పెట్టుబడులు అవసరం అవుతాయి. కొత్త సాంకేతికలపై ఎప్పటికప్పుడు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్‌ ఇండియా స్వప్నం సాకారం కావాలంటే టెలికాం పరిశ్రమ సహకారం ముఖ్యం. అందుకే డిసెంబరు 1 నుంచి ఛార్జీలను పెంచుతున్నాం. దీనికి తగ్గట్లుగా ఛార్జీల్లో హేతుబద్దీకరణకు ట్రాయ్‌ సంప్రదింపులు ప్రారంభించాలి’

- భారతీ ఎయిర్‌టెల్‌

‘మా వినియోగదార్లకు ప్రపంచ స్థాయి డిజిటల్‌ సేవల అనుభూతి కొనసాగుతుందనే హామీ ఇస్తున్నాం. తదనుగుణంగా డిసెంబరు 1 నుంచి టారీఫ్‌ రేట్లను పెంచనున్నాం’

-  వొడాఫోన్‌ ఐడియా 

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా మొబైల్‌ సేవలు ప్రియం కానున్నాయి. డిసెంబరు 1 నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనలో తెలిపాయి. అయితే టారీఫ్‌ రేట్లను ఎంత మేర పెంచనున్నాయో ఆ వివరాలను రెండు సంస్థలు వెల్లడించలేదు. జులై- సెప్టెంబరు త్రైమాసికానికి వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లు సంయుక్తంగా రూ.73,000 కోట్ల మేర నష్టాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు వెల్లడైన కొన్ని రోజుల్లోనే ధరలు పెంపునకు కంపెనీలు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అదీ ఓ కారణమా?
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పెక్ట్రమ్‌, లైసెన్సు రుసుం రూపేణా ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులకు భారీగా కేటాయింపులు చేశాయి. దీంతో వీటి లాభదాయకతలో భారీగా కోత పడింది. ఈ ప్రభావం కచ్చితంగా కార్యకలాపాల నిర్వహణపై ఉంటుంది. అందుకే బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తమకు ఎంతోకొంత ఉపశమనం ఇవ్వాలని అవి అడుగుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదు. తాజా ఛార్జీల పెంపునకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ఊరటపైనే తమ వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యం ఆధారపడి ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా అంటోంది. టెలికాం రంగంలో ఆర్థికపరమైన ఒత్తిడి నెలకొన్న విషయం సంబంధిత వాటాదార్లందరికీ తెలిసిందేనని, ఊరటనిచ్చే అంశాన్ని కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కార్యదర్శుల కమిటీ పరిశీలిస్తోందని తెలిపింది.

కొత్త పెట్టుబడుల్లేవ్‌..
వొడాఫోన్‌ ఐడియాలో వొడాఫోన్‌కు 45.39 శాతం వాటా ఉంది. అయితే వొడాఫోన్‌ ఐడియాలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని ఇప్పటికే వొడాఫోన్‌ స్పష్టం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూపు కూడా ఇప్పటికే ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకనుంచి అంతర్గతంగా సమీకరించే ఆదాయంపైనే వొడాఫోన్‌ ఐడియా ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఛార్జీలు పెంచితే ఆదాయం పెరుగుతుందన్నది కంపెనీ ఆలోచనగా తెలుస్తోంది. రిలయన్స్‌ జియో నుంచి ఎదురవుతున్న టారీఫ్‌ల పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌లు తమ వ్యాపారం విలీనం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా 40.8 కోట్ల మంది వినియోగదార్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఈ సంస్థ అవతరించింది. విలీనానంతరం కూడా కంపెనీని సమస్యలు వెంటాడుతున్నాయి. విలీనం నాటి నుంచి 10 కోట్లకు పైగా చందాదార్లను కంపెనీ కోల్పోయింది. ఇది లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు నెట్‌వర్క్‌ అభివృద్ధిపై పెట్టుబడులు పెడుతున్నా.. టారీఫ్‌లపై వస్తోన్న ఆదాయం పరిమితంగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు కొనసాగాయి. అందుకే వీటన్నింటికీ ఛార్జీల పెంపే పరిష్కారంగా భావించి ఆ దిశగా వొడాఫోన్‌ ఐడియా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* ట్రాయ్‌ గణాంకాల ప్రకారం.. ఒక గిగాబైట్‌ (జీబీ) మొబైల్‌ డేటా ధర 95 శాతం మేర క్షీణించి రూ.11.78కి పడిపోయింది.
* 2016 జూన్‌ నుంచి 2017 డిసెంబరు మధ్య నిమిషానికి కాల్‌ ఛార్జీలు కూడా 60 శాతం తగ్గి 19 పైసలకు దిగివచ్చాయి.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.